తెలంగాణలో మే 7 తర్వాత లాక్ డౌన్ ఎత్తేస్తారా..?

by vinod kumar |   ( Updated:2020-04-27 19:43:59.0  )
తెలంగాణలో మే 7 తర్వాత లాక్ డౌన్ ఎత్తేస్తారా..?
X

దిశ, న్యూస్ బ్యూరో:

మే 7 తర్వాత తెలంగాణ లో ప్రస్తుతం కొనసాగుతున్న లాక్ డౌన్ ఎత్తేస్తారా? సోమవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడిన మాటలు ఈ విషయాన్నే సూచిస్తున్నాయా? 28 జిల్లాల్లో కరోనా కొత్త కేసులు లేవనడం, రాబోయే రోజుల్లో మహమ్మారి తగ్గుముఖం పట్టవచ్చని పేర్కొనడం, లాక్ డౌన్ మే 7 వరకైతే ఉంటుందనడం ముఖ్యమంత్రి ఆలోచనా ధోరణిని ప్రతిబింబిస్తోందా? అంటే అవుననే అంటున్నాయి అధికార వర్గాలు. మీరూ ఆ సమావేశ వివరాలు చదువండి.

రాష్ట్రంలో కరోనా కొత్త పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ ఉండడం పట్ల ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుత ట్రెండ్ చూస్తూ ఉంటే కొద్ది రోజుల్లో కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యే సూచనలు ఉండకపోవచ్చని ధీమా వ్యక్తం చేశారు. రానున్న కొద్దిరోజుల్లో పాజిటివ్ కేసులే లేని రాష్ట్రంగా మారనుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కరోనా వైరస్‌పై ప్రగతి భవన్‌లో మంత్రులు, ఉన్నతాధికారులతో సుదీర్ఘ సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన ఆయన ప్రధానితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ విషయాలను కూడా చర్చించారు.

సమీక్షా సమావేశం అనంతరం ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో… కరోనా వైరస్ సోకిన వారిలో 97 శాతానికి పైగా బాధితులు కోలుకుని, డిశ్చార్జి అవుతుండడం మంచి పరిణామమన్నారు. మర్కజ్ వెళ్లి వచ్చినవారి ద్వారా వైరస్ సోకుతున్నవారి లింక్ మొత్తం గుర్తించి, అందరికీ పరీక్షలు నిర్వహించే ప్రక్రియ కొనసాగుతున్నదని వెల్లడించారు. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో ధోరణి (ట్రెండ్) చూస్తుంటే వైరస్ వ్యాప్తి చాలా వరకు తగ్గినట్లు స్పష్టమవుతోన్నదని, ప్రజలెవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని అన్నారు. ఏదైనా అనుకోని పరిస్థితుల్లో మళ్లీ పాజిటివ్ కేసులు వచ్చినా, వెంటనే గుర్తించి తగిన చర్యలు తీసుకోవడానికి వైద్య ఆరోగ్య శాఖ అన్ని విధాలా సంసిద్ధంగా ఉందని ప్రకటించారు. సోమవారం 159 మందికి పరీక్షలు నిర్వహించగా, కేవలం ఇద్దరికి మాత్రమే పాజిటివ్ వచ్చిందని, 16 మంది డిశ్చార్జి కూడా అయ్యారని తెలిపారు.

మంచి ఫలితాలు వచ్చాయి..

లాక్‌డౌన్ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయడం వల్ల వైరస్ వ్యాప్తిని సమర్థవంతంగా అరికట్టగలిగినట్లు తెలిపారు. విదేశీ ప్రయాణీకుల, మర్కజ్ యాత్రికుల లింకులన్నింటినీ దొరకబట్టి పరీక్షలు నిర్వహించి, చికిత్స అందించడం వల్ల మంచి ఫలితాలు వచ్చాయన్నారు. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నారాయణపేట, వరంగల్ రూరల్, వనపర్తి, నాగర్‌కర్నూల్, మహబూబాబాద్, సిద్దిపేట, యాదాద్రి-భువనగిరి, మంచిర్యాల జిల్లాల్లో ప్రస్తుతం ఒక్క పాజిటివ్ కేసు కూడా లేదని, జగిత్యాల, జనగామ, పెద్దపల్లి, సంగారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, నల్గొండ జిల్లాలు కూడా మంగళవారం (ఏప్రిల్ 28) నాటికి ఒక్క పాజిటివ్ కేసు లేని జిల్లాలుగా మారనున్నాయని తెలిపారు. దీంతో మొత్తం 21 జిల్లాల్లో వైరస్ ఉనికి లేనట్లేనని పేర్కొన్నారు. హైదరాబాద్, సూర్యాపేట, గద్వాల, వికారాబాద్ లాంటి ప్రాంతాల్లోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయని, మిగిలిన జిల్లాల్లో చాలా తక్కువ సంఖ్యలో పాజిటివ్ కేసులున్నాయని తెలిపారు.

ఆ సంఖ్య కూడా తగ్గుతోంది..

జీహెచ్ఎంసీ పరిధిలో 30 సర్కిళ్లు ఉంటే, చాలా సర్కిళ్లలో పాజిటివ్ కేసులు లేవని, కొన్సి సర్కిళ్లు యాక్టివ్ కేసులు లేని సర్కిళ్లుగా మారాయని, ప్రస్తుతం కొన్ని సర్కిళ్లకే వైరస్ పరిమితమైందన్నారు. యాక్టివ్ కేసులు తగ్గుతున్నా కొద్దీ కంటైన్మెంట్ల సంఖ్య కూడా తగ్గుతోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైరస్ సోకినవారి క్వారంటైన్ పీరియడ్ మే 8 నాటికి ముగుస్తున్నదని తెలిపారు. రానున్న కొద్ది రోజుల్లో ఒక్క పాజిటివ్ కూడా నమోదుకాకపోవచ్చని పేర్కొన్నారు. ఒకవేళ కొత్త కేసులు వచ్చినా వెంటనే గుర్తించి తగిన చర్యలు తీసుకోవడం కష్టమేమీ కాదన్నారు. టెస్టింగ్ కిట్స్, పిపిఇ కిట్లు, ఎన్ 95 మాస్కులు, మాత్రలు, పరికరాలు, బెడ్లు అన్నీ సిద్ధంగా ఉన్నాయని, ఎన్ని కేసులొచ్చినా చికిత్స చేయడానికి అన్ని ఏర్పాట్లు ఉన్నాయన్నారు. మే 7 వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని, ప్రజలు నిబంధనలు పాటించి సహకరించాలని కోరారు. అన్ని మతాలవారు ప్రార్థనా కార్యక్రమాలను, పండుగలను ఇండ్లలోనే చేసుకోవాలన్నారు.

Tags: CM KCR, Lockdown continues till May 7, kcr review meeting

Advertisement

Next Story