కరీంనగర్‌లో రెచ్చిపోతున్న మాఫియా.. తేడా వస్తే మర్డర్..!

by Anukaran |   ( Updated:2021-06-21 23:24:52.0  )
Local Land Mafia Hulchul
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: ల్యాండ్ మాఫియా యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతోంది. ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ దాడులకు పాల్పడుతున్నారు. కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో భూముల రేట్లకు ధరలు పెరగడంతో భూ దందాలు పెరిగిపోయాయి. దీంతో దాడులకు కూడ పూనుకుంటున్న పరిస్థితి తయారైంది. ల్యాండ్ మాఫియాను కట్టడి చేసేందుకు కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఇప్పటికే ల్యాండ్ గ్రాబర్స్, హిస్టరీ షీట్లు తయారు చేసి హెచ్చరికలు జారీ చేసినా ఫలితం లేకుండా పోయింది. భూ దందాలకు పాల్పడుతున్న వారు రోజు రోజుకు మితిమీరి పోతున్నారు. సోమవారం కరీంనగర్ శివార్లలో జరిగిన దాడే ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు.

సర్కార్ ఆదాయానికి గండి..

వ్యవసాయ భూములను నివేశన స్థలాలుగా మార్చడానికి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అసెస్‌మెంట్ (నాలా) యాక్టు ప్రకారం కన్వర్షన్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబందిత రెవెన్యూ కార్యాలయాల్లో దరఖాస్తు చేసి డబ్బులు చెల్లించాలి. అలాగే రియాల్టర్లు ఖచ్చితంగా ప్లానింగ్ వింగ్ నుండి అనుమతులు తీసుకుని వెంచర్‌లో రోడ్లకు, కమ్యూనిటీ అవసరాలకు భూమి వదిలి డెవలప్ చేయాలి. ఇందుకు అవసరమైన భూమిని మునిసిపల్ పరిధిలో అయితే టౌన్ ప్లానింగ్, గ్రామీణ ప్రాంతాల్లో అయితే జిల్లా గ్రామీణ, పట్టణ ప్లానింగ్ ఆఫీసు నుండి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఆయా శాఖల నుంచి అనుమతులు తీసుకుంటే తమపై ఆర్థిక బారం పడుతుందని భావిస్తున్న రియాల్టర్లు సరికొత్త స్కెచ్ వేశారు. సర్కారుకు చెల్లించే డబ్బులను ఆదా చేసుకుని ప్లాట్లు కొంటున్న సామాన్యులపై భారం వేస్తున్నారు. ఆయా శాఖల నుంచి అనుమతులు తీసుకోకుండానే వ్యవసాయ భూమి విక్రయిస్తున్నామని రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. రానున్న కాలంలో ప్లాట్లు కొన్న వారు ఇళ్లు కట్టుకోవాలంటే ల్యాండ్ రెగ్యూలరైజేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అసలు విషయాన్ని కప్పిపుచ్చుతున్న రియాల్టర్లు కస్టమర్లను నిండా ముంచుతున్నా నియంత్రించే వారే లేకుండా పోయారు. సంబందిత శాఖల అధికారులు ఈ విషయంపై దృష్టి సారించకపోవడంతో ఈ పరిస్థితి తయారైంది.

ఫేక్ డాక్యూమెంట్ల దందా..

ఫేక్ డాక్యూమెంట్ల దందా కూడా కరీంనగర్ కేంద్రంగా సాగుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఏదో రకంగా రికార్డులను తయారు చేసి పంచాయితీలు సృష్టిస్తున్నారు. దీంతో సామాన్యలు కోర్టుల చుట్టూ తిరగడం ఎందుకని వారు అడిగినంత సొమ్ము ముట్ట చెప్తున్నారు. ఈ దందా నిర్వహిస్తున్న స్పెషల్ టీంలపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భూ దందాలు సివిల్ అంశమని, కోర్టులను ఆశ్రయించాలని పోలీసులు చెప్తారన్న ఆలోచనతో లిటిగేషన్ గాల్లకు తృణమో ప్రణమో ముట్టచెప్పి సెటిల్ చేసుకుంటున్నారు చాలామంది.

గతంలో ఓ హత్య..

సోమవారం రేకుర్తి శివార్లలో జరిగిన హత్యా యత్నం ఘటనలో నిందితుడు దాదాపు 13 ఏళ్ల క్రితం జరిగిన ఓ మర్డర్ కేసులో నిందితుడుగా ఉన్నట్టు తెలుస్తోంది. అప్పుడు కూడ భూ లావాదేవీల కారణంగానే హత్యకు పాల్పడినట్టు పోలీసుల విచారణలో తేలింది. తాజాగా మరో వ్యక్తిపై హత్యా యత్నానికి పాల్పడడం విశేషం. భూ దందాల్లో జరుగుతున్న ఆర్థిక లావాదేవీల కారణంగానే ఈ ఘటన చోటు చేసుకున్నట్టు స్పష్టం అవుతోంది. ల్యాండ్ మాఫియా రెచ్చిపోతున్న తీరుపై స్పెషల్ ఎఫర్ట్స్ పెట్టకుంటే మరిన్ని దారుణాలు చోటు చేసుకుంటాయన్న విషయాన్ని అధికారులు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Advertisement

Next Story

Most Viewed