‘మారటోరియం పొడిగింపు అవసరంలేదు’

దిశ, వెబ్‌డెస్క్: గత వారం హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్ ఛైర్మన్ దీపక్ పరేఖ్ లోన్ మారటోరియం పొడిగించనవసరం లేదని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆయన అభిప్రాయాలను కొనసాగిస్తూ ఎస్‌బీఐ ఛైర్మన్ రజనీష్ కుమార్ సైతం మారటోరియం ఆగష్టు తర్వాత పొడిగించొద్దని అన్నారు. ఆగష్టు 31 తర్వాత మారటోరియం అవసరం లేదని నాతో సహా చాలామంది బ్యాంకర్లు నమ్ముతున్నారు. చెల్లింపులకు ఆరు నెలల సమయం సరిపోతుందని తాము విశ్వసిస్తున్నట్టు రజనీష్ కుమార్ తెలిపారు.

రుణం తీసుకున్న వారు చెల్లించే స్థోమత ఉన్నా.. మారటోరియం విధించడంతో చెల్లించడం లేదన్నారు. దీన్ని అవకాశంగా మలచుకొని చెల్లించడం లేదన్నారు. ఈ పరిణామాలు దుర్వినియోగం అయి బ్యాంకులను దెబ్బతీస్తుందని చెప్పారు. ప్రస్తుతం బ్యాంకుల వద్ద రూ. 40 లక్షల కోట్లు మారటోరియం కింద ఉంది. ఇందులో కార్పొరేట్ రంగానికి ఇచ్చిన రిటైల్, టర్మ్ లోన్లు రెండూ ఉన్నాయి.

మారటోరియం కొనసాగితే బ్యాంకులకు నిరర్ధక ఆస్తులు పెరిగే అవకాశాలున్నాయని రజనీష్ అభిప్రాయపడ్డారు. సుధీర్ఘ విరామం తర్వాత ఆగష్టు నుంచి మారటోరియం పొడిగింపు గురించి ఆర్థిక మంత్రిత్వ శాఖ వివిధ పరిశ్రమ వర్గాలతో, బ్యాంకులతో సంప్రదింపులు జరిపింది. ఆటోమొబైల్, స్టీల్, హాస్పిటాలిటీ, రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లోని సంస్థలకు మారటోరియం నవంబర్ వరకు కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం.

Advertisement