నరేగా చట్టంపై సమగ్ర విశ్లేషణ

by Ravi |   ( Updated:2024-10-13 23:30:56.0  )
నరేగా చట్టంపై సమగ్ర విశ్లేషణ
X

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం(నరేగా) మన దేశంలో పేదరిక నిర్మూలన కోసం జరిగిన ప్రయత్నాలలో ముఖ్యమైనది. 2005లో చట్టం అమలులోకి వచ్చినప్పటి నుండి ఆంధ్ర ప్రదేశ్ విభజన జరిగీ తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు జరిగే వరకూ మన దగ్గర ఈ చట్టం గురించి చర్చలు చాలా ముమ్మరంగా జరిగేవి, చట్టం అమలుపైన పలు సంఘాలు, సంస్థలు పనిచేసేవి. ఐతే కారణాలు ఏవైనా క్రమంగా క్షేత్ర స్థాయిలో ఉపాధి హామీ చట్టం పైన పనిచేస్తున్న వారు గణనీయంగా తగ్గిపోయారు, చర్చలు కూడా జరగడం లేదు. ఈ నేపథ్యంలో చక్రధర్ బుద్ధ పుస్తకం ‘ఉపాధి హామీలో హక్కుల సంగతులు’ వచ్చిందన్న విషయం గుర్తు చేసుకోవాలి.

వివరంగా విశ్లేషించి..

ఒక దళిత హక్కుల కార్యకర్తగా ఈ చట్టం పేద, దళిత వర్గాలపై చూపగలిగే సానుకూల ప్రభావాన్ని గురించి నాకు ఒక అంచనా ఉంది. ఐతే ఈ పుస్తకంలో రచయిత ‘చక్రధర్ బుద్ధ’ ఈ అంశాన్ని మరింత వివరంగా విశ్లేషించారు. తెలుగులో ఈ చట్టంపై పరిశీలనాత్మక రచనల సంఖ్య తక్కువగా ఉండగా, ఈ పుస్తకం ఆ లోటును భర్తీ చేస్తుంది. ముఖ్యంగా, ఈ పుస్తకం తెలుగు వాచకుల కోసం ప్రత్యేకంగా రాయడం వలన 'నరేగా' లోని సాంకేతిక, గణాంక అంశాలు సులభంగా అర్థమయ్యేలా ఉన్నాయి. సాధారణంగా 'నరేగా'‌పై ఎక్కువ రచనలు ఇంగ్లిష్‌లో రానుండగా, తెలుగులో ఈ పుస్తకం వెలువడటం అందరికీ, ముఖ్యంగా పేద, అట్టడుగు వర్గాల కార్యకర్తలకు ఎంతో ప్రయోజనకరం. ఈ పుస్తకం, ఆ చట్టంలో సాంకేతికతను అర్థం చేసుకోవడంలో ఉన్న సవాళ్లను పరిష్కరించడంలో సహాయపడుతుంది. 2014 తర్వాత తెలుగులో వచ్చిన 'నరేగా' పై రచనలు అరుదుగా ఉండటం, ఈ పుస్తకం ఆ లోటును భర్తీ చేయడంలో ఒక కీలకమైన పాత్ర పోషిస్తుంది.

పుస్తకంలోని అధ్యాయాలు

మొత్తం మూడు అధ్యాయాలుగా విభజించిన ఈ పుస్తకం, మొదటి అధ్యాయం 'నరేగా' ‌చట్టానికి పరిచయం ఇస్తుంది. రెండవ అధ్యాయంలో చట్టం అమలులో తలెత్తే సాంకేతిక సమస్యలను, డిజిటల్ చెల్లింపులు, ఆధార్ అనుసంధానం వంటి అంశాలను చర్చిస్తారు. మూడవ అధ్యాయం చట్టం అమలులోని పరిష్కార మార్గాలపై దృష్టి సారిస్తుంది. మొత్తం 20 వ్యాసాలు ఉండగా, వాటిలో ఒక వ్యాసం ముఖ్యమైన గణాంకాలను అందిస్తుంది. ఇది పథకాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవడంలో దోహదం చేస్తుంది.

చక్రధర్ 'నరేగా' లోని హక్కుల-ఆధారిత అవగాహనను, అమలులో ఉన్న సాంకేతిక సమస్యలను సమతుల్యంగా చర్చించారు. కొవిడ్-19 సంక్షోభ సమయంలో 'నరేగా' ఎలా పేద వర్గాలకు ఆర్థిక అండగా నిలిచిందో కూడా సుస్పష్టంగా వివరించారు. చట్టం అమలులో ఉన్న సమస్యలను మాత్రమే కాకుండా, వీటి పరిష్కార మార్గాలను కూడా సమర్థవంతంగా ప్రతిపాదించారు.

సాధికారత కోసం పుస్తకం

గ్రామీణ అభివృద్ధి, దళిత హక్కులు, సామాజిక న్యాయం, లేదా విధాన రూపకల్పనలో పనిచేసే వారికి ఈ పుస్తకం ఒక మార్గదర్శిగా ఉంటుంది. 'నరేగా'‌ని కేవలం ప్రభుత్వ పథకంగా కాకుండా, అట్టడుగు వర్గాల సాధికారతకు తోడ్పడే సాధనంగా చూడాలని ఆశించే వారికి ఈ పుస్తకం విలువైన రీసోర్స్. పుస్తకంలోని వ్యాసాల సూచిక, ప్రతి వ్యాసం గురించి పరిచయం చేస్తూ 2-3 వాక్యాలతో రూపొందించడం మరింత చదవడానికి సులభతరంగా మారుస్తుంది. ఈ పుస్తకానికి ప్రముఖ సివిల్ సర్వెంట్ డాక్టర్ పీవీ రమేష్ రాసిన ముందుమాట, పుస్తకంలోని అంశాలను సమర్థంగా పరిచయం చేస్తూ, 'నరేగా' యొక్క ప్రాధాన్యతను వివరించి సమాజంలో చైతన్యాన్ని పెంచేలా ఉన్నది. అసలు ఉపాధి హామీ చట్టం లాంటి కార్యక్రమాలు దండగ అని ప్రభుత్వాలు అనవసరంగా వీటిపై డబ్బు ఖర్చు చేస్తున్నాయని ఒక అభిప్రాయం చాలా మందిలో ఉంది. వారు ఈ పుస్తకం చదివితే తమ అభిప్రాయం మార్చుకునే అవకాశం ఉంది.

పుస్తకం పేరు: ఉపాధి హామీలో హక్కుల సంగతులు

రచయిత: చక్రధర్ బుద్ధ

ప్రచురణ: ఛాయా బుక్స్, హైదరాబాద్

ప్రతులకు సంప్రదించండి : 79895 46568

పుస్తకం పేజీలు: 144

వెల: 150/-


సమీక్షకులు

పి. శంకర్

జాతీయ కార్యదర్శి, దళిత బహుజన్ ఫ్రంట్

92465 22344

Advertisement

Next Story

Most Viewed