రచయితలే అపర బ్రహ్మలు

by Ravi |   ( Updated:2023-12-10 19:16:06.0  )
రచయితలే అపర బ్రహ్మలు
X

ఇప్పుడు నేను చెప్పే అనుభవం అందరికీ జరిగే ఉంటుంది. చిన్నప్పుడు నాన్న వెంట బేకరీకో, అమ్మ వెంట కిరాణా కొట్టుకో వెళ్లినప్పుడు రకరకాల పదార్థాలు మన కంటి ముందు అందంగా నాట్యం చేస్తూ కనిపిస్తుంటాయి. మనం అది కావాలి, ఇది కావాలి, చివరకు మొత్తం కావాలి అనే ఆత్రుతతో చాలా కొనేయాలని చూస్తూ ఉంటాం! అప్పటికింకా మనకు ఓటు హక్కు, పాన్ కార్డు రాని కారణంగా మన జేబులో డబ్బులుండవు. నిజానికసలు జేబులే ఉండవు! అయినా ఆత్రం కొద్దీ అమ్మని, నాన్నని బతిమాలూతూ ఉంటాం. వాళ్లు మొదట వద్దని చెప్పి, ఆపై కసిరి, అటు చివర ఒక దెబ్బ వేసి మన నోరు మూయిస్తారు. మనం అడిగిన వాటిలో వాళ్లకు నచ్చిందొకటి కొనిచ్చి దాంతో సర్దుకోమంటారు!

ఆ క్షణాన వాళ్లలో మనకు నికార్సయిన విలన్లు కనిపిస్తారు. అదీ ఎట్లాంటి విలన్లు.. తెలుగు రాని తెల్లరంగు హిందీ విలన్లా ఛాఛ! తేట తెలుగు మాటల మూటలైన రామిరెడ్డి, తెలంగాణ శకుంతల కనిపిస్తారు. మనం వాళ్ళ సొంత పిల్లలం కాదేమో, బయటెక్కడో దొరికితే తెచ్చి పెంచుతున్నారేమో అనే అనుమానం మొదలై, ఉక్రోషం ముంచుకొస్తుంది. అయినా ఏమీ అనలేని భయం మూలాన మౌనంగా నోరు మూసేసి వాళ్లు చెప్పింది వింటాం! లోలోపల మాత్రం చిన్న సైజు అగ్ని పర్వతాలు బద్దలవుతుంటాయి. నాకూ టైం వస్తుంది. రేపు నేనూ పెద్దోడినవుతా! నాకొచ్చే జీతంతో ఇవేంటి ఈ షాప్ మొత్తం కొనేస్తా! దీని పేరు మార్చి నా పేరు పెడతా! నా పిల్లలు ఏదడిగినా కాదనను. అన్నీ ఇప్పిస్తా! వాళ్లకు నేను విలన్ కాదు, హీరోని అనుకుంటాం. దరిమిలా మనం పెద్దవుతాం. Slam Bookలో రాసినట్టు 'పైలెట్, ఐఏఎస్ అధికారి, డాక్టర్' కాకపోయినా ఏదో ఒక ఉద్యోగంలో చేరతాం! డబ్బులూ వస్తాయి. కానీ ఆ చిన్నతనంలో మనం కొనాలని అనుకున్న దుకాణం విషయం మాత్రం గుర్తుండదు. ఆ సంగతే మర్చిపోయుంటాం! ఆ దుకాణం కూడా ఎక్కడో కాలగర్భంలో కలిసిపోయి ఉంటుంది.

లక్కీగా నేను చిన్నప్పుడు కొందామని అనుకున్న బేకరీ ఇంకా నడుస్తూనే ఉంది. నాకు ఉద్యోగం వచ్చాక ఒక వంద సార్లయినా ఆ షాప్ ముందే తిరిగి ఉంటాను. ఇప్పటిదాకా లోపలికి అడుగు పెట్టలేదు. పెద్దయ్యాక ఆ షాప్ కొంటానని శపథం పూనిన నేను ఉద్యోగం వచ్చాక అందులోకి వెళ్లి కనీసం ఒక చాక్లెట్ కూడా కొనలేదు. అదే జీవితంలో అతి పెద్ద ఐరనీ! ఏవేవో అనుకుంటాం, ఏవేవో ఆలోచనలు చేస్తాం, ఏదో సాధించాలని ప్రణాళికలు వేస్తాం. చివరకు కాలం అనే మాయల మరాఠీ వాటిలన్నింటినీ మరిచిపోయేలా చేస్తుంది. మరేదో కొత్త దారి చూపిస్తుంది.

కథారచయిత శ్రీరమణ గారి కథల్ని మనం చేయాల్సినంతగా సెలబ్రేట్ చేయలేదేమోనని నాకనిపిస్తూ ఉంటుంది. తెలుగులో అత్యద్భుతమైన కథలు రాసిన ఆయనికి మనవాళ్లు ఇవ్వాల్సినంత గుర్తింపు ఇచ్చినట్టు లేరు. 'మిథునం' కథ కూడా సినిమాగా ముందు రచ్చ(మలయాళంలో) గెలిచి, ఆపైన ఇంట(తెలుగులో) గెలిచింది. ఆయన రాసిన 'షోడా నాయుడు' అనే కథ ఒకటి ఉంది. వాహ్! తెలుగువాళ్లం అని చెప్పుకునేవారంతా నెత్తిన పెట్టుకోవాల్సిన కథ అది. చిన్ననాడు షోడా సీసాలోని గోళీ కోసం తపన పడే కుర్రాడు, దాని కోసం ప్రయత్నించి షోడాలమ్మే నాయుడి దగ్గర భంగపడతాడు. ఆపై పెద్దయి, సర్కారు నౌకరీ వచ్చింతర్వాత ఆ నాయుడు అప్పు మంజూరు కోసం అతని దగ్గరకు వస్తాడు. ఆ క్షణాన వాళ్ల మధ్య సంభాషణ మీరు చదివి తీరాలి! చివరగా నాయుడు వెళ్లిపోతూ ఆనాటి పిల్లాడు, ఈనాటి అధికారి అయిన అతనికి తన జేబులో నుంచి గోళీలు తీసి ఇస్తాడు. ఎంత గొప్ప కథ! చదివాక మర్చిపోవడం కష్టం!

వేంపల్లె షరీఫ్ అన్న కూడా ఇలాంటిదే ఒక కథ రాశారు. పేరు గుర్తు రావడం లేదు. ఒక పిల్లాడిని మాస్టారు బాగా తిడుతూ, కొడుతూ ఉంటాడు. ఆయనంటే ఆ పిల్లాడికి కోపం. తాను పెద్దయ్యాక ఎలాగైనా ఆయన మీద పగ తీర్చుకోవాలని ఆ విద్యార్థి అనుకుంటాడు. పెద్దయ్యాక అతనికి ఉద్యోగం వస్తుంది. తనకు ఉద్యోగం వచ్చిన సంగతి ఆ మాస్టారికి చెప్పి ఆయనను అవమానించాలని, ఆయన మీద పగ తీర్చుకోవాలని ఆయన ఇంటికి వెళ్తాడు. అప్పటికి ఆ మాస్టారు వృద్దాప్యంలో ఉన్నాడు. తోడుగా భార్య మాత్రం ఉంది. పిల్లలు ఎక్కడెక్కడో స్థిరపడ్డారు. ఇక్కడ ఈ జంట ఒంటరిగా ఉన్నారు. రాకరాక తన కోసం వచ్చిన శిష్యుడిని చూసి ఆ మాస్టారు చాలా సంబరపడ్డాడు. ఆప్యాయంగా పలకరించి మర్యాద చేశాడు. అతనికి ఉద్యోగం వచ్చిందని తెలిసి తన భార్యతో గర్వంగా చెప్పాడు. ఆయన ప్రవర్తన చూసి ఆ విద్యార్థి ఆశ్చర్యపడతాడు. తాను పగ తీర్చుకోవడానికి వచ్చాననే సంగతి గుర్తొచ్చి పశ్చాత్తాపపడతాడు. తన తండ్రి కోసం కొన్న కళ్ళజోడు మాష్టారుకు కానుకగా ఇచ్చి, ఆయన ఆశీర్వాదం తీసుకుని వచ్చేస్తాడు. మనసును తాకే గాఢమైన కథ. కనువిప్పు కలిగించే కథ.

ఎవరండీ బ్రహ్మ? ఆయన తలరాతలు రాస్తే రాస్తారు కావొచ్చు! ఆయన ఇలాంటి కథలు రాయగలరా? బాల్యం గురుతులని, యవ్వనంలోని వాస్తవికతను ముడిపెట్టి కంటిముందు నిలపగలరా రచయితలే గొప్ప! ముమ్మాటికీ వాళ్లే గొప్ప!

- విశీ

రచయిత, సమీక్షకులు

90108 66078

Advertisement

Next Story

Most Viewed