'గవాయి 'కి సినారె పురస్కారం

by Ravi |
గవాయి కి సినారె పురస్కారం
X

సాహితీ గౌతమి (జిల్లా సాహితీ సంస్థల సమాఖ్య) కరీంనగర్, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత సి.నారాయణరెడ్డి పేరు మీద యేటా ఇస్తున్న తెలుగు రాష్ట్రాల స్థాయి సినారె పురస్కారాన్ని 2021 సంవత్సరానికి గాను అన్నవరం దేవేందర్ 'గవాయి' కవితా సంపుటి ప్రకటించినది. రెండు రాష్ట్రాల నుంచి ఈ పురస్కారానికి 78 ఎంట్రీలు వచ్చాయి. ముగ్గురు న్యాయనిర్ణేతలు 'గవాయి'ని ఎంపికర చేశారు. సాహితీ గౌతమి గత 37 సంవత్సరాలుగా ఇస్తున్న ప్రతిష్టాత్మక పురస్కార ప్రదానోత్సవం త్వరలో ఉంటుందని సినారె పురస్కార కమిటీ చైర్మన్ డా. ఎడవెల్లి విజయేంద్ర రెడ్డి, సాహితీ గౌతమి అధ్యక్షులు డా. గండ్ర లక్ష్మణరావు, కార్యనిర్వాహక అధ్యక్షులు గాజుల రవీందర్, ప్రధాన కార్యదర్శి నంది శ్రీనివాస్ తెలిపారు.

అన్నవరం కవిత్వం 'పొక్కిలి వాకిళ్ల పులకరింత'కు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ సాహిత్య పురస్కారం లభించింది.' ఊరి దస్తూరి ' పుస్తకానికి తెలంగాణ సారస్వత పరిషత్ సాహిత్య పురస్కారం ప్రకటించారు. ఇంకా రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారం, అలిశెట్టి ప్రభాకర్ సాహిత్య పురస్కారం, మలయశ్రీ సాహిత్య పురస్కారం, మా రసం రుద్రరవి పురస్కారం, ఉమ్మడిశెట్టి ప్రతిభా పురస్కారంతో పాటుగా ఇంకా ఎన్నో పురస్కారాలు అందాయి. గతంలో 'మన తెలంగాణ' దినపత్రిక 'తెలంగాణ' మాసపత్రిక లో కాలమ్స్ నిర్వహించారు. ప్రస్తుతము 'దిశ' దినపత్రికలో 'అంతరంగం' కాలం నిర్వహిస్తున్నారు.అన్నవరం దేవేందర్ 17 అక్టోబర్ 1962న సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారం (ఎస్)లో జన్మించారు. ఎంఏ సామాజిక శాస్త్రం చదివారు. జడ్‌పీ పంచాయతీరాజ్ శాఖలో సూపరిండెంట్‌గా 2020 లో ఉద్యోగ విరమణ చేశారు. ప్రస్తుతం కరీంనగర్ లో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు.

అన్నవరం దేవేందర్ ఇప్పటివరకు 15 పుస్తకాలు వెలువరించారు. ఇందులో 13 కవిత్వం, 2 వ్యాసాల పుస్తకాలు ఉన్నాయి. దేవేందర్ ప్రధానంగా తెలంగాణ పల్లె మట్టి భాషలో కవిత్వం అల్లుతారు. ఆయన రచనలు ధిక్కార స్వరాన్ని వినిపిస్తాయి. 2001లో 'తొవ్వ'తో మొదలైన ఆయన కవిత్వ ప్రయాణం వరుసగా 'నడక' 'మంకమ్మ తోట లేబర్ అడ్డా' 'బుడ్డపర్కలు' 'బొడ్డు మల్లె చెట్టు' 'Farmland fragrance' (ఇంగ్లిష్ అనువాదం) 'పొద్దుపొడుపు' 'పొక్కిలి వాకిళ్ల పులకరింత' 'బువ్వ కుండ' దీర్ఘకవిత, 'ఇంటి దీపం' 2018లో 'వరి గొలుసులు' 2021లో 'గవాయి'సంపుటి వరకు సాగింది. 2022లో ఆంగ్ల అనువాద సంపుటి 'The Unyielding sky' అలాగే 'మరోకోణం' పేరుతో సామాజిక వ్యాసాలను 2002లో వెలువరించారు. 2020లో తెలంగాణ సాంస్కృతిక చిత్రణ 'ఊరి దస్తూరి' వ్యాసాల సంపుటి కూడా వెలువడింది. ఇవే కాకుండా ఎన్నో పుస్తకాలకు సంపాదకులుగా వ్యవహరించారు.

Advertisement

Next Story

Most Viewed