రెండు సందిగ్థాల మధ్య

by Ravi |   ( Updated:2024-10-28 00:00:50.0  )
రెండు సందిగ్థాల మధ్య
X

సొంతగూట్లో నిబ్బరంగా

తలదాచుకుంటానా..

సరిహద్దు గీతలవద్ద దాగుడుమూతలు

యుద్ధవాతావరణమంతా

నాలోనే..లోలోనే భీకరంగా

సైనికున్ని కాను కనీసం సహాయకున్నీ కానూ

ఏమిటో నిత్యం లోపల ఎడతెగని యుద్ధం

చేతిలో తుపాకి లేదుకానీ

మాటల తూటాలు దూసుకుపోతూనే వున్నాయి

ఎవడో ఒకడు..ఎక్కడో అక్కడ

మానసికంగా బలైపోతూనేవున్నాడు

ఈ డొల్ల దేహాలతో

చాలామందే బ్రతుకీడుస్తున్నారు

రెండు సందిగ్థాల మధ్య మరణ ఘోష

అనుబంధాలన్నీ సంకెళ్లే ..తూచ్

తెంచుకోవాలిపుడు..

తెగనరుక్కోవాలిపుడు

నాదనుకునేచోట

రెండు మొక్కల్ని నాటుకోవాలి

పూలు కాయల్నీ ఇవ్వకపోవూ

నాదనుకునేచోట

రెండు ఇటుకల్ని పేర్చుకోవాలి

కాసింత నీడనూ ఇవ్వకపోవూ

అప్పటివరకూ ఆశగా జీవించాలంతే..

మనసునూ దేహాన్నీ చీల్చుతున్న

ఒకానొక అపసవ్యస్థితి

ఆ మూలన ఓ జీవి ప్రశాంతంగానేవుంది

చీపురు విసురుకు చెదిరిపోయిన గూడును

మళ్లీ అల్లుకుంటుంది సాలెపురుగు

అదే నాకు ఇప్పుడు ఆదర్శం..

అదే నాకు ఇప్పుడు మార్గదర్శకం

డా.కటుకోఝ్వల రమేష్

99490 83327

Advertisement

Next Story