అతడు మార్చురీలో లేడు

by Ravi |   ( Updated:2024-10-27 23:30:11.0  )
అతడు మార్చురీలో లేడు
X

అతడు

మార్చురీలో లేడు

అనాటమీ క్లాసులో

తన దేహాన్ని విప్పి చూపిస్తూ

పాఠం చెబుతూ వుంటాడు

అక్కడ అతణ్ణి కలుసుకోవచ్చు

అతడు ఇప్పుడు మార్చురీలో

విద్యార్థులంతా వెళ్లి పోయాక

గాంధీ ఆసుపత్రి లైబ్రరీలో

మార్క్సును మళ్లీ మళ్లీ చదువుతూ

అంబేద్కర్ తో చర్చిస్తూ

చేతులను కాళ్లను చేసి

నర్తిస్తూ వుంటాడు

మీరక్కడ అతడి అద్భుత

కళా సృష్టిని చూడవచ్చు

అంతా ఆదమరిచి నిద్రపోతున్న వేళ

రహస్య సమావేశంలో విప్లవ స్వాప్నికులతో

సంభాషిస్తూ వుంటాడు

తన కబీరుతో కలిసి పాతబస్తీ రోడ్ల మీద

కీమా బిర్యానీ తిని

ఇరానీ చాయ తాగుతూ వుంటాడు

మీరతణ్ణి అక్కడ కలవొచ్చేమో!

అతడిప్పుడు

వసంత కొంగు ముడిని ముద్దాడుతూ

రమణీయమైన ప్రేమ కావ్యం రాస్తూ వుంటాడు

ఎండాకాల వడగాలులూ

శీతాకాలపు చలిగాలులూ

ఇక తననేమీ చేయలేవని

ఈలవేస్తూ ఆడుతూ వుంటాడు

ఢిల్లీ కాలుష్యాన్ని తరిమే

ఉపాయం కనిపెడుతూ

జంతర్మంతర్ అంతరంగాన్ని

అనువదిస్తూ వుంటాడు

మీకు అతడు అక్కడ

నిశ్చయంగా కనిపిస్తాడు

తను చివరిచూపు నోచుకోలేకపోయిన

తల్లిని తప్పకుండా కలుసుకొని

అమ్మ వొడిలో పడుకొని

బావురుమని ఏడుస్తూ వుంటాడు

వొంకలు తిరిగిన అతడి కాళ్లను నిమిరుతూ

ఆ తల్లి అతణ్ణి ఓదారుస్తూ వుంటుంది

అతణ్ణి మళ్లీ పిల్లాడిలా చేసి

ఎర్రని మిఠాయి తినిపించడానికి

గోదావరి వొడ్టుకు తీసుకు పోయింది

మీకు గోదావరి జిల్లాలో

అతడు దొరకచ్చు, వెళ్లండి

దగ్ధమవుతున్న అమరుల

చితి మంటలను చూస్తూ ఇప్పుడు

దుఃఖ పడుతూ విలపిస్తూ వున్నాడు

ఆదిమ యుద్దంలో వొరిగిన

వీరుడి చేతి తుపాకిని పట్టుకొని

గెరిల్లా తంత్ర రచనకు

మెరుగులు దిద్దుతూ వున్నాడు

నిజానికి అతడు గాంధీ ఆసుపత్రిలో లేడు

విప్లవిస్తున్న జనసంద్రంలో అతడున్నాడు

మీకు అక్కడ తప్పకుండా అతడు కలుస్తాడు

అతడిప్పుడు

వర్గకుల సమరాన్ని తీవ్రంచేసే పనిలో

దేశమంతా సంచరిస్తున్నాడు

అతడికిప్పుడు కోటికోటి పాదాలు మొలిచాయి

కోట్లాది బిగించిన పిడికిళ్లు వున్నాయి

అతడిప్పుడు నిజంగానే

మార్చురీలో నిర్జీవిగా లేడు

అతడు అత్యున్నత చేతనా

కేతనమై ఎగురుతున్నాడు

తప్పకుండా మీకతడు ఆ జెండాను

చేతికిస్తూ చిర్నవు చిందిస్తూ వున్నాడు

వెళ్లండి. వెళ్లి కరచాలనం చేసి

గుండెకు అద్దుకోండి

- విసికె శ్రీనివాస్

(విప్లవ స్వాప్నికుడు సాయిబాబకు ప్రేమతో...)

Advertisement

Next Story