బెల్లప్పల పెంక

by Ravi |   ( Updated:2024-10-13 22:30:39.0  )
బెల్లప్పల పెంక
X

పండుగొచ్చేనని పట్టుబట్టి

పిల్లలు మంది ముఖం జూడరా?

అప్పోసప్పో మనింట్ల మనంజేయాలే

పది దినాల ముందునుంచే కొట్లాడి

పైసలు లేకున్నా పెంక పెట్టేది అమ్మ

కోపిన్ బియ్యం అడ్డెడు

కమ్మని ఆసన కాటన్ నూనే

సేటు దగ్గర సేరు సెనగపప్పు

కొనలేక ఉద్దెరప్పుతో నాయన

పొద్దంతా కాయ కష్టం చేసినా!

అలసటనంత చిలక్కొయ్యకు తగలేసి

ఎక్క దీపం గుడ్డి వెలుగు కింద

కట్టెల పొయ్యితో తంటాలు

సెగ పొగలతో కుస్తీలు

కారం పెట్టినట్లు కండ్ల మంటలు

రాత్రంతా పిండి పిసికి బెల్లప్పలు చేసేటోళ్లు

పెద్ద పేర్పెడు చెవుబిల్లలు

అంబటి గంపెడు ముండ్ల మురుకులు

చిన్న గుల్లెడు కారమప్పలు

మెత్తని పత్తిలాంటి పూరీలు

లోటా గిలాసల

లొట్టెడు చాయి పోసి

నానేసిన బెల్లప్పలు

బెల్లం కంటే కమ్మగుంటుండే

గిప్పుడంటే బేకరీ ఫుడ్డు తిని తిని

బెల్లప్పలు చేదైనవి గాని

బెల్లప్పలు ఉంటే

వారం పది దినాలు పండుగే పండుగ.

డా.ఎడ్ల కల్లేశ్

98667 65126

Advertisement

Next Story

Most Viewed