పూల జాతర

by Ravi |   ( Updated:2024-10-13 23:01:18.0  )
పూల జాతర
X

సెరువుల్లో నీళ్ల తావుల్లో

అలల కన్నెల సందడి

దడులు దూరలు పానాదులన్నీ

తలలు ఇరబోసుకున్న

పూరెమ్మల సందడి

దసరా సూట్టీలను

శేండ్లు శెట్లకు వాగులకు జెప్పిన

బడి పిల్లల అల్లరి

నీలాకాశం నుంచి శరత్ కాంతి

భూమి వాకిలినంతా అలికిన

వెన్నెల పుప్పొడి

నెల్లాండ్ల కష్టం పల్లె తల్లుల

సంబరాలు పండే

చెమట పూలపండుగు

పూతల్లులను పూదించే

ఇంతుల ఒడినిండా

పూల పాటల వాసనే

షెల్లెండ్ల కోసం సెలుకలు సెరువులు

తిరిగి పూల మోపులు

మోసుకచ్చే అన్నల తండ్లాట

కనుదుప్పటి కట్నాలట

బాయి నడుము సుట్టూ తల్లి గద్దెలు

నడుమ నడుమ పిల్ల గద్దెలు

మీద ఎలవద్దిరి శెట్టు

రంగు రంగుల శీరెలు గగ్గెర్లు ఒకటై

కోలాటాలు దాగుడు మూతలు

రాత్రిని పండ నియ్యని

డీలమ్మ డీలాటలు

తడిసిన కొత్త కొంగుల

సంసారం ముచ్చట్లు

దసరా దినాలంటే పెళ్ళీడు

జడ గంటలకు

పూల రతాలపై తేలడమే

దేశానికి బతుకునిచ్చె తల్లులంతా

మళ్ళీ బతుకమ్మదాకా సల్లగుండాలని

ప్రకృతి దీవించడమే

బొడ్డెమ్మల పండుగ.

డా. ఉదారి నారాయణ,

94414 13666

Advertisement

Next Story

Most Viewed