శాసనసభ సీటు కావాలి!

by Ravi |   ( Updated:2024-06-09 18:46:14.0  )
శాసనసభ సీటు కావాలి!
X

కష్టాలెరగని తీరంలో

ఇష్టారాజ్యంగా సంపాదనకై

నాకో శాసనసభ సీటు కావాలి

శాసనసభ సీటు కావాలి!

అది మంత్రి పదవికి దారి చూపాలి!

పీకల దాకా మెక్కినా

అడ్డదార్లెన్ని తొక్కినా అడ్డుకోలేని జనం కావాలి

అడుగడుగునా హారతి పట్టాలి!

ఎదురు తిరిగిన వాడి

మాడు పగుల గొట్టుటకు

చట్టంతో పని లేని

చుట్టంలాంటి పోలీసుల దండుకావాలి!

బడ్జెట్ లెక్కలను బేరీజు వేసి

కాంట్రాక్టర్లను కవ్వించి

కమీషన్ల మార్గాలకు దించగల

ఆదాయాల మార్గాన్వేషకులు కావాలి!

శతకోటి దరిద్రాల ప్రజలకు

అనంతకోటి ఉపాయాలను

వల్లించి, వల్లించి వారి ఆలోచనలను

దారి మళ్లించే మాటకారి కావాలి!

అప్పుడప్పుడు సన్మానాల సభలు పెట్టి

డప్పుచప్పుళ్లు, సన్నాయి వాయిద్యాలతో

పురమంతా కలియ దిప్పేటి

స్వామి భక్త పరాయణులు కావాలి!

పై పదవుల కెదుగుటకై పైరవీల నాశ్రయించి

మోతుబరిని చాటింపగల

మహా మహా మాయగాళ్లు కావాలి!

ఇచ్చే వాడిది ఖర్చు లెక్కగా

పుచ్చుకునే వారికది ఆదాయం

హక్కుగా అవినీతిని నీతిగా నిర్వచించగల

(అ) న్యాయ సలహాదారులు కావాలి!

భారత బ్యాంకుల్లో ఇష్టం లేనివాళ్లు

చీమచిటుక్కు మన్నా తెలిపేటి

స్విస్ బ్యాంకులో ఖాతాలు తెరచుటకై

పౌరుల హక్కుగా రాజ్యాంగ సవరణకావాలి!

దేశీయ, విదేశీయ తేడాలెరుగని దేశంగా

అన్ని దేశాల వారిని అక్కున చేర్చుకొని

వ్యాపార లావాదేవీలను వారికే అప్పజెప్పగ

అప్పులెక్కువైన భారతాన్ని

అమ్ముటకు లైసెన్స్ కావాలి!

కోరికలు కొన్నే అయినా దొరికినవింకెన్నో!

అరమరిక లెరుగని ప్రజలకిక వనవాసం

ప్రజాస్వామ్యాన్ని పాతరేసిన పౌరుల

సంరంభంలో కాలంలో!

దోచుకు తినేవారే దొరలీ కాలంలో

వనవాసీలు, ఆదివాసీల రోదనలకిక అంతెక్కడ?

జనావాసాలకు దూరమౌతున్న పాలకులకు చోటెక్కడ?

అవినీతికి హారతి పడుతున్న నేతలకు పరువెక్కడ?

పరిహాస బాధితులైన ప్రజలకు దిక్కెక్కడ?

- పెద్దిరెడ్డి తిరుపతి రెడ్డి

94400 11170

Advertisement

Next Story

Most Viewed