- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నియంత అంతం
"ఫలితాలు ముఖ్యమే.. కాని ఏ ఒక్క చర్యో కడగండ్లన్నిటిని ముగించేది ఎదీ లేదు. అలాంటపుడు ఎన్ని కష్టాలు పడైనా తాము నమ్ముకున్న న్యాయమైన మార్గానికే అంటిపెట్టుకొని ఉండటమే అంత్యంత ప్రాణప్రదమైనది" అని ఆదివాసులు మేడమ్ తోని చెప్పినంక... అసలు ఈ భూమి మీద ప్రకృతి ప్రకోపాలను ఆపేది బహుశా మూలవాసుల ఈ మంచితనమే అనిపిస్తుంది నాకు.
మనింట్లో ఎవరైనా జరిగిపోతే ఆ ఒకలి మీద వడి ఒకలు ఏడుసుడూ... సచ్చిపెయినోళ్ల మంచితనం.. ఆళ్ల ప్రేమా ఆపాచ్చన తల్సుకొని సోకం ఎల్లదీత్తరు. ఇంకొకేయి జరిగె తంతు.. అంటె సుట్టాలకు ఆళ్ళకు ఇళ్లకు మత్లావ్ అందిచ్చుడు.., ఎక్కడ కాలేసుడు, కాట్నం ఎక్కడ.. పాడె.. పైసలు.. ఇయన్ని నడ్తయ్. కని ఒక రాస్ట్రం మీదనో.. దేసం మీదనో పెద్ద మనిషి వోతే.. బైటికి పేపర్లల్ల, టివిల్ల ఒడతెగని సాటింపు వెడ్తరు. కని ఎన్క జరిగేటియి... మీద జెప్పిన పాడె.. పైసలు.. సుట్టాలు జర్గయి. అసలు పెయినోని గురించి పట్టింపే ఉండది. ఆ పెయిన మనిసి కుర్సీలకు నేనెట్ల జెరాలే అనే తన్నులాట, గుద్దులాట ఉంటది. ఇగ ఆ సీట్లకు అందరనుకునే లీడర్ గాకుంటా... అసలు ఎవ్వలికి దెల్వని ఓ కొత్త మొకం అచ్చి షెర్తది. ఇగ ఆ జెరన్ని గడియల్ల ఎమైతది... ఆ జెరన్ని రోజుల కోసం గుడ గద్దెనెక్కినంక ఏకు మేకు ఎట్లైతరు అనేదే... గీ అకార్ పటేల్ రాసిన నియంత అంతం. ఇదో పొలిటికల్ ఫిక్షన్ బుక్కు. కని ఫిక్షన్ లెక్క గాకుంట నిజంగ జరిగిన పొలిటికల్ సంగతులు మస్తు గుర్తస్తయ్. ఇంక దేశం మీద జరిగే కార్పొరేట్స్ అనే పేరు వెట్టి దోసుకునుడు ఎట్లుంటదో గుడ ఉంటది.
బుక్కు సురువు అవుడే.. ఓ హాస్పటల్ గ్రాండ్ ఓపెనింగ్.. కెమెరాలు ఏ యాంగిల్ల వెడితే ఫోటోలు మంచిగస్తయో చెప్పే దేశం పెద్ద నాయకుడు అనంగనే మనకు లైట్లు ఎలుగుతయ్. ఐతే అంతట్లకు సప్పుడు లేకుంట ఆడిదాన్నె ఆ పెద్ద మనిసి కుప్పగూలి జివునం ఇడుస్తడు. ఇగ బిర్కన అదే హాస్పిటల్లకు ఎస్కపోతే ఏందీ... అది జస్ట్ ఓపెనింగ్ కు బిల్డప్ ఇచ్చె హాస్పిటల్ అంతె లోపట ఒక్క బెడ్డు గాదుగా ఒక కుర్సీ బెంచి గుడ ఉండది... ఖాళీ రూమ్లు. ఇగ మనిసి వెయిండని ఎర్కైనంక ప్ర.మం.కా.ల ఆపీసర్లు ఎం జేత్తరు. పెయిండ్రని తెల్సినా బిర్ర బిర్ర బైటికి జెప్పకుంట.. నాలుగుమాట్ల మీటింగులు వెట్టుకొని.. ఎప్పటికో గని ఎందుకు జెప్పరో సదివేటపుడు కండ్లకు కనవడ్తది. అసలు దేసం మీద ఫస్టు మనిషికీ ఇత్తే ఆడే బొమ్మలెక్క ఉండేటోల్లను కూసోవెడ్తేనే గ ప్ర.మ. మాట సెల్లేది మరి. అనుకోకుంట ఆ మనిసివొతె... బలం, పైసలున్న లీడర్లు ఎన్కపొంటి ఎసెంటి డ్రామాలకు, అన్నాయాలకు కాలు దువ్వుతరో జెప్పిండు. కొన్నిరోజుల మందం అని సడన్ గ ఎవ్వలికీ ఎక్కో దెల్వని ఓ మేడమ్ ను కుర్సీ ఎక్కిస్తే... మురికి గుంటల వోసిన పన్నీరు మురికే అయినట్టు... మేడమ్ గుడ దాంట్లకు ఎట్ల వెయింది.. అనేది గ్రిప్పింగ్ గ రాసిండు. ఇగ దేశం మీది కార్పొరేట్ శక్తులు అడువులను దాంట్ల వనరులను గుంజుకొని ఆదివాసులను బైటికి ఎట్ల ఇసురుతయ్... ఆళ్లకు రాజకీయ శక్తులు ఎట్ల, ఎందుకు తందాన అంటయ్... ఈల్లను ఆపేటందుకు ఇంకోదిక్కు NGO లు.. లాయర్లు.. ఎట్ల నిలవడ్తయ్.. ఆ నిలవడ్డొల్లను బైటికి రాకుంట ఎట్ల లోపటెత్తరు సదువుతుంటే.. లెక్కలేనంత మంది గుర్తచ్చిర్రు.
మరి ఈ ఆటల కాయిన్ కు మంచి దిక్కుకు నిలవడ్డ మేడమ్... చెడు దిక్కుకు పోయిందా... ఏం జేసింది..?? అనేది ఎండింగ్. కని నాకు ఈ ఎండింగ్ అంత మంచిగ అనిపియ్యలేదు. ఏం జేసైనా, ఎంతమందిని లేపేసి ఐన వనరులు, దేస సంపద దూసుకుందం అనుకునే కాడ.., అదే అన్యాయంతోటి ఆ ఒక్క మంచి పని కూడ చేసుంటే మంచిగుండు అనిపిచ్చింది. ముల్లును ముల్లుతోనే తియ్యాలన్న సామెత లెక్క.
"ఫలితాలు ముఖ్యమే.. కాని ఏ ఒక్క చర్యో కడగండ్లన్నిటిని ముగించేది ఎదీ లేదు. అలాంటపుడు ఎన్ని కష్టాలు పడైనా తాము నమ్ముకున్న న్యాయమైన మార్గానికే అంటిపెట్టుకొని ఉండటమే అంత్యంత ప్రాణప్రదమైనది" అని ఆదివాసులు మేడమ్ తోని చెప్పినంక... అసలు ఈ భూమి మీద ప్రకృతి ప్రకోపాలను ఆపేది బహుశా మూలవాసుల ఈ మంచితనమే అనిపిస్తుంది నాకు.
పుస్తకం పేరు : నియంత అంతం
రచయిత: ఆకార్ పటేల్
అనువాదం : ఎన్.వేణుగోపాల్
పేజీలు: 230
వెల: 250
ప్రతులకు: మలుపు బుక్స్
63059 91831
సమీక్షకురాలు
రాజీకన్నా