సూఫీ తత్వాన్ని నింపిన పుస్తకం

by Ravi |
సూఫీ తత్వాన్ని నింపిన పుస్తకం
X

యాంత్రికంగా సాగిపోతున్న జీవితంలో మనిషిలో ఏదో అభద్రతాభావం, తెలియందేదో కోల్పోయామనే భావం కలిగినప్పుడు నిరాశ, దుఃఖం, అశాంతి అన్నీ కలగలిపి మనిషిలోని ఆత్మను వేదనకు గురి చేస్తాయి. వేదనకు గురియైన ఆత్మ మనిషిని అథఃపాతాళానికి నడిపిస్తుంది. తద్వారా మనిషి పతనానికి నడిపించబడతాడు. అదే మనిషి సంతోషంతో తత్భావన కలిగి ఆధ్యాత్మికతో దైవభావం నింపుకొంటే పరమానందం పొందుతారు. ఇలా మన ఆత్మ పరమాత్మతో లీనమవ్వడమే సూఫీతత్వం అంటారు. 'సూఫీ' అంటే- పవిత్రతకు, (భౌతిక బంధాల నుంచి) స్వేచ్ఛకు సంకేతం! ధ్యాన దైవిక ప్రేమ భావనతో పరమాత్మలో లీనం కావడమే సూఫీ సిద్ధాంతం. ఆడంబరాలకూ దూరంగా పవిత్రంగా యోగులుగా, సన్యాసులుగా, స్వాములుగా జీవితాన్ని గడిపే వ్యక్తులు సూఫీలు.

కవి మెట్టా నాగేశ్వర్ రావు అలుపెరుగక, విరివిగా సాహిత్యాన్ని రాస్తున్న గొప్ప సాహితీవేత్త. సాహిత్య ప్రపంచంలో తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. నిరంతరం సామాజిక మాధ్యమాలలో నదీ ప్రవాహంలా కవితలు రాస్తూనే ఉన్నారు. నాగేశ్వర్ రావు కవితలు మనల్ని అబ్బురపరుస్తాయి, చదువుతున్నంతసేపు మనల్ని తాత్విక చింతనలోకి తీసుకెళతాయి. తన కవిత్వంలోకి వెళితే... గాయమయ్యాకనే తెలిసింది / మనుషుల్ని గుడ్డిగా నమ్మొద్దనీ / గాయం చేసి నవ్వే జనాన్ని చూశాక / కవచమొకటి అవసరమనిపించింది/ కవిత్వాన్ని ధరించాను. తీయగా మాట్లాడే వాళ్ళతో జాగ్రత్త/ తీపిపూతపూసిన చేదు మాత్రయితే ఫరవాలేదు /తేనెపూసిన కత్తయితే మాత్రం ఇంకేం లేదు!

జీవితానుభావాలు తాత్వికంగా చెబుతూ..

మన చుట్టూ ఉండే వారు అందరూ మనవాళ్లే అనుకోవడం పొరపాటే, అవకాశం రావాలే కానీ వారి నిజస్వరూపం తెలుస్తుంది. గుడ్డిగా నమ్మామో మనకు తెలియకుండా మనకే గోతులు తీస్తుంటారు. వారిపైన ఒక కంటితో కనిబెడుతూనే ఉండాలి. మనతో నమ్మకంగా ఉంటున్నట్టే నటిస్తూ తియ్యగా మాటలు మాట్లాడుతారు. వారి క్రియలు తేనేపూసిన కత్తిలా, మనకు తెలియకుండానే గాయాన్ని చేస్తారు. కవి చాలా సున్నితమైన విషయాన్ని తన కవిత్వంలోకి ఒంపారు. మరో కవితలో... పద్దాక తిని, దొడ్డుగా పెరిగిపోతే ఏం శోభా!?/ పద్దాక చేసేపనిలో అణుశక్తి ఖర్చయితే , అది సొంపు / సోమరిపంజరాల్ని మోసేవాడికి బతుకుండదు / పరాన్నజీవుడిగా అఘోరిస్తే ఉనికే వుండదు / క్షణక్షణం మనిషి పని పాటవాల పాటపాడితేనే దారిలో నడిచేటప్పుడు తరుపూల వానలో తరిస్తావు ఎంత తాత్వికం దాగుంది? ఊరికే తిని కూర్చుండిపోతే ఎలా, మనిషన్నాకా ఒక ముందు చూపు, లక్ష్య సాధన ఉండాలిగా. జీవితంపై గురి లేని వారు జీవితంలో ఎదగలేరు, కీర్తి పతాకాన్ని ఎగుర వేయలేరు. పుట్టుకకొక అర్థం ఉండాలి, ఇతరులు మెచ్చేదిగా ఉండాలి, అంతేగాని ఇతరులపై ఆధారపడి సోమరిగా ఉండొద్దు. కవి తాను చూసిన, జీవితానుభవాలను తాత్వికంగానూ చెప్తాడు.

జీవితం ఒక్కచోటే ఆపేస్తే ఎలా అంటూ..

"కుసింత చాలు" అనే కవితలో కుసింత సమయం మనుషులతో గడుపు, వాకిలి ఊడ్చినట్టుగా, శ్వాసనూడ్చే సంభాషణొకటి చేయు అని, "మబ్బులు"లో వర్షం కోసం ఎదిరి చూసే రైతు ఆవేదనను ఎత్తిచూపారు, ధాన్యంతో పాటు, విరివిగా హృదయ ధనమూ పండించే మబ్బులు పుట్టాలి, మబ్బులెపుడు మబ్బులంటే...లోకాన్ని పీడించే దుర్మార్గమంతా కొట్టుకుపోయే వానొకటి కురిసినపుడే! అంటూ మబ్బులతో పోలుస్తూ జీవిత గమనాన్ని చాలా చక్కగా కవిత్వీకరించాడు.

అయిపోయిన చోట ఆగిపోతారు ఎందరో / గతాన్ని అతుక్కుపోయిన బల్లులౌతారు / సరిగ్గా అక్కడే ““ఇంకా వుంది” అనే బోర్డు పెట్టాలి / కొనసాగడమే జీవితం, ఆగిపోవడం మరణం... పై వాక్యాలు మన అందరికీ వర్తిస్తాయి . జీవితం నిరంతర పయనం, దాన్ని ఒక్కచోటే ఆపేస్తే ఎలా? సూర్యుడు, చంద్రుడు, సృష్టి ఎలాగైతే అలుపెరుగక ముందుకు సాగుతాయో, మనిషి కూడా అలాగే ముందుకెళ్తేనే మనుగడ అని గుర్తెరగాలి. ఆగిపోవడం మరణంతో పోల్చడం చాలా బాగుంది.

మానవత్వాన్ని తట్టి లేపే పుస్తకం

ఈ పుస్తకంలోని కవితలు చదువుతున్నప్పుడు మదినిండా ఎంతో తాత్వికతను నింపుకొని భావోద్వేగానికి గురి అవుతుంటాము. లోకంలో స్వార్థం, ద్వేషం, పగ, ప్రతీకారాలు నానాటికీ పెరిగిపోతుండటంతో, మనిషిలోనికి దైవత్వాన్ని నింపే విధంగా, మనిషిని మనిషిగా మార్చే విధంగా తన కవిత్వాన్ని మనుషుల మనసులోకి ఒంపుతారీ కవి. కవిత్వం ఏం చేస్తుంది అంటారు చాలామంది, కానీ కవిత్వం మనిషి నడవడిక, ఆలోచన రీతిపై ప్రభావం చూపి, మనిషిలో ఎక్కడో గూడు కట్టుకొని పోయిన మానవత్వాన్ని తట్టిలేపుతుంది. యాంత్రికమైపోతున్న జీవితాలలో ఒక ఓదార్పుని, ఒక సంతోషాన్ని, ఒక భావోద్వేగాన్ని, సన్మార్గంలో నడవడానికి దారిని చూపుతుంది. దారి తప్పిపోయి నడుస్తున్న మనుషులను దారి చూపే విధంగా ఉంటాయి ఈ తాత్విక గీతాలు. మెట్టా నాగేశ్వర్ రావు మరెన్నో సాహిత్య కవితా సంకలనాలను వెలువరించాలని, మరెన్నో కీర్తిప్రతిష్టలు పొందాలని కోరుకుంటూ అభినందనలు తెలియజేస్తున్నాను.

కవి : మెట్ట నాగేశ్వర్ రావు

పేజీలు : 170

వెల : 220

ప్రతులకు సంప్రదించండి

99510 85760


సమీక్షకులు

గాజోజి శ్రీనివాస్

99484 83560



Next Story