సంవేదన: అద్భుతమైన పాత్ర మధురవాణి

by Ravi |   ( Updated:2023-02-06 02:26:21.0  )
సంవేదన: అద్భుతమైన పాత్ర మధురవాణి
X

దివంగత గురజాడ అప్పారావు విమర్శతో కూడిన సృజనాత్మక తెలుగు సాహిత్య నిపుణుడు. వివిధ రంగాలలో బహుముఖీయమైన వ్యక్తిత్వం ఆయనది. ఆయన మనసు సౌందర్యంలా ఉంటుంది. అనుమానం లేదు ఆయనా మనిషేకానీ, మానవీయమైన మనిషి. వారు రాసిన సామాజిక నాటకం 'కన్యాశుల్కం' తెలుగులో ఒకానొక గొప్ప కళాత్మక ప్రదర్శనలాగానే, ఒక గొప్ప సాహిత్య సృష్టి అని కూడా ప్రశంసలందు కుంది. దీనిలో గురజాడ సృష్టించిన ప్రతి పాత్ర అద్భుతమైనది. అనుమానం లేదు మధుర వాణి పాత్ర మానసికంగానే కాకుండా భౌతికంగా కూడా అద్భుతమైన పాత్రలలో అద్భుతమైనది. పాత్రల వర్ణన, లోతైన ఆలోచనలు, పదాల వ్యక్తీకరణ, చెప్పుకోదగ్గ ఒక చక్కని నటన కనిపిస్తాయి.

ఆమె తెలివిగలది, అమాయకురాలు కాదు. ఈ భూగోళంపైనే నివసించే ఆమెను ఆశపడే వారికి ఆమె గురించి బాగా తెలుసు. ఈ గుణగణాలతో పాటు, వాడుక మాటలలో చెప్పాలంటే ఆమేమీ పవిత్రమైంది కాదు. తన ధోరణిలో తాను జీవిస్తుంది. ఒకరికంటే ఎక్కువమందితో జీవించే వేశ్య అయినప్పటికీ, ఆమె జీవన విధానం అక్రమమైనప్పటికీ, రచయిత ఆమె నుంచి మంచిని ఆశిస్తారు. రసికత్వంతో నిండిన ఆ పాత్రను సృష్టించి రచయిత ఆ పాత్ర ద్వారా మనల్ని మంత్రముగ్ధులను చేస్తారు. వాస్తవానికి ఆ నాటకాన్ని చూసే చాలా మంది ప్రేక్షకులు ఆమెతో విడదీయరాని అనుబంధాన్ని ఏర్పరచుకున్నారు.

దృగ్విషయాల్లోనే కాదు, కనిపించని వాటిలో కూడా మధురవాణి ఒక సజీవమైన వాద్యగోష్ఠిలాంటిది. మధురవాణి విజయనగరం పౌరురాలు. అక్కడ అనేకమంది గొప్ప వాళ్ళకు ఆమె వేశ్య. భాషా, సాహిత్యాలలో, చారిత్రకంగా, సంగీతపరంగా, ఆధునికంలో సంప్రదాయంలో ఆమె బాగా చదువుకుంది. ఆమె ప్రతిభావంతురాలైన సంగీతజ్ఞురాలు. ప్రాచీన భారత దేశంలో శూద్రకుడు రచించిన 'మృచ్ఛకటికం' నాటకం అంటే ఆమెకు చాలా ఇష్టం. ఆ నాటకంలో నాయిక వసంత సేన అంటే ఆమెకు ప్రత్యేక మైన ఆకర్షణ. ఆమెకు వసంత సేన అంటే విపరీతమైన ఆరాధనా భావన. వసంత సేన కావాలనేది ఆమె జీవితంలో ఒక గొప్ప ఆదర్శం.

'కన్యాశుల్కం'లోని మరొక ముఖ్యమైన పాత్ర గిరీశం. ఈ యువకుడు మాటల్లో, ఆలోచనల్లో , నటనలో, ఆకాంక్షలో పూర్తిగా సంక్షేమాన్ని కోరుకునేవాడు. మధురవాణి కొంత కాలం పాటు అతని నుంచి ఇంగ్లీషు నేర్చుకుంది.

అతనికి ప్రేయసిగా కొంత కాలం జీవిస్తుంది. తరువాత నక్కజిత్తులు, వివాదాస్పదుడైన రామప్పంతులు తో ఆమె సంబంధం పెట్టుకుంటుంది. తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురంలో వారిద్దరూ అవివాహిత జంటగా కలిసి ఉంటారు. దానికి తోడు రామప్పంతులు ఆమెను పెళ్ళి చేసుకున్న భర్త కాకపోయినప్పటికీ, అతని పట్ల ఆమె అపారమైన శ్రద్ధతో పాటు, పట్టించుకోని అశ్రద్ధ కూడా కనపరుస్తుంది. అతని పట్ల ఆమె చాలా చిత్త శుద్ధితో ఉంటుంది కానీ, ఆమె పట్ల అతను అంత చిత్తశుద్ధి చూపిస్తాడా అన్నది తెలియదు.అతన్ని అభినందిస్తుంది, ఆరాధిస్తుంది, మెచ్చుకుంటుంది. అదే సమయంలో తాను ఒక వేశ్యనన్న విషయం మర్చిపోదు. తన జీవితాన్ని క్రమంగా రామచంద్రాపురం తోనే ముడివేసుకుంటుంది. ఆమె నైపుణ్యాన్ని మెచ్చుకుని అభినందించే రసికులు ఎవరూ అక్కడ లేరు.

అలాంటి మానసిక దుస్థితిలో కరటక శాస్త్రి అనే కొత్త వ్యక్తికి పరిచయమవుతుంది. ఆ సమయంలోనే ఆమె ఆధ్వర్యంలో ఒక కృత్రిమమైన సంఘటన జరుగుతుంది. ఒక వింత సంఘటన అది. కరటక శాస్త్రి శిష్యుడైన వెంకటేశంకు "మాయా సుబ్బి" అనే మారు పేరుతో పెళ్ళికి ఏర్పాటు జరుగుతుంది. ఒక ముసలి వాడిని పెళ్ళి చేసుకోవడానికి వెంకటేశానికి పెళ్ళి కూతురు వేషం వేస్తారు. ఈ పెళ్ళిని రామప్పంతులుకు కూడా తెలియకుండా రహస్యంగా ఉంచడంలో ఆమె చాలా శ్రద్ధ తీసుకుంటుంది. పెళ్ళి కూతురు వేషంలో ఉన్న వెంకటేశం అర్ధ రాత్రి పారిపోయి తన ఇంటికి వెళ్ళిపోయేలా చేసి, బిచ్చగాడి వేషంలో కనిపించేలా చేస్తుంది. చాలా జాగ్రత్తలతో ఆ పిల్లవాడిని కరటక శాస్త్రి ఉండే చోటుకు పంపుతుంది. ఈ మొత్తం వ్యవహారంలో ఆమె అసాధారణమైన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంది.

అంతు చిక్కని, బహుముఖ లక్షణాలున్న మధురవాణి పాత్రను సృష్టించడంలో గురజాడ అప్పారావు ప్రదర్శించిన అందరినీ ఆకట్టుకునే సాహిత్య, మానసిక తాత్విక నిశిత దృష్టి కనిపిస్తుంది. ఆమె తెలివి తేటలు క్రమంగా వైరుధ్యం, సంతోషం, ఆశ, నిరాశ, శృంగారం, వైరాగ్యం, చావు బతుకుల దృక్పథాల మధ్య సంఘర్షణగా కనిపిస్తాయి. నిత్యం ఆమె సంబంధాలు అనేక మంది ఆడ మగవారికి సంబంధించిన విడాకుల మంజూరు, కృత్రిమమైన ఆవేశాలతో కూడిన మానవ అనుభవాలతో ముడిపడి ఉంటాయి. అప్పుడప్పుడూ ఆమె పాల నుంచి నీటిని వేరు చేయడంలో, కాకికి, కోకిలకు ఉన్న తేడా గమనించడంలో, మనుషులకు మనుషులు కాని వారికి మధ్య రేఖను, మానవులకు, అతీత శక్తులు గలవారికి మధ్య తేడాను గమనించడంలో గందరగోళానికి గురవుతుంది.

ఆమె జీవితంలో ఒక గొప్ప మానసిక, భౌతిక మార్పులు చోటు చేసుకుంటాయి. ఆమెలో ఉన్న సంకుచితమైన వైయుక్తిక ప్రేమ నుంచి ప్రారంభమై విస్తృతమైన ప్రాపంచిక ప్రేమ వైపు నడుస్తుంది. ఆ అనుభవం ఒక మధురమైన ప్రేమ పూర్వకమైన, ఒక సజీవమైన విముక్తిగా ఆమె జీవితంలో కనిపిస్తాయి. తనను తాను చూసుకుని బాల్యం నుంచి గమనిస్తున్న మధురవాణినేనా నేను అని ఒక్కొక్కసారి ఆమే ఆశ్చర్యపోతుంటుంది.

ఆమె ఒక మహిళ కాదు, ఒక పురుషుడూ కాదు, ఒక మనిషి, ఒక మానవీయ మనిషి!

-డాక్టర్ సంజీవ దేవ్

అనువాదం - ఆలూరు రాఘవ శర్మ

Also Read..

వారం వారం మంచిపద్యం: మనసు

Advertisement

Next Story

Most Viewed