కవిత్వం అంటేనే కవికి మరో జన్మ

by Ravi |   ( Updated:2024-10-13 23:30:26.0  )
కవిత్వం అంటేనే కవికి మరో జన్మ
X

కవి ఏమి చేయగలడు, అస్తిత్వం లేని శబ్దాలకి, అక్షరాలకు ఊపిరి పోయగలడు, అక్షరాలకు జీవం ఇచ్చే సామర్థ్యమే ఆత్మ కళ అదేమీ అస్పష్ట కవిత్వం చదవగానే అర్ధం స్ఫురించని కవిత్వం కాదు. ప్రతి పాఠకుడు గుండెకి హత్తుకుని మరల మరల చదవాలి అనుకుంటాడు. ప్రతి కవితకి ఆత్మ ఉంటుంది. శైలజ గారి కవిత్వంలో ఇది మనకి కనిపిస్తుంది. చాలా మంది కవులు కవయిత్రులు ఆత్మాశ్రయ ధోరణిని అనుసరిస్తూ రాస్తారు. కానీ ఈ కవయిత్రి తనను తానూ ఆవిష్కరిస్తూ సమాజంలో సమస్యలకి పరిష్కారం చూపే విధంగా తన రచన ఉండాలని తపన పడతారు. సాహిత్యంలో కవిత్వాన్ని ప్రాణంగా భావించేవారు జన్మించడమే కవిత్వంగా భావిస్తారు. అందుకే తనలో పురుడు పోసుకునే అక్షరాలకు పేరు పెట్టారు. ప్రతి కవికీ, కవయిత్రికీ తన కవిత ఒక బిడ్డనే... అందుకే జన్మించడమే కవిత్వం అంటూ తనలోని భావాలను అపురూపంగా ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు.

కవయిత్రి డిక్షన్ చాలా సులభంగా ఉంటుంది. తాను చెప్పాలి అనుకున్నది స్పష్టంగా ఉంటుంది. ఎక్కడా తడబాటు ఉండదు. సమాజంలో జరుగుతున్న వాటిపై మహిళల తరపున మాట్లాడటానికి ఎక్కడ కూడా తటస్థంగా ఉండదు ఒక స్టాండ్ తీసుకొని తన వైపు నుంచి ఆలోచించమంటారు ఈ కవయిత్రి తన 'నా ప్రయాణం చందమామకై'లో. నిన్నటి తరానికి పంచడమే తెలుసు మరి నేటి తరానికి వదిలించుకోవడమే ఏదైనా, వస్తువైనా బంధం అయినా అంటారు..మొన్నటి తరం తాత అనుభవైకంలో పిల్లలు ఏమి చేస్తున్నారు ప్రశ్నకి అన్ని చేస్తున్నారు ఒక్క నన్ను చూసుకోవడం తప్ప, వస్తు గత ప్రపంచంలో మనుషులకి విలువ ఎక్కడ? కడుపున పుట్టిన కొడుకులకి డబ్బులే ముఖ్యం ఇది కదా అసలైన విషాదం. ముఖ్యంగా ఈ కవయిత్రి కవిత్వంలో సామ్యవాద వాస్తవికత, సమస్యలను గుర్తించి చిత్రించడం, తన అక్షరాలతో ప్రపంచానికి చూపించడం, వారసుడులో ఒక సగటు అవిటివాడి అంతరంగాన్ని ఆవిష్కరించిన తీరు బాగుంది. అలాగే సమూహవాసిలా జీవితపు సత్యాలు చివరి ఘడియల్లో కళ్లముందుంచడం మరీ బాగుంది.

కవిత్వం ఓ అంతరంగ మథనం

కవిత్వం రాయడం అంటే నాలుగు వాక్యాలు పేర్చడం అస్సలు కాదు మరి ఏమిటి? కవిత్వం రాయడమంటే తెల్ల కాగితాలను నల్లగా మార్చడం కాదు, అంతరంగ మధనం.. వాటిని అక్షరాలుగా మార్చి వాక్యాల్లో ముడివేసి ప్రాణం పోయడం. ఈ వాక్యాలు చాలు కవయిత్రి ఎంతగా కవిత్వంతో మమేకం అయ్యారో.. అని అనిపించక మానదు. ఈ సంపుటిలో చాలా వరకు మహిళల బాధనీ, సంవేదననీ వ్యక్తం చేసేవే...ఫెమినిజం అని చెప్పను కానీ చాలా వరకు సగటు స్త్రీ అంతరంగంలోంచి చెప్పేవే...

కదులుతున్న ఉరి కంబాలం మేం!

లోతైన గాయాలులో, చెత్త బుట్టలో విసిరి పారేసిన గాథలు అనేక చోట్ల పసిపిల్లలపై అత్యాచారాలు ఆడది అయితే చాలు వయసు తేడా లేకుండా జరుగుతున్నా ఆకృత్యాలుపై వేదన. మమ్మల్ని మింగేస్తున్న మూడో ప్రపంచం మీద కదులుతున్న ఉరి కంబాలం మేము అంటారు. వీరి కవిత్వంలో ఎక్కడ అర్ధ శూన్యత కనిపించదు. ఎందుకంటే ఎంచుకున్న వస్తువులు కవిత్వాన్ని అందించిన తీరు అంతా అనుభవవాదం నుంచి వచ్చినవి కాబట్టి, పురుషాధిక్య సమాజంలో చెక్కు చెదరని ఆత్మ విశ్వాసంతో తనకు తానే ఒక చిరునామాగా నిలుస్తున్న ఆమె ఎప్పటికీ బంగారు తల్లే. నిజమే ఇంట బయట తనకి ఎన్ని ప్రతిఘటనలు ఎదురైనా వాటిని నవ్వుతూ స్వీకరిస్తుంది కదా అందుకే బంగారు తల్లి..అంటారు. జీవితానిది ఏముందిలే మరణిస్తే తప్ప విలువలేని ఈ జీవితానిది ఏముంది అని స్వగతంలో ఒక ప్రశ్న ..ఒకరి కోసం మరొకరం అంటూనే తన కోసం కూడా బతకలేని పరాయితనం.. అంటే మనుషుల్లో పేరుకుపోయిన స్వార్ధం పచ్చి నిజం.

మరణం కూడా మాట్లాడుతుంది

జీవిత అనుభవాల్ని తాత్వికతతో ప్రకటించే ప్రయత్నం చేశారు ఈ కవయిత్రి. మనిషి అంతరాత్మని కాదని ఏమి చెయ్యలేదు అలాంటి మనసుకి వ్యతిరేకంగా చేయాల్సి వస్తే కష్టం కదా..అంతరాత్మ మరణించాక కన్నీటితో ఎన్ని అనుబంధాలు ఎదురు అయితే ఏమిటి? పుట్టుక గురించి ఎవరు మాట్లాడుకోరు కానీ మరణం గురించి మాత్రం ఖచ్చితంగా మాట్లాడతారు. ప్రతి చావుకి ఒక గౌరవం ఉంటుంది అందుకే అంటారు జననం మాట్లాడదేమో మరణం ఖచ్చితంగా మాట్లాడుతుంది, నిజం కదా. (మరణం మాఫియా), చివర్లో జీవించినప్పుడే కాదు మరణించాక కూడా శరీరం రేట్ పలుకుతుంది, రంగు రూపం ఒకటే అయినా ఉనికి లేకుంటేనే నయం. సృజనాత్మక చింతలో ఒక దశ.. కవయిత్రి కేవలం సృజనాత్మక రచనని సమస్యలపై ఎక్కు పెట్టి కవిత పరమార్ధాన్ని తీసుకువచ్చారు

కవిత్వంలో ఫిలసాఫికల్ టోన్‌

శైలజా మిత్ర గారి కవిత్వంలో జీవిత సమస్యలపై తాత్వికత చాలా కనిపిస్తుంది. మహిళా సమస్యల పట్ల ఒక దృక్పధం ఉంది. సహానుభూతి ఉంది. అలా అని ఫెమినిజం కోవలోకి తీసుకోనక్కర్లేదు. మహిళా సమస్యతో పాటు నేటి కాలమాన పరిస్థితుల పట్ల సమస్యల పట్ల స్పష్టత ఉంది. ఎక్కువగా మనకి ఫిలసాఫికల్ టోన్‌లో కవిత్వం వినిపించినా అది జీవితపు తాలూకు సంఘర్షణలుగా భావించవచ్చు కదా. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా అనుభూతి వెంటాడినట్టు, కవిత్వం రాయడమే పుట్టుకతో సమానం అంటూ జన్మించడమే కవిత్వం అని డంకా బజాయించి మరీ సాహిత్య లోకానికి చెప్పారు.

మంచి కవిత్వం ఒక మంచి పాటతో సమానం. కొన్ని తరాల దాకా పాట ఎలా ప్రవహిస్తుందో అలాగే కవిత్వం కూడా. కాల ప్రవాహంలో కొట్టుకుపోకుండా నిలుస్తుంది. శైలజ మిత్ర గారి కవిత్వం ఇదే కోవలోకి వస్తుంది అనడంలో సందేహం లేదు. మంచి కవిత్వాన్ని అందించిన కవయిత్రికి జేజేలు...

పుస్తకం : జన్మించడమే కవిత్వం

రచయిత : శైలజా మిత్ర

ప్రచురణ: అన్వీక్షి పబ్లికేషన్స్, బంజారా హిల్స్

పేజీలు: 214

వెల: రూ. 175

ప్రతులకు : 98, Soujanya Avenue, SBI Colony, Gandhinagar, Hyd-80,

సమీక్షకులు

పుష్యమీ సాగర్.

79970 72896

Advertisement

Next Story

Most Viewed