మారిటల్ రేప్‌పై తొలి నవల…

by Ravi |
మారిటల్ రేప్‌పై తొలి నవల…
X

‘‘నాకు కొంత గడువు కావాలి. మొదటి రాత్రి వాయిదా వేయాలి’’ అంది మహిమ. ‘‘సరే.. నిన్ను నేనేం చేయను ప్రామిస్.’’ అన్నాడు చరణ్. రాత్రి పన్నెండైంది. మహిమకు మెలకువ వచ్చి ‘‘ఏంటిది చరణ్ లే’’ అంటూ తొయ్యబోయింది. ‘‘ప్లీజ్ ఆగలేను.. అమ్మ కూడా ఒప్పుకోవడం లేదు. ముహూర్తం ఉంది ఇప్పుడే.. ఇంకో అయిదు నిమిషాల్లో అయిపోవాలిట.’’ అన్నాడు. విడిపించుకోవాలని చూస్తున్న ఆమె పైకి నగ్నంగా, అసహ్యంగా, భల్లూకంలా ఒళ్లంతా వెంట్రుకలతో ఎక్కేశాడు. తాగిన మైకంలో కళ్లు ఎర్రబారి చింతనిప్పుల్లా ఉన్నాయి. ‘‘ప్లీజ్ చరణ్ ఒద్దు..నేను సిద్ధంగా లేను ఒదిలేయ్..ఇంకో రెండు రోజులు’’ అంది ఏడుస్తూ. అతను వినలేదు. ఘోరంగా రేప్ చేసేశాడు. రెండు కాళ్ల మధ్య రక్తం కారడం, నొప్పితో అరవడం మాత్రమే మహిమకు తెలుసు. స్పృహ తప్పింది. చాలాసేపటికి స్పృహ వచ్చి చూసుకుంటే తన ఒంటి మీద నూలుపోగు లేదు. లేచి ‘‘యూ బాస్టర్డ్ ..యూ రేప్డ్ మీ..హౌ డేర్ యు’’ అరిచింది. అతని మీద ఖాండ్రించి ఉమ్మేసి ఏడుస్తూ నైటీ తీసుకుని బాత్రూం వైపు పరిగెత్తింది. తనలో ఆవేశం..కోపం..దు:ఖం..అవమానం పెల్లుబికాయి. వెంటనే అక్కడున్న లైజోల్ తాగేసింది.

ఇదొక మారిటల్ రేప్. పడకటింట్లో జరిగే అత్యాచారాలను ‘విత్ యువర్ పర్మిషన్’ నవలలో గీతాంజలి బట్టబయలు చేశారు. ఎంతో దారుణంగా జరిగిన సంఘటనలతో ఈ నవల సాగుతుంది. ‘మారిటల్ రేప్’ను వంద దేశాలు నేరంగా పరిగణించాయి. గోప్యత, మర్యాద, గౌరవం ముసుగులను ఈ నవలతో గీతాంజలి చించి అవతలపారేశారు. ‘మారిటల్ రేప్’పై దేశంలోనే వచ్చిన తొలి నవల ‘విత్ యువర్ పర్మిషన్’.

కొన్ని నిమిషాల్లో ట్యాంక్ బండ్‌లో దూకేయాలనుకుంటున్న మహిమకు ‘స్ట్రాంగ్ ఉమన్ ఫైట్స్’ నిర్వాహకురాలు, అడ్వొకేట్ వరద పరిచయమవుతుంది. భర్త చేసే లైంగిక అత్యాచారాలు, హింసను ఎదుర్కొంటూ ఎలా బయటపడాలో స్త్రీలు చర్చించుకునే వేదిక ‘స్ట్రాంగ్ ఉమన్ ఫైట్స్’. మహిమ కేంద్రంగానే ఈ నవలంతా సాగినప్పటికీ, ఇంతకంటే దారుణమైన సంఘటనలున్నాయి.

ఆ మంచం సతీసహగమనకాష్టం

‘‘ఆరాత్రి నొప్పి ఎక్కువయ్యింది. వద్దు ప్లీజ్..’ అని చెప్పాను. చెంపలు వాయగొట్టేస్తూ, కిందపడేసి కాళ్లతో తన్ని, ఎత్తి మంచంమీద కూలేసి ‘దొంగ లంజా.. భర్తను సుఖపెట్టలేని నీకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు’ అంటూ అక్కడే ఉన్న పొడవాటి టార్చిలైట్‌ను ఉల్టాచేసి నా వెజైనాలోకి బలవంతంగా దూర్చి, అలాగే గుచ్చుతూ పోయాడు. భయంతో..నొప్పితో స్పృహ తప్పిపోయా. ఆ మంచం నన్ను సజీవంగా కాల్చేసే సతీసహగమన కాష్టం.’’ అంది ఎగ్మెస్.

వధ్యశాలగా పడకగది

‘‘తొలి రాత్రి వాడు నన్ను ఎనిమిది సార్లు మృగంలా రేప్ చేశాడు. విపరీతమైన నొప్పితో స్పృహ తప్పిపడిపోయాను. ‘లంజా..మొగుడి కోరిక తీర్చవానే నువ్వు..’ అంటూ చచ్చేట్టు కొట్టాడు. మ్యూచువల్ గ్రౌండ్ కింద విడాకులు తీసుకున్నాం’’ అంది భువన. సృష్టిలో ఏ జంతువూ రేప్ చేయదు మనిషి తప్ప. ‘‘మెన్సస్‌లో ఉన్నా, గర్భం ధరించినా, ప్రసవం అయినా, పచ్చి బాలింతైనా అతనికి అవసరం లేదు. పసిబిడ్డలు తాగాల్సిన పాలను తాగేస్తాడు.’’ అంది అనుపమ.

‘గే’ లు, లెస్బియన్లు

‘స్ట్రాంగ్ ఉమన్ ఫైట్స్’ నిర్వహకురాలు వరద సుధాకర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వరద ఒక సారి ఊరి నుంచి ముందుగానే తిరిగొచ్చి తలుపు తీసే సరికి మంచం మీద సుధాకర్ తన సహ అడ్వొకేట్ వరుణ్ నగ్నంగా ఉన్నారు. సుధాకర్‌ను వరుణ్ వెనుక నుంచి సెక్స్ చేస్తున్నాడు. ‘స్టాప్ ఇట్’ పెనుకేక వేసింది వరద. అతని చెంప చెళ్లుమనిపించింది. విభాత్, వరద లెస్బియన్లుగా జీవిస్తున్నారు. విభాత్ తండ్రి తన భార్యను హింసించేవాడు. కూతుర్లపైన అత్యాచారానికి పాల్పడేవాడు. పురుషుడు అంటే విభాత్‌కు అసహ్యం.

కళ్లలో నిప్పును దాచుకున్న కొలిమి

పావనికంటే పన్నెండేళ్ల పెద్దవాడినిచ్చి బలవంతంగా పెళ్ళి చేశారు. అమ్మను కాళ్లు చేతులు కట్టేసి చీకటి గదిలో బంధించారు. పావని ఒకసారి తప్పించుకోలేకపోయింది. ఆడపడుచు తలవైపు నిలబడి రెండు చేతులూ విరిచి పట్టుకుంది. అత్త కాళ్లు పట్టుకుంది. నోట్లో బట్టలు కుక్కి జంతువులా పడ్డాడు. బెడ్ షీట్, లంగా అంతా రక్తంతో తడిసిపోయింది. చచ్చిపోతుందేమోనని ఆస్పత్రికి తీసుకెళ్ళారు. గాయాలు చూసి అమ్మ ఎర్రబడ్డ కళ్ళతో నిప్పుని దాచుకున్న కొలిమిలా కనిపించింది.

మహిమ మొగుణ్ణి ఒదిలేసి పుట్టింట్లో ఉంటే ఆమె చెల్లెలు యామినికి, చరణ్ చెల్లెలు శరణ్యకి పెళ్లిళ్లు ఎలా జరుగుతాయి? చరణ్ కుటుంబం నుంచి బెదిరింపులు రాయబారాలు. ‘‘మహిమ వస్తుంది కానీ, చరణ్ ముట్టుకోకూడదు. తన కిష్టం లేకపోతే, అతను హద్దు మీరితే మరుక్షణం వెళ్లిపోతుంది.’’ అని రాసిన కాగితాల మీద సంతకాలు తీసుకుని మహిమను అత్తవారింటికి పంపారు.

‘‘నేనిలాగే కాగితాల మీద షరతులతో వెళ్లి కాపురం చేశాను. మీ తాతను భయపెట్టాను తరువాత కాపురం చేయగలిగాను’’ అంది మహిమ అమ్మమ్మ. ‘‘నా ప్రమేయం లేకుండా, నాకు చెప్పకుండా శోభనం ఏర్పాట్లా?’’ అనుకుంది మహిమ. వాలైంటైన్స్ డేకు చరణ్ మహిమను డిన్నర్ టేబుల్ దగ్గరకు తీసుకెళ్ళాడు. ‘‘ప్లీజ్ హావ్ ఇట్’’ అంటూ జేబులోని ఉంగరం తీసుకుని మహిమ చేతిని లాక్కుని తొడిగేసి, మోకాళ్ల మీద కూర్చుని గులాబీ ఇస్తూ, ‘‘ఐలవ్ యూ’’ అంటూ నోట్లో స్వీట్ కుక్కబోయాడు. ‘‘యూ బిచ్’’ అని తిట్టిన నోటితోనేనా ‘‘ఐలవ్ యూ’’ అని చెపుతున్నాడు! ఉంగరాన్ని తీసి విసిరి కొట్టింది. చరణ్ మహిమలకు విడాకులు మంజూరయ్యాయి.

కలకత్తా లిటరరీ ఫెస్టివల్‌కు తప్పకుండా రావాలంటాడు బిపిన్ చంద్ర. మహిమకు ఉత్తరం రాస్తాడు. బిపిన్ చంద్ర దగ్గరకు ప్రయాణం చేస్తుంటే సంతోషమో, ఉద్వేగమో తెలీని ఒక అనుభూతికి లోనవుతుంది మహిమ. మహిమ ముందు నిలబడి ‘విత్ యువర్ పర్మిషన్’ అంటాడు. "దేనికి" అంది మహిమ. "ఐవాంట్ టు కిస్ యూ" అన్నాడు. "యస్ యు కేన్ కిస్ మి" అన్నది మహిమ. ‘‘నా భర్త నుంచి విడిపోయాక చాలా స్వేచ్ఛను అనుభవించాను. ప్రశాంతంగా రాసుకోగలుగుతున్నాను.’’ అని కలకత్తాలోని మహాశ్వేతాదేవి మ్యూజియంలోని డాక్యుమెంటరీలో ఆ మహారచయిత్రి చాలా గంభీరంగా చెపుతోంది.

‘‘పెళ్లి తరువాత భర్త చేసే ‘మారిటల్ రేప్’ని నేరంగా పరిగణించాలా, లేదా అన్నదానిపై న్యాయవ్యవస్థలో భిన్నాభిప్రాయాలున్నాయి. మహిమ, బిపిన్ చంద్ర మధ్య పూర్వపు సాన్నిహిత్యం ఏర్పడుతుంది. ‘విత్ యువర్ పర్మిషన్’ స్త్రీల వైవాహిక లైంగిక హింసనే కాదు, గుండెలను పిండేసే మహిళలకు జరిగే ఖత్నాల గురించి, ట్రాన్స్‌జెండర్ల గురించి, లెస్బియన్ల గురించి, ‘గే’ ల గురించి చర్చించిన నవల.

పుస్తకం : విత్ యువర్ పర్మిషన్

రచన : గీతాంజలి(డాక్టర్ భారతి)

పేజీలు : 208

వెల : రూ. 200

ప్రతులకు : గీతాంజలి 88977 91964

నవోదయ బుక్ హౌస్: 040-24652387

ఆన్వీక్షికి పబ్లిషర్స్ : 97059 72222


సమీక్షకులు

రాఘవ

94932 26180



Next Story