- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
- Union Budget 2025-2026
వర్షం కురిసిన మట్టి వాసన
దారి తెలిసినప్పుడే మేఘం ఎటువైపు వెళ్ళాలో నిర్ణయించుకొని ఎక్కడ ఆగాలో అక్కడ ఆగి వర్షం కురిపించి నేల దాహార్తిని తీరుస్తుంది. కథలు కూడా మేఘాల్లాంటివే. ఊహాలోకాల్లో విహరింపజేయకుండా గుండెను తడిమి తడిచేసేవి. మన చుట్టూ కనిపించే రకరకాల దృశ్యాలు కథలుగా అల్లుకుపోయి పాఠకులను కదిలింపజేస్తాయి. కథను నడిపించే తీరును బట్టి మనస్సుకు హత్తుకుపోతాయి. అలాంటి కథా సంపుటి బద్రి నర్సన్ ‘దారి తెలిసిన మేఘం’.
జైల్లో ఉరి తీసే తలారి అంతరంగాన్ని మానవీయ కోణంతో సమీక్షించి పాపపు పని నుంచి తప్పించిన ‘ఈ శిక్ష మాకొద్దు’ కథతో కథల వరుస మొదలైంది. సామాజిక సమస్యలు, వర్తమాన లోకం పోకడపై వ్యాసాలు రాయడం మొదలుపెట్టిన ఈ రచయిత, తన చుట్టూరా తారసిల్లిన సంఘటనలకు స్పందించి కథలుగా మలచడం ఓ అనిర్వచనీయమైన అనుభూతి. విశాల జీవితంలోంచి, భిన్న అనుభవాలలోంచి తనకు తెలిసిన పాత్రలకు బతుకునిచ్చాడు గనుక కథలు చదివిన పాఠకులు ఆలోచనా పరిధిని పెంచుకునే అవకాశముంది.
చెదిరిపోని, చెరిగిపోని కథలు..
అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతున్న మధ్యతరగతి కుటుంబాల జీవనాన్ని ‘పాలు మరిచినవాళ్లు’ కథను హృదయ విదారకంగా చిత్రించిన కథ కాగా, ‘మతములన్నియు మాసిపోవును - జ్ఞానమొక్కటే నిలిచి వెలుగును’ సూక్తికి అక్షర రూపం ‘దారి తెలిసిన మేఘం’. మధ్యతరగతి జీవితంలో కలవరపరిచే సంఘటనలు, దాన్ని పట్టుకుని ఉండే నిస్సహాయతా కళ్ళకు కట్టేలా వివరించే ఈ రెండు కథలు ఎన్నాళ్ళయినా ఎద నుంచి చెరిగిపోవు. మూడు కుటుంబాల్లో మనస్సుకు బాధ కలిగించే సంఘటనలు చోటు చేసుకోవడం, దీంతో తల్లిదండ్రులు పడిన వేదన వాస్తవ జీవితాలకు చాలా దగ్గరగా నడిచిన కథ ‘పాలు మరిచినవాళ్లు’. కొడుకులు, కోడళ్లు స్వార్థంతో ప్రవర్తించిన తీరును సరళమైన పదాలతో నడిపించిన కథనం కంటతడి పెట్టిస్తుంది. ఇక ఆదర్శం ముందు ‘దారి తెలిసిన మేఘం’ కథ నిలిచి, ఆచరణ ముందు చేతులు కట్టుకుని నిల్చొంది. ఆశయాలు సిద్ధించే అవకాశాలను వెన్నంటి అనేక ఒత్తిళ్లు అడ్డంకులు పొంచి ఉండడం ఆధునిక జీవనంలో సర్వ సహజం. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కావడంతో సమాజంలో వస్తున్న మార్పులకు అద్దం పట్టింది. ఉన్నత జీవన ఆకాంక్షలను నెరవేర్చుకోవడానికి పరుగులు తీస్తున్న ఈనాటి యువతరం తీసుకుంటున్న నిర్ణయాలను ఎంతో సున్నితంగా స్పృశించారు రచయిత. ఒక చిన్న క్యాన్వాస్ పై ఆడపిల్ల జీవితంలో జరిగే సంఘటనను, సామాజిక కోణంలో జీవన పార్శ్వాన్ని ఎంతో స్ఫోరకంగా, గాఢంగా చెప్పిన కథ ‘మరక మంచిదే’. పీరియడ్ వచ్చినప్పుడు మూలకు కూర్చొనే సనాతన సాంప్రదాయాన్ని బద్దలు కొడుతూ ప్రకృతి సహజత్వానికి ఆధునీకత జోడించి ‘హ్యాపీ టు బ్లీడ్’ అంటూ సుమను ఫెమినిస్టుగా మార్చాడు.
చిరునవ్వు పూయడానికి పాతికేళ్లు..
ఆశయసిద్ధి కోసం అహర్నిశలూ తపించే దంపతులు ఒకరి కోసం ఒకరు కానీ, పిల్లల కోసం కానీ చాలినంత సమయం కేటాయించలేక పోతున్న ఈ కాలంలో ప్రతాప్, సరోజల కష్టాలు ‘రబ్బరు బొమ్మ’లో కదిలిస్తాయి. వీరి వ్యక్తిత్వాలకు పరీక్షగా నిలిచిన కూతురు జీవని, ఆ దంపతుల పెదవులపై చిర్నవ్వు పూయడానికి పాతికేళ్లు వేచి చూడాల్సి వచ్చింది. కష్టాలను గుండె నిబ్బరంతో ఎదుర్కోగలిగినప్పుడు వసంతం వెల్లివిరస్తుందనడానికి ఈ కథ ఉదాహరణ. ‘సెరిబ్రల్ పాల్సీ’తో పుట్టిన జీవని తల్లిదండ్రులకు పెద్ద కష్టమే తెచ్చిపెట్టింది. దంపతులు సరోజ, ప్రతాప్ లు ఎంతో నిబ్బరంతో జీవితాన్ని ఈది జీవనిని మామూలు మనిషే కాదు, ఉత్తమ మహిళగా తీర్చిదిద్దిన కథ ఇది. సమస్యలతో ఊపిరి పీల్చుకోలేకపోతున్న ఎంతోమంది దంపతులకు స్ఫూర్తిని అందిస్తుంది ఈ కథ. అనుమానాలు కుటుంబాన్ని ఛిద్రుపదులు చేస్తుందని తెలియజెప్పిన కథ ‘ఎంగిలి’. పడుపు వృత్తి కుటుంబాల దైన్యస్థితి ‘జానకి విముక్తి’. వయసులో ఉన్న వ్యభిచారిణి తల్లిని కావాలన్న బలమైన కోరికకు బలైపోతున్న జీవితాలతో ఈ కథను అల్లాడు. దీప జీవితం అనేక మలుపులు తిరిగి జైల్లో బిడ్డని కని, కొత్త జీవితానికి పాదు వేసుకోవడం ఈ కథ కొసమెరుపు.
ఏక ఆశయం.. రెండు భిన్న పాయలు..
మధ్యతరగతి కుటుంబాల్లోని చావు తంతును ‘కర్మకాండ’ పేరుతో రాసిన కథలో రచయిత మూఢనమ్మకాల నడ్డి విరగ్గొట్టాడు. అంటూ, ముట్టూ పేర్లతో వ్యక్తుల మధ్య దూరం పెరగడం, ఆకలిని హరింపజేసే ఆహార పదార్థాలకు ‘చావుకూడు’ అనే పేరును తగిలించడాన్ని వ్యతిరేకించాడు. మనోహర్ తన తల్లి చావు అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని కర్మకాండ నుంచి తప్పించుకోవడానికి భార్య కవితతో కలిసి మరణం తర్వాత తమ పార్ధివ దేహాలను మెడికల్ కాలేజీలకు ఇవ్వాలని నిర్ణయించుకుని అభ్యుదయ మార్గాన్ని ఎంచుకున్నాడు. ‘మూడు స్తంభాలాట’ కథ ప్రధాన ఇతివృత్తం 1980వ దశకంకు చెందింది. సిరిసిల్ల, జగిత్యాల రైతాంగ పోరాటంలో భాగంగా ఇలాంటి సంఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. ముగింపు మాత్రం ప్రస్తుతం జరుగుతున్న తీరును తెలియజేస్తోంది. చాలా మంది మాజీ నక్సలైట్లు ప్రజా ప్రతినిధులుగా చెలామణవుతుండగా, ప్రకాశ్ వంటి వారు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలుగా మారి ఆశయాలను, కనీస మర్యాదలను తుంగలో తొక్కుతున్నారు. రామస్వామి లాంటి వారు కళ్లప్పగించి చూడటం తప్ప మరో మార్గం లేకుండా పోయింది. ఏక ఆశయంతో ముందుకు సాగి రెండు భిన్న పాయలుగా సాగడంతో వర్తమాన సమాజం పోకడను రచయిత శక్తివంతంగా చిత్రీకరించాడు.
శక్తివంతమైన ఆయుధంగా కథ
ప్రజా జీవనంలో ఎదుర్కొంటున్న అసమానతలు, మూఢనమ్మకాలు, మత విద్వేషాలు, లైంగిక సంబంధాలు, కుటుంబ సమస్యలను ఇతివృత్తాలుగా, జీవ ధాతువుగా చేసుకొని ‘కథ’ను శక్తివంతమైన ఆయుధంగా ప్రయోగించాడు. జేష్ట పాలు, కూటివిద్యలు, ద్వేషభక్తి, వరశాపం, బంధాలు-అనుబంధాలు, సుమిత్ర వంటి భిన్నమైన కథాంశాలను ఎంచుకొని కథగా మలచడంలో బద్రి నర్సన్ సామాజిక మూలాల్లోకి వెళ్ళాడు. తన విశ్లేషణా శక్తినీ, అవగాహననూ పరిణతితో ప్రదర్శించాడు. కొన్ని కింది వర్గాల సాధక బాధకాలను అద్భుతంగా పాఠకుల ముందుంచాడు. మధ్యతరగతి కుటుంబాల జీవన సరళిని అతి సరళమైన శైలిలో, చదివించగల నేర్పుతో వెలువడ్డ సాదాసీదా కథల సంపుటి ‘దారి తెలిసిన మేఘం’.
పుస్తకం: దారి తెలిసిన మేఘం
రచయిత బద్రి నర్సన్
వెల రూ. 150
ప్రతులకు 94401 28169
సమీక్షకులు
కోడం పవన్ కుమార్,
98489 92825