- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఎందుకిలా ఓడాం? వైసీపీలో అంతర్మథనం!

దిశ, డైనమిక్ బ్యూరో : మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో సంఖ్యాపరంగా వైసీపీకి బలముంది. అయినా ఉప ఎన్నికల్లో ఒక్క విజయమూ దక్కలేదు. పార్టీ ఎంత కట్టడి చేసినా, చివరకు విప్ జారీ చేసినా కౌన్సిలర్లు, కార్పొరేటర్లు మాట వినలేదు. దీంతో ఎందుకిలా అంటూ వైసీపీలో అంతర్మథనం మొదలైంది. హిందూపురం, నందిగామ మున్సిపల్ చైర్మన్ పదవులు కూటమికే దక్కాయి. తిరుపతి, నెల్లూరు ఏలూరు డిప్యూటీ మేయర్ల స్థానాలు కూడా టీడీపీ వశమయ్యాయి. గుంటూరు కార్పొరేషన్ లో వైసీపీకి మెజారిటీ ఉన్నా స్టాండింగ్ కమిటీ పదవులన్నీ కూటమికే దక్కాయి. ఈ విజయాల వెనుక టీడీపీ మంత్రాంగం పనిచేసింది. తమ వారిని కాపాడుకోవాలని వైసీపీ చేసిన క్యాంపు రాజకీయాలు ఫలితానివ్వలేదు.
మరోవైపు గ్రామస్థాయి నాయకుల నుంచి ఎంపీల స్థాయి వరకు వైసీపీని వీడిపోతున్నారు. జగన్ కు ముఖ్యం అనుకున్న వాళ్లంతా పార్టీకి దూరమైపోతున్నారు. కుడి భుజం లాంటి విజయసాయిరెడ్డి పార్టీకి రాజీనామా చేయడం వైసీపీకి పెద్ద డ్యామేజీ. పలువురు ముఖ్య నేతలు కేసుల్లో ఇరుక్కుని, నోరు ఎత్తడానికి భయపడుతున్నారు. అధికారం కోల్పోయిన ఎనిమిది నెలల్లో ఒకటి రెండు సందర్భాల్లో తప్ప జగన్ కూడా జనంలోకి రాలేదు. దీంతో క్యాడర్లో తీవ్ర గందరగోళం నెలకొంది. సంక్రాంతి తర్వాత జనంలోకి వస్తారని అంతా భావించినా అదీ జరగలేదు. ఇదిలా ఉంటే విదేశీ పర్యటన ముగించుకున్న జగన్ బెంగళూరు వెళ్లి అక్కడ నుంచి తాడేపల్లి కి చేరుకున్నారు. కొద్దిరోజులపాటు ఆయన ఇక్కడే ఉంటాడని, జిల్లా నేతలతో వరుస సమావేశం నిర్వహిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. భవిష్యత్ కార్యాచరణ పై సమీక్షలు చేస్తారని పేర్కొన్నారు. తాజాగా జరిగిన మున్సిపల్ ఉప ఎన్నికల్లో ఓటమికి గల కారణాలు విశ్లేషించే అవకాశం ఉంది.
ఈ నెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని ప్రభుత్వం ప్రకటించింది. ఈ సమావేశాలకైనా జగన్ హాజరవుతారా లేదా అనేది చూడాలి. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానంటూ ఆయన పట్టుపట్టి కూర్చున్నారు. ఆ వ్యవహారం కోర్టులో ఉంది. వరుసగా 60 రోజుల పాటు అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేట పడుతుందని నిన్న శాసన సభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది సాధ్యమేనా అనే విషయంపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇదే మాదిరిగా గతంలో చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి దూరంగా ఉన్నారు కదా అంటూ వైసీపీ గుర్తుచేస్తుంది. ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందంటూ తమ నాయకులకు జగన్ పదేపదే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అసెంబ్లీకి హాజరై ఆ విషయాలను మాట్లాడుతారనే ప్రచారం నడుస్తోంది.