- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమ్మిన ఆలోచనావళి
నిరంతర సాహిత్య పఠనం విశ్లేషణాత్మక రచనలను అందించడానికి దోహద పడుతుందనడానికి డాక్టర్ అమ్మిన శ్రీనివాసరాజు రాసిన వ్యాసాలు నిదర్శనంగా కన్పిస్తాయి. 'అక్షరాభిషేకం' పేరుతో ఇటీవల ఆయన వెలువరించిన వ్యాస సంపుటిలో దేనికదే ప్రత్యేకత కలిగిన ఇరవై వ్యాసాలున్నాయి. రచయితలోని వికసిత విమర్శానా దృష్టి కోణాన్ని వ్యాసాలు తేటతెల్లం చేశాయి. అధ్యాపక వృత్తిని అంకిత భావంతో నడుపుతూనే సామాజిక రచనలు చేశారు.
కందుకూరి, గురజాడ, గిడుగు, కట్టమంచి వంటి ఎందరో మహనీయుల కృషిని ఆసక్తికర రీతిలో విశ్లేషించారు.పఠనాభిలాషను పెంపొందించే రీతిలో వ్యాసాల శైలి సాగింది. నిర్లక్ష్యానికి గురవుతున్న 'తెలుగుభాష' గురించి భాషాభిమానులు పడిన ఆరాటాన్ని చక్కగా చూపారు. ఈ వ్యాసం తెలుగు తెలిసిన ప్రతివారినీ ఆలోచింపజేసి తీరుతుంది. ఉగాది, సంక్రాంతి సందర్భంగా గంగిరెద్దులవారు, హరిదాసులు, జంగమయ్యలు, బుడబుక్కలవారు 'దొరికినప్పుడే కడుపునింపుకుని, దొరకనప్పుడు నీళ్లు తాగి ఆకలి చల్లార్చుకోవడం అతి సామాన్య విషయం అయిపోయింది' అని రాసిన వాక్యాలలలో కళనే నమ్ముకున్న వారి జీవన దైన్యం కన్పిస్తుంది.
తెలుగు కథా సుమాలను వాడిపోకుండా మరో వందేళ్లు కాపాడుకుందామన్న సందేశంతో 'పత్రికల గుప్పెట్లో కథల ప్రాణాలు' అన్న వ్యాసం సాగింది. భాషా నిక్షేపాలను సంస్కరిస్తే వినియోగదారులలో మార్పులు రావడం అనివార్యమని, మూలాలను ముట్టుకోకపోతే ఆశించిన ఫలితాలు రాకపోవచ్చని 'పద సంపదను పండించుకుందాం' అన్న వ్యాసంలో చెప్పారు. రచనలు అర్థం చేసుకుని విమర్శ చేయడం ఉత్తమమన్న దృష్టికోణాన్ని వెల్లడించారు. మహాకవి సినారెను సాహితీ విపంచిగా చూపారు. భద్రాద్రి మన్నెసీమలో ఆదివాసీలు, గిరిజనేతరుల సమైక్య జీవనాన్ని తెలిపారు. చెన్నకేశవ నాట్యమండలితో పాటు అనేక నాటక కళా సమితులు, ఆర్ట్స్ అకాడమీలు, కళాపరిషత్‌లు, ఏలూరు హనమంతరావు, కడెం కృష్ణార్జునరావు, షేక్ ఇమాం, గాలి లక్ష్మణస్వామి, బీవీ రావు, సీవీ రమణ వంటి 136 మంచి కళాకారుల నాటక రంగ కృషిని వివరించారు. 'అక్షరాభిషేకం'లో ప్రతి వ్యాసం అమ్మిన శక్తి సామర్థ్యాలకు నిదర్శనంగా నిలుస్తుంది.
ప్రతులకు:
డా. అమ్మిన శ్రీనివాసరాజు
లక్ష్మీపురం, పేరూరు పోస్టు
వాజేడు మండలం, ములుగు జిల్లా,
తెలంగాణ, 507136
పేజీలు 124: వెల: రూ. 200
7729883223
సమీక్షకులు :
తిరునగరి శ్రీనివాస్
84660 53933