బొడ్రౌతు.. తెలంగాణ కథా సంకలనం

by Ravi |   ( Updated:2024-09-15 18:31:23.0  )
బొడ్రౌతు.. తెలంగాణ కథా సంకలనం
X

హనుమకొండ మైత్రి ప్రచురణలు ద్వారా రావుల కిరణ్మయి కలం ద్వారా వివిధ సందర్భాలలో, వివిధ పత్రికల్లో వచ్చిన కథలను, మైత్రీ ప్రచురణలు వారు బొడ్రౌతు అనే పేరుతో ఒక పుస్తకాన్ని ప్రచురించినారు. ఈ కథా సంకలనానికి సుప్రసిద్ధ నవలా రచయిత కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, అంపశయ్య నవీన్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ పూర్వ రిజిస్ట్రార్ ఆచార్య భక్తవత్సల్ రెడ్డి, రాష్ట్ర భాషోపాధ్యాయ రాష్ట్ర అధ్యక్షులు చక్రవర్తుల శ్రీనివాస్ ముందు మాట రాయడం పుస్తక ఔన్నత్యాన్ని తెలియ చేస్తుంది. పుస్తక ప్రచురణకు తెలుగు విశ్వవిద్యాలయం వారు ఆర్థిక సహాయం అందించడం, పుస్తక విశిష్టతను తెలియ చేస్తోంది

వాడుక భాషకు అక్షర రూపమిచ్చి

ఇక పుస్తకంలో ముందుమాట రాసిన కవిత్రయం, పుస్తకం లోని ప్రతి కథను సమీక్ష చేస్తూ రచయిత్రి రావుల కిరణ్మయిని అభినందిస్తూ, ఆశీర్వాదాలు అందజేస్తూ, ముందు ముందు కిరణ్మయి కలం నుండి, సామాజిక హితమే కథా వస్తువుగా ఉండాలి అని అభిలాష వ్యక్తం చేశారు. ఇక కథల్లో వాడిన భాష విషయానికి వస్తే తెలంగాణ వాడుక భాషకు అక్షర రూపం కల్పించి తెలంగాణ మాండలిక బాషకు మణిహార మకుటం ధరింప చేసిన కిరణ్మయికి తెలంగాణపై ఉన్న ప్రేమ ప్రకటితమవుతుంది. శ్రీతెలంగాణ కథలో రచయిత్రి కిరణ్మయి తెలంగాణ సామెతలు ఆసాంతం వివరిస్తూ, తెలంగాణ లోని వృత్తి, సాంఘిక జీవనాన్ని వివరిస్తూ, కాళోజీ వాక్యాలు ఉదహరిస్తూ తెలంగాణ ఏర్పడిన రోజు, ఒక కుటుంబంలో పుట్టిన ఆడపిల్లకు శ్రీ తెలంగాణ అని నామకరణం చేయడం తెలంగాణ ప్రజలు తమ రాష్ట్ర ఆవిర్భవాన్ని ఎంత ఘనంగా చేసుకున్నారు అని వివరిస్తుంది. ఇక కొన్ని కథలలో తెలంగాణ ప్రజల ఆలోచన వైవిధ్యమైన పోకడలు కూడా తెలంగాణ యాసలో వివరించడం రచయిత్రి వైశిష్ట్యానికి నిదర్శనం.

ఇక కొన్ని కథల్లో ప్రభుత్వ, సంక్షేమ, పథకాలు, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు, అభివృద్ధి, పథకాలు, ప్రభుత్వం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే పథకాలు ప్రజలకు చేరవేసేందుకు చేసిన ప్రయత్నం అభినందనీయం. కొన్ని కథల్లో సాంఘిక దురాచార వ్యవస్థను ఎత్తి చూపుతూ దాని నిర్మూలనకు దోహదపడినది. కొన్ని కథలు తెలంగాణ పండుగల వైశిష్ట్యాన్ని తెలియచేస్తూ పండుగను జరుపుకోవడంలో తెలంగాణ కుటుంబ బంధాలు అనుబంధాలు వ్యక్తపరచడం అభినందనీయం. తీపికాకర కథలో చిన్న పిల్లలు మనస్తత్వానికి అక్షర చిత్రీకరణ చేస్తూ, తల్లికి పిల్లల మీద ఆరాటాన్ని వివరించారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో, ప్రభుత్వ, పాఠశాలలు, ఆస్పత్రులు ప్రస్తావిస్తూ, జనంలో ఉన్న అపోహలు తొలిగించే ప్రయత్నం చేశారు. ఇక తన ఆధ్యాత్మిక భావనలు, వాటి యదార్ధ విషయాలు కూడా సునిశితంగా తన కథల్లో వివరించారు. మొత్తంగా పుస్తకం సమాజంలోని అన్ని వర్గాలకు ఉపయోగకరమైన పుస్తకం అని చెప్పవచ్చు. కిరణ్మయి తన కథలలో పాత్రలకు తెలంగాణలో పూర్వం ఉన్నటువంటి పేర్లు వాడితే కథల్లో పాత్రలు సజీవంగా కనిపిస్తాయి. చివరగా రావుల కిరణ్మయి భవిష్యత్తులో, మనిషి వికాసాన్ని, సామాజిక వికాసాన్ని పెంచే కథలు రాయాలని ఆశిస్తూ...

పుస్తకం : బొడ్రౌతు (కథా సంపుటి)

రచయిత్రి: రావుల కిరణ్మయి

వెల: రూ. 200

ప్రచురణ : మైత్రి ప్రచురణలు, హన్మకొండ

ప్రతులకు ఎ. వెంకటేశ్వర్లు

98494 71176


సమీక్షకులు

- మురికి శివదయాల్

99639 88008

Advertisement

Next Story

Most Viewed