హక్కుల ఉద్యమాల దిక్సూచి బాలగోపాల్

by Ravi |   ( Updated:2024-06-09 19:00:20.0  )
హక్కుల ఉద్యమాల దిక్సూచి బాలగోపాల్
X

బాలగోపాల్ మార్క్సిస్ట్ మేధావి. హక్కుల ఉద్యమాలకు ఒక దిక్సూచిగా నిలిచిన వ్యక్తి. ఆయన మరణించి దాదాపు దశాబ్దకాలం దాటింది. తన మరణం తర్వాత హక్కుల ఉద్యమాలు బలహీనపడ్డాయి. హక్కుల కోసం పోరాడే వ్యక్తుల్ని, వ్యవస్థలని చూడలేకపోతున్నాం. ప్రపంచవ్యాప్తంగా హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో, దళిత, ఆదివాసీ, మైనారిటీ సమస్యలు ప్రబలుతుండగా, రాజకీయాల్లో మత ప్రమేయాలు బలపడ్డాయి. మతోన్మాద ఆధిపత్య భావజాలం, కుల హింసలు ఎక్కువయ్యాయి. అభివృద్ధి పేరుతో అడుగడుగునా అణచివేతలు, హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్న ప్రభుత్వాల తీరు నేటి మన సమాజాన్ని కలచివేస్తున్నాయి. ఆధిపత్య పాలనపై అక్షర యుద్ధం చేసిన బాలగోపాల్ వంటి పౌర హక్కుల ప్రేమికుడు కనుమరుగవడం పీడిత ప్రజలకు తీరని లోటుగా మారింది.

బాలగోపాల్ ఆంధ్ర ఆధిపత్య పాలనను వ్యతిరేకించారు. తెలంగాణలో ఉన్న ఫ్యూడల్ వ్యవస్థపై పోరాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి మద్దతిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనివార్యమైతే అది ప్రజాస్వామిక తెలంగాణ ఏర్పడాలన్నారు. సుదీర్ఘకాలం తర్వాత అనేక త్యాగాలతో తెలంగాణ ఏర్పడింది. కానీ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అనేక మానవ హక్కుల ఉల్లంఘనలు, పరువు పేరుతో కుల హత్యలు, వరంగల్ జిల్లాలో పోడు భూముల విషయంలో ఆదివాసీలపై దాడి, విద్య, వైద్య రంగాల్లో సంక్షోభం వల్ల పాలనా వ్యవస్థను పూర్తిగా దిగజార్చారు. ప్రజావ్యతిరేక విధానాలను అమలు పరుస్తున్న ఆనాటి కేసీఆర్ పాలనను నిలదీసిన హరగోపాల్, కోదండరామ్ లాంటి ఉద్యమకారులపై ఉపా కేసులు పెట్టి భయానక వాతావరణాన్ని సృష్టించారు. తెలంగాణ ఏర్పడితే ప్రజాస్వామిక సూత్రాలతో అభివృద్ధి చేయాలన్న ఆకాంక్షలను విస్మరించారు.

కశ్మీర్ గురించి ఆలోచించడం అంటే...

మానవ హక్కుల ఉల్లంఘనలకు వ్యతిరేకంగా నిలబడి స్వేచ్ఛతో జీవించగలిగే ప్రపంచాన్ని ప్రోత్సహించకపోవడం వల్ల పౌరసమాజం తన బాధ్యతను విస్మరించి బతుకుతున్నది. ఇప్పటికే బాలగోపాల్, కన్నభిరాన్, బొజ్జ తారకం లాంటి ప్రశ్నించే గొంతుకలు లేకపోవడం వల్ల రోజు రోజుకు పాలక పక్షాల నిరంకుశ ధోరణి అడ్డు అదుపు లేకుండా పోతుంది. కారంచేడు, చుండూరు సంఘటనల తర్వాత బాలగోపాల్ కుల సమస్యను తీవ్రమైన సమస్యగా పరిగణించాడు. జమ్మూ కశ్మీర్‌లో జరిగే హింసపై, అక్కడి వాస్తవిక అంశాల మీద బాలగోపాల్ చాలా సార్లు పర్యటించి విస్తృతంగా అధ్యయనం చేశారు. 'కశ్మీర్ గురించి ఆలోచించడం అంటే కశ్మీరీల కోసం ఆలోచించడం' అంటారు బాలగోపాల్ కానీ అక్కడి ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తూ చట్టాన్ని తీసుకువచ్చారు. ప్రశ్నించడమే నేరమైన సమాజంలో బతుకుతున్నాం. దాని ఫలితమే ఇప్పటికీ అనేక మంది మేధావులు, ఉద్యమకారులు జైళ్లలో మగ్గుతున్నారు.

న్యాయవ్యవస్థకు కులం ఉందా?

ఇటీవల కాలంలో అగ్ర కులస్థులకు ఇచ్చిన పది శాతం రిజర్వేషన్లకు సంబంధించిన సుప్రీంకోర్టు తీర్పును నేపథ్యాన్ని పరిశీలిస్తే న్యాయవ్యవస్థకు కూడా కులం ఉందని బాలగోపాల్ ఆనాడే అనేక సందర్భాల్లో వివరించారు. సర్వ స్వతంత్రంగా పని చేయాల్సిన న్యాయవ్యవస్థలు మోడీ హయాంలో కుల ఆధిపత్య ప్రభావాల నుండి బయటపడలేకపోతున్నాయి. దేశంలో ఏ రాజ్యాంగబద్ధ వ్యవస్థ కూడా పారదర్శకంగా పనిచేయకుండా రాజకీయాలకు లోబడి పనిచేస్తున్నాయి. చట్టాల పట్ల, రాజ్యాంగం పట్ల, ప్రజాస్వామ్యం పట్ల పారదర్శకంగా వ్యవహరించే వ్యవస్థలు, మోడీ హయాంలో బలహీనపడటమే కాకుండా వాటి కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో అతి దారుణంగా విఫలమయ్యాయి. కొన్ని నెలలుగా మణిపూర్ రాష్ట్రంలో అంత ఘోరమైన హింస జరిగితే పాలక వ్యవస్థ చూసి చూడనట్టుగా వ్యవహరించిన తీరు వల్ల దేశంలో సామాన్యులకు రక్షణ లేదని, దేశంలోని పౌరులందరూ సమానం కాదనే వాస్తవాన్ని చెప్పకనే చెప్పారు.

మొన్న 2024 ఎన్నికలు జరిగాయి. మూడవసారి బీజేపీ అధికారం చేపట్టబోతుంది. ఈ ఎన్నికలకు ముందు బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే కొత్త రాజ్యాంగాన్ని తీసుకువస్తామని బహిరంగంగానే ప్రకటించారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఎలాంటి ఉపద్రవాలు ఉన్నాయో అని దేశ ప్రజలు భయపడే పరిస్థితి ఏర్పడింది. ఈ వ్యవస్థ ప్రమాదపు అంచుల్లో కొట్టుమిట్టాడుతోంది. మానవ మనుగడ రోజురోజుకి ప్రశ్నార్థకమవుతుంది. పోరాడే వ్యక్తులు కూడా వారి స్వార్థపూరిత ప్రయోజనాల కోసం పాలక పక్షాల సరసన చేరుతున్నారు. బాధితుల పక్షాన నిలబడే వాళ్లు కరువయ్యారు.

విలువల కోసం పరితపించిన మూర్తిమత్వం

ఇంతటి అరాచక పాలన రాజ్యమేలడానికి కారణం, ప్రజా సంక్షేమాన్ని కోరే ఉద్యమ శిబిరాలు బలహీనపడుతున్నాయి. పాలక వ్యవస్థలు చేస్తున్న అరాచకాలను ఎండగడుతూ, పౌరులు కోల్పోతున్న హక్కులను ఎత్తి పడుతూ తన జీవిత ప్రయాణం అంతా ప్రజా క్షేత్రంలోనే గడిపిన బాలగోపాల్ ఆచరణ ఎప్పటికీ చిరస్మరణీయం. ప్రతి మనిషికీ ఒకే విలువ ఉండాలని పరితపించిన బాలగోపాల్ లేని లోటును మన సమాజం ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటోంది. రోజు రోజుకు వ్యవస్థ ప్రమాద గడియల తలుపు తడుతున్నప్పుడు బుద్ధిజీవులుగా మనమెందుకు స్పందించకూడదు? మన మౌనం మరింత విధ్వంసానికి, మరింత వినాశనానికి దారితీయదా?

(నేడు హక్కుల నేత బాలగోపాల్ జయంతి)

- సునీల్ నీరడి

రీసెర్చ్ స్కాలర్, ఉస్మానియా యూనివర్సిటీ

94930 21021

Advertisement

Next Story

Most Viewed