ఇప్పటికైనా కోపం గురించి ఆలోచించాలి!

by Ravi |
ఇప్పటికైనా కోపం గురించి ఆలోచించాలి!
X

కోపం ఉండాల్సిన తరానికి కోపం ఉండటం లేదు. అవసరం లేని వారికి అనవసర కోపాలు ఎక్కువ వస్తున్నవి. ఈ సంవత్సరం పేరే క్రోధి నామ సంవత్సరం. క్రోధి అంటే కోపం అని అర్థం. అంతా కోపంతో నడుస్తుందని పంచాంగంలో చెప్పుతారు. అయితే పంచాంగం చెప్పినట్టు ప్రపంచం నడవదు. ఎవరి రాజ్యాంగం వారికే ఉంటది ఎవరి అంతరంగిక వ్యూహం వాళ్లకు ఉంటది. ఆదాయం వ్యయం కూడా అందులో చెప్పినట్లు గాకుండా పేదవాల్లకు పేదరికంగానూ, ఉన్నవాల్లకు ఉన్నరకంగానూ మారుతుంటుంది.

అన్యాయం జరిగినా లొల్లి చేయరు..

గతకాలంలో యువతరంలో ఎక్కువ కోపగొండిగ కన్పిస్తరు. లొల్లిలు, పంచాయతీలు, ఉద్యమాలు, అన్యాయాలపై తిరుగుబాట్లు, విప్లవాలు, ప్రభుత్వానికి వ్యతిరేకం, ఎర్ర జెండాలు... ఇవన్నీ ఎనభయ్యవ దశకంలోని యువకుల్లో కన్పించేది. ఈ కాలంల అలా లేదు. చదువు ఉద్యోగ వేట లేదా పనులు, ఏదో ఒక చిరు వ్యాపారం చూసుకుంటున్నరు. ప్రభుత్వాలు వాటి నిర్వాకాలు తీరు తెన్నుల పట్ల అవగాహన చైతన్యం కూడా లేదు. పైగా రాజకీయాలు మన సబ్జెక్ట్ కాదు అనుకుంటున్నరు.

ఏ రాజకీయ పార్టీని చూసినా రకరకాల కుంభకోణాలు అవినీతి మరకలు. వారు గత పాలకులుగా ఉన్నప్పుడు చేసిన పాపాలు ఒకరి మీద మరొకరి ఆరోపణలు కన్పిస్తుంటాయి. ఇరుపక్షాలవి నిజమే అయ్యింటది. అబ్బో వాటి జోలికి ఎందుకులే అని యువతరం అటు వైపే ఆలోచించడం లేదు. సమాజ దుష్ఫలితాల పట్ల కూడా మనది కానీ సబ్జెక్ట్ అనుకుంటారు. స్వయంగా తమకే అన్యాయం జరిగినా కూడా ఎక్కువ స్పందించి లొల్లి లొల్లి చేయరు. మరొక రాజకీయ పైరవీదారున్నీ ఆశ్రయిస్తారు. ఇట్లా విద్యావంతులకు కోపం, అలజడి ఆందోళన కలగాల్సిన రీతిలో కలగడం లేదు. ఇందుకు ఆయా పాఠశాలల్లో, కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో విద్యార్థి సంఘం ఎన్నికలు జరగకపోవడం ఒక కారణం. పైగా సామాజిక కళలు, విజ్ఞాన శాస్త్ర చదువులుగా కాకుండా మేనేజ్ మెంట్, ఇంజనీరింగ్ విద్యల వైపు మల్లడం ఒక కారణం.

మస్తుకోపంతోని మాట్లాడుతరు..

ఎవరివీ తీర్చిదిద్దిన జీవితాలు కాకపోవచ్చు అయినా ఉద్యోగ ఉపాధి వేటలో లేదా రియల్ ఎస్టేట్ మధ్య దళారి వ్యాపారాల్లోకి వెళ్ళమన్నారు. ఈ గ్యాప్ వల్ల రాజకీయ పార్టీల్లోకి సంపన్నులు, వ్యాపారులు, పెట్టుబడిదారులు, పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలు వచ్చి చేరి ప్రజాప్రతినిధులుగా నిలబడి గెలుస్తున్నరు. తమకు అనుకూలంగా విధానాలు రూపొందించుకుంటున్నారు. పైగా ఈ వ్యాపార వర్గమే పత్రికలలో ఎలక్ట్రానిక్ మాధ్యమాల్లో చొరబడి గుత్తాధిపత్యం వహిస్తున్న కాలం. గ్లోబలైజేషన్ మొదలైనప్పటి నుంచి ఈ ధోరణి పెరిగి, ఇప్పుడు ప్రశ్నించే, కోపగించే తరమే లేకుండా అయ్యింది. అనవసర కోపాలు కొందరికి వస్తున్నయి.

కోపం అవసరమా కాదా అన్నది గాకుండా చిన్న చిన్న విషయాలను అర్థం చేసికోకపోవడం, అవతలి వ్యక్తి సరిగా అర్థం చేసికోక చెడ్డవాడని ఊపందుకోవడం, కొన్ని రంగాల్లో ఎక్కువ కన్పిస్తున్నది. ఇది ఎక్కువగా సంస్థల్లో, కుటుంబాల్లో, పార్టీల్లో, యంత్రాంగాల్లో ఎక్కువ కన్పిస్తున్నది. కోపాలు ఎక్కువ లేనివాల్ల మీద ఉన్నవాల్ల వీరంగం ఎక్కువ ఉండింది. కులాల పరంగానూ ఈ హెచ్చుతగ్గులను గమనించవచ్చు. కోపం అనేది కుటుంబాల్లోనైతే అధిపత్యం నుంచే వస్తది. అత్తకు కోడలు మీద, బాస్‌కు కింది ఉద్యోగం మీద గమనించవచ్చు. కోపాలు తాపాలు లేకుండా ప్రశాంతంగా ఆలోచిస్తే హాయిగానే జీవించవచ్చు. ఒక రాజకీయ పార్టీ నాయకుడు మరొక పార్టీ నాయకున్ని మస్తుకోపంతోని మాట్లాడుతరు కానీ ఎదురుంగ కలిస్తే అలయ్ బలయ్ తీసికుంటరు. నిజానికి కోపం రక్తపోటు ఉన్నవాల్లకు ఎక్కువగా ఉంటుంది. వాల్లు కాస్తా ఉప్పు తక్కువ వాడాలి. పొద్దున్న లేచి ధ్యానం అవలంబించాలి. ఎవరికైనా ఉండాల్సిన కోపం, ధిక్కారం, మర్లపడే తత్వం ఉండాల్సిందే గాని ఉన్నంతలో ఉండాల్సి ఉంది.

(క్రోది నామ నూతన సంవత్సరం సందర్భంలో ఉగాది శుభాకాంక్షలతో..)

అన్నవరం దేవేందర్

94407 63479

Advertisement

Next Story

Most Viewed