- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అంతరంగం: మనిషితనానికి ప్రతిరూపం
పరుల కోసం పాటు పడని నరుని బ్రతుకు దేనికని?' ఒక గజల్‌లో అని సినారె వేసిన ప్రశ్న ఇటీవల ఈ లోకం నుంచి దూరమైపోయిన సాహితీవేత్త, సామాజిక కార్యకర్త నిజాం వెంకటేశం జీవితం పరిశీలిస్తే గుర్తుకు వస్తది. నిజాం వెంకటేశం ఒక సామాన్యుడే. లెక్కలేనన్ని పుస్తకాలు రాసిన రచయిత కాదు. కానీ, ఆయన అన్ని సాహితీ సర్కిల్స్‌లో ఆత్మీయ పరిచయస్తుడు. ముఖ్యంగా వెంకటేశం సారు పుస్తకాల పురుగు. వందల, వేల తెలుగు ఇంగ్లిష్ బుక్స్ చదివినవాడు. పుస్తకాలు చాలా మంది చదువుతారు కదా, అనుకోవచ్చు. ఆయన వేల కొలది పుస్తకాలను కొని చదువరులచే చదివించారు.
ఆయన పుస్తకాల వితరణశీలి. కొనడం, చదవడం, ఇతరులచే చదివించడం, అందులోని సారాంశాన్ని గల గలా చెప్పడం ఆయనకు ఇష్టం. కవులు, రచయితల పుస్తకాలు కాంప్లిమెంటరీ కాపీలుగా ఉచితంగా ఎవరి దగ్గర తీసుకోరు. ఓ పది ఇరవై నగదు పెట్టి కొని అదే సభలో పంచుతారు లేదా చదువాల్సిన వారికి పోస్ట్‌లోనైనా పంపుతారు. ఇదంతా ఆయన గత నలభై యేండ్లుగా చేస్తున్న పని. పుస్తకాలు కొని పంచడమే కాదు పుస్తక ప్రచురణకు కూడా ఆర్థిక సహాయం చేస్తారు. ఏది చేసినా ఇంకొకరు చెప్పితేనే తెలుస్తుంది తప్ప 'నేను ఈ సహాయం చేసిన, నేను ఆ సహాయం చేసిన' అన్న మాటలు ఉండవు. ఇంగ్లిష్ భాష కొట్టిన పిండి. అనువాదం చేస్తారు. ఎంతోమంది కవిత్వాన్ని ఇంగ్లిష్‌లోకి ట్రాన్స్‌లేట్ చేశారు.
తరాలకు ప్రతినిధి
నిజాం వెంకటేశం అంటే తెలంగాణ నేల మీద సాహిత్యంతో సంబంధం ఉన్న పాత తరం అందరికీ తెలుసు. సిరిసిల్ల జన్మస్థలం. జగిత్యాల, మెట్‌పల్లి, కరీంనగర్‌లో ఉద్యోగ రీత్యా నివసించారు. ఎక్కడ ఉంటే అక్కడ ఒక సామాజిక సాహిత్య వాతావరణం ఏర్పాటు చేసుకుంటారు. విద్యుత్ శాఖలో ఎడీఈగా ఉద్యోగ విరమణ చేసి గత రెండు దశాబ్దాలుగా హైదరాబాద్ లో ఉంటున్నారు. 75 యేళ్ల వెంకటేశం సారుకు తనకన్నా 18 రోజుల ముందే తల్లి 92 యేళ్ళ సత్యమ్మ కాలం చేశారు. తల్లిని కోల్పోయిన దుఃఖంలో మానసిక వ్యథ పెట్టుకున్నారు. దాంతోనే మనందరినీ విడిచి వెళ్లారని అంటున్నారు. నిజానికి వెంకటేశం సారుకు ఇటీవల అన్ని పరీక్షలు చేయిస్తే ఏ జబ్బూ లేదని, ఏ ఇబ్బందీ రాదని తేలింది.
తల్లి దూరం అయిన తర్వాత మానసిక వ్యథతో నిద్రలేని రాత్రులు గడపడం వల్ల గుండె అలసిపోయిందని తెలుస్తోంది. అమరుడు అలిశెట్టి ప్రభాకర్ మరణం తర్వాత చాలా రోజులకు 2013లో ఆయన కవిత్వం పుస్తకంగా వెలువరించడంలో వెంకటేశం ప్రధానం. 1980 దశకంలో 'కరీంనగర్ బుక్ ట్రస్ట్' స్థాపించి అల్లం రాజయ్య 'భూమి కథలు' బీఎస్ రాములు 'బతుకుపోరు' నవలను వెలువరించారు. సుభాష్ పాలేకర్ సేంద్రియ వ్యవసాయం మీద రాసిన పుస్తకాలను తెలుగులోకి అనువదించి ప్రచురించి విపరీతంగా పంచిపెట్టారు. ఎందరికో అజ్ఞాతంగా సహాయం చేశారు. సహాయం చేయడం ఆయన నిత్యం చేస్తున్న పని. హైదరాబాద్ లో ఎక్కడ సమావేశం అయినా కారులో వెళ్లి అటెండ్ అయి పుస్తకాలు కొని పంచి, స్నేహితులు అతిథులు వస్తే వారితో కలిసి భోజనం చేసేవారు.
అనితర స్నేహశీలి
వెంకటేశం సారు ఎవరి ఇంటికి వెళ్లినా ఆ ఇంటి కుటుంబం అంతటితో పరిచయం అయిపోవాల్సిందే. పిల్లల నుంచి పెద్దల వరకు కుటుంబ సభ్యులందరి పేర్లతో స్నేహం కొనసాగిస్తారు. అందరితో కలివిడిగా మాట్లాడే చొరవ స్నేహవాత్సల్యం. స్నేహితులకు సంబంధించిన అన్ని ఫంక్షన్‌లకు మిస్ కాకుండా అటెండ్ అయ్యేవారు. సిరిసిల్లలో 'దిక్సూచి' అనే పత్రికను స్థాపించి పన్నెండు సంచికలు వెలువరించారు. ఆయన రాయదలచకుంటే ఎంత రాస్తాడో కానీ రాయించడమే ఎక్కువ. అలిశెట్టి ప్రభాకర్ ఈ తరానికి తెల్సిందంటే కేవలం వెంకటేశం చొరవతోనే. ఈ పనిలో తన స్నేహితులు ఎందరో ఉండవచ్చు. అభ్యుదయ ప్రగతిశీల భావాలు రాజకీయాలు ఎక్కువగా ఇష్టపడేవారు.
అందరిలోనూ స్నేహం చేయడం తనకు ఇష్టమైన వ్యాపకం. నిరంతరం సాహిత్యం, స్నేహం, పుస్తకాలు పరోపకారం, ప్రేమగుణం, సమావేశాలు, ప్రసంగాలు, ప్రయోగాలు, సంఘాలు, సమాజం, ఆరోగ్యం, యోగాసనాలు, నడకలు, నవ్వులు వెంకటేశం సారు నిత్యజీవన కృత్యాలు. ఈ రోజులలో 'ఇలాంటి మనిషి ఇగో ఉన్నాడు' అని చెప్పేందుకు తార్కాణం. తనతో స్నేహం చేయడం గొప్ప అవకాశం. ఆయన బడిలో క్లాస్‌మేట్స్ నుంచి ఉద్యోగ జీవితంలో కొలీగ్స్ వరకు అందరూ కొనసాగుతున్న సోపతిగాల్లే. ఇందరి స్నేహితుల సంపదను మధ్యలోనే వదిలి వెళ్లిన నిజాం సారుకు జోహార్లు.
అన్నవరం దేవేందర్
94407 63479