అంతరంగం: అర్థం పర్థం వదిలిన నామం

by Ravi |   ( Updated:2022-09-11 19:30:22.0  )
అంతరంగం: అర్థం పర్థం వదిలిన నామం
X

పూర్వకాలంలో అందరి పేర్ల చివర 'య్య' అని ఉండేది. మల్లయ్య, రామయ్య, లచ్చయ్య, కొంరయ్య, ఎల్లయ్య ఇట్లా చివరన అయ్య అని గౌరవంగా పిలిచినట్లు అనిపించేది. మళ్ల ఈ పేర్లు కులాన్ని బట్టి గౌరవం పొందేవి. అవే పేర్లు కొన్ని కులాలకు లచ్చిగాడు, ఎల్లిగాడు, మల్లిగాడు ఇట్లా మరికొన్ని కులాలకైతే లచ్చయ్య దొర, ఎల్లయ్య పటేల్ ఇట్లాగే కొనసాగిన కాలం. కొంతకాలం తర్వాత ప్రవీణ్, రాకేశ్, రాహుల్, శ్రావణ్ ఇలా ట్రెండ్ నడిచింది. ఇగ శ్రీనివాసు అనే పేరైతే 1970వ దశకంలో పుట్టిన చాలామందికి ఉంటుంది. ఉద్యోగాల ఎంపిక జాబితాలోనో, చాలా మంది పని చేస్తున్న సంస్థలోనో చూస్తే శ్రీనివాస్‌లు చాలామంది ఉంటారు. అదీ గాకుండా, ప్రాంతాన్ని బట్టి, ఆ ప్రాంతపు దేవుళ్లను బట్టి కూడా పేర్లు ఉంటాయి.

పిల్లల పేర్ల ట్రెండ్ ఐదు పది సంవత్సరాలకోసారి మారిపోతోంది. మార్పులు అనివార్యమే. కొన్ని అర్థవంతంగా ఉంటాయి, మరికొన్ని ఏ అర్థం లేకుండా ఉంటాయి. ఇటీవల ఒక పాపను 'నీ పేరు ఏంటని' అడిగితే 'సిమ్రిద్ధి' అని చెప్పింది. 'సమృద్ది'గా ఉండాల్సింది 'సిమ్రిద్ది'గా మారిందని అనిపించింది. అట్లాగే అర్చలకు అర్థం సంగతేమోగానీ, అర్చన అంటే తెలుసు. మరొక పేరు 'నిర్దయ' నిర్దయ అంటే దయలేని వాడు. ఎవరైనా దయలేకుండా పిల్లలు ఉండాలనుకుంటారా! కానీ, అట్లా పెట్టేసారు.

ఒక అమ్మాయి పేరు 'నిశి' అంటే రాత్రి. రుషి అని పేరు వాడాల్సిన చోట రిషి అని చెలామణి అవుతున్నది. అసలు ఈ పేర్లు పెట్టడం కొరకు ఇంటర్నెట్‌లో వెదికి, కొన్ని అక్షరాలు వాళ్లనుకున్నవి కలుపుకొని అర్థ వివరణ చూడకుండా పెట్టుకుంటున్నారు. ఇంగ్లిష్ ఉచ్చారణ వేరు. అక్షరాలు ఉంటే అవే తెలుగులో వాడుతున్నారు. సరే, ఏ పేరు అయితే ఏమిటి? పిలుస్తున్నం, పలుకుతున్నరు. ఆధార్ కార్డ్‌లోనూ ఎక్కుతుంది అనే వాదన వేరు. కానీ, కొంచెమన్న అర్ధం పర్ధం పరమార్థం ఉంటే బాగుంటుంది.

ఆనాడు అత్యంత గౌరవం

పూర్వకాలంలో అందరి పేర్ల చివర 'య్య' అని ఉండేది. మల్లయ్య, రామయ్య, లచ్చయ్య, కొంరయ్య, ఎల్లయ్య ఇట్లా చివరన అయ్య అని గౌరవంగా పిలిచినట్లు అనిపించేది. మళ్ల ఈ పేర్లు కులాన్ని బట్టి గౌరవం పొందేవి. అవే పేర్లు కొన్ని కులాలకు లచ్చిగాడు, ఎల్లిగాడు, మల్లిగాడు ఇట్లా మరికొన్ని కులాలకైతే లచ్చయ్య దొర, ఎల్లయ్య పటేల్ ఇట్లాగే కొనసాగిన కాలం. కొంతకాలం తర్వాత ప్రవీణ్, రాకేశ్, రాహుల్, శ్రావణ్ ఇలా ట్రెండ్ నడిచింది. ఇగ శ్రీనివాసు అనే పేరైతే 1970వ దశకంలో పుట్టిన చాలామందికి ఉంటుంది. ఉద్యోగాల ఎంపిక జాబితాలోనో, చాలా మంది పని చేస్తున్న సంస్థలోనో చూస్తే శ్రీనివాస్‌లు చాలామంది ఉంటారు. అదీ గాకుండా, ప్రాంతాన్ని బట్టి, ఆ ప్రాంతపు దేవుళ్లను బట్టి కూడా పేర్లు ఉంటాయి.

వేములవాడ ప్రభావంతో అక్కడివాళ్లందరు రాజేశ్వర్, రాజేశ్వరి, రాజయ్య, రాజిరెడ్డి, రాజారావు అని పెట్టుకుంటారు. కొమురవెల్లి ప్రభావంతో కొమురయ్య, కొమరవ్వ, కొమురారెడ్డి. ధర్మపురి ప్రభావంతో నరసింహస్వామి, నర్సయ్య, నర్సన్న, నర్సవ్వ, ఉంటాయి. అయిలోని మల్లికార్జునుడి ప్రభావంతో అయిలయ్య, అయిలవ్వ ఉంటాయి. పుణ్యక్షేత్రాలు వెలిసిన ఊర్ల పేర్లను కూడా పెట్టుకుంటారు తిరుపతి, యాదగిరి, కొమురెల్లి, కొండగట్టు పేర్లు చాలా కన్పిస్తాయి. కొందరి పేర్లు సులువుగా జ్ఞాపకం ఉంటాయి. కొందరివి కొత్తదనంలో ఉంటాయి. పేర్ల చివరలు చూస్తే ఏ సామాజికవర్గమో తెలుస్తుంది. రావు, రెడ్డి, శర్మ, నాయుడు, రాజు ఇలా. సామాజిక, అస్తిత్వ ఉద్యమాల ప్రభావం తర్వాత తమ పేర్ల చివరన ఉండాలనే గౌరవం అందరిలోనూ వచ్చింది. గౌడ్, ప్రజాపతి, చారి, మాదిగ, స్వామి, ఇట్లా తమ మూలాలను ఎరుక పరచుకుంటున్నారు. ఈ రోజులలో ఎవరి కులవృత్తులు వాళ్లు చేయడం లేదు. అందరూ ఇతర వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉండి అభివృద్ధి పథంలోనే తమ కుటుంబాలను నడిపిస్తున్నారు. తమ మూలాలు అలంకార ప్రాయంగానే కొనసాగిస్తున్నారు.

ఊరి పేర్లతోనూ

కొందరికి స్ఫూర్తిదాతల పేర్లు కన్పిస్తాయి. గాంధీ, ఝాన్సీ, లక్ష్మీబాయి, ప్రతాప్, శివాజీ. మరికొందరికి తాము ఆరాధించే దేవుళ్ల పేర్లు వెంకటేశ్వర్లు, రామయ్య, ఆంజనేయులు, సమ్మక్క, సమ్మయ్య ఇట్లా కన్పిస్తాయి. కొన్ని ఊర్ల పేర్లు కూడా సౌందర్యంగా ఉంటాయి వీణవంక, చిగురుమామిడి, చందుర్తి, రాగినేడు, ఒంటిమామిడి. సుందరగిరి లాంటివి. వీటిలో ఎక్కడో కళాత్మకత దాగే ఉన్నట్టు కన్పిస్తది. మరికొన్ని ఊర్ల పేర్ల చివర పల్లి అని ఉంటది. మాలపల్లి, గుడాటిపల్లి, మల్లంపల్లి. కొన్ని ఊర్లకు బాద్‌లు చివర ఉంటాయి. ఆబాద్ అంటే జనావాసం అని అర్ధం. హుస్నాబాద్, హైదరాబాద్, నిజామాబాద్, మహబూబాబాద్ ఇట్లా ఉంటాయి. ఊర్ల పేర్లతో మరోసారి రాసుకోవచ్చు.

మనుషుల పేర్లు పూర్వంలో కొన్ని గమ్మతుగా ఉండేవి. పెంటయ్య, ఇస్తారి అని కూడా ఉండేవి. పుట్టినవాళ్లు అందరూ చనిపోతుంటే ఆ కాలంలో వీని పేరు 'పెంటయ్య' అందాం. బతుకుతాడేమో అనుకొని అట్లా పేరు పెట్టారట. ఇస్తారి అంటే అన్నం తినే విస్తరాకు మంచిగానే ఉంది. కొందరు మరపురాని సంఘటనలను కూడా పేర్లుగా పెట్టు కున్నారు. 1978లో స్కైలాబ్ పడుతుందనే పుకారు వచ్చినపుడు పుట్టిన కొందరికి 'స్కైలాబ్' అని పేరు పెట్టారు. ఒకాయన ఎలక్షన్ రోజు పుట్టాడని 'ఎలక్షన్ రెడ్డి' అని పేరు పెట్టారు. ఆ కాలంలో అర్థవంతమైన పేర్లు ఉండేవి, ఈ కాలంలో అక్షరాలు కలిసే కూర్పే కనబడుతున్నది.

Also Read : సమీక్ష: సిద్ధాంతం మీద నిలిచిన కవిత్వం


అన్నవరం దేవేందర్

94407 63479

Advertisement

Next Story

Most Viewed