తోటి కవుల కవిత్వంపై 'కవి శతారం'

by Ravi |   ( Updated:2022-07-03 19:01:04.0  )
తోటి కవుల కవిత్వంపై కవి శతారం
X

గోపగాని రవీందర్ కొత్తగా పరిచయం అక్కరలేని కవి, రచయిత. ఇరవై ఏళ్లకు పైగా రచనలు చేస్తున్నాడు. చాలా మంది ఇలాగే రచనలు చేస్తారు. 'గోపగాని' మాత్రం ఇతర కవుల కవిత్వాన్ని విమర్శనాత్మకంగా పరామర్శిస్తారు. ఉప్పొంగే భావాలను కవిత్వం చేయడం, అందులోనూ సామాజిక అంశాలు మానవ సంబంధాలు చేర్చడం నడుస్తున్నదే. దీంతో కవికి పేరు ప్రఖ్యాతులు వస్తుంటాయి. ఎవరి కవిత్వం వాళ్లు రాసుకొని అచ్చువేసుకొని మురిసిపోయే కాలం ఇది. గోపగాని రవీందర్ మాత్రం తన తోటి కవుల కవిత్వాన్ని ఇష్టంగా చదివి ఒక వ్యాసం రాయడం గొప్ప విషయమే.

తెలుగు సాహిత్యంలో ఇది నడుస్తున్నదే కదా అని అనుకోవడానికి వీలు లేదు. ప్రత్యేకంగా కవిత్వ విమర్శలు ఉంటాయి. వాళ్ల పని కవిత్వాన్ని తూనిక రాళ్లతో, సున్నితపు త్రాసులో పెట్టి జోకడం. స‌ృజన వేరు, విమర్శ వేరు. కొందరు స‌ృజన నుంచి మొదలై విమర్శకుడిగా నిలబడిపోతారు. విమర్శకుడు అంటే జడ్జి లాంటి జాబ్. విమర్శకు కొన్ని పద్ధతులు ఉంటాయి. మరికొందరు కవిత్వం రాస్తారు, కథలు రాస్తారు, చరిత్రలు రాస్తారు. ముందు మాటలు రాస్తారు. విమర్శలు రాస్తారు. వీళ్లు బహుముఖ ప్రజ్ఞాశీలురు.

అన్ని వాదాలకు వేదికగా

గోపగాని రవీందర్ 2001లో కవిత్వ ఆవరణలోకి మెదలై అంకురం, చిగురు, చెరగని సంతకం దూరమంతైనా అనే కవితా సంపుటాలను వెలువరించారు. గొప్ప అభివ్యక్తితో, సామాజిక చింతనతో ఆయన కవిత్వం ఉంటది. విమర్శలో ఇది వరకే 'కథాంతరంగం' వెలువరించారు. సుద్దాల అశోక్‌తేజ 'నేలమ్మ నేలమ్మ' గేయ రూప కవిత్వం మీద ఎంఫిల్ పరిశోధన పుస్తకం వెలువరించారు. నిరంతరం చలన శీలనమైన కవి. తన రచన అచ్చుకాని వారం కూడా దాదాపు ఏదీ ఉండదు. నిరంతరం కవిత్వం రాయడమంటే ఎల్లవేళలా కవిత్వమై తనకు తాను ఆలోచించడం పరిశీలించడమే.

రవీందర్ ఎక్కడ ఉంటే, అక్కడ ఒక సాహిత్య వాతావరణం నెలకొంటది. అది తిమ్మాపురం అయినా, ఆదిలాబాద్ అయినా, హన్మకొండ అయినా, ఉట్నూర్ అయినా, ఇప్పుడు లక్షెట్టిపేట అయినా ఇలా సాహిత్యంపై జీవించడం గొప్ప విషయమే. నిజానికి నిక్కచ్చిగా విమర్శ రాస్తే చాలామందికి కోపాలు తాపాలు వస్తాయి. ఇష్టాలు అయిష్టాలు పక్కన పెట్టి ఇటీవల తాను 'శతారం'అనే కవిత్వ విమర్శనల వ్యాసాల సంకలనం వెలువరించారు. శతారం అంటే 'వజ్రాయుధం' అక్షరాలకు కూడా ఆయుధం ఉన్నంత శక్తి ఉన్నదనే భావనలో ఈ పేరు బాగా కుదిరింది. ఈ పుస్తకంలో 75 వ్యాసాలు ఉన్నాయి. ఇది తెలుగు సాహిత్యంలో అన్ని వాదాలకూ వేదిక అయ్యింది. అభ్యుదయ విప్లవ అస్తిత్వ సాహిత్యం పట్ల విమర్శ ఉన్నది. తెలుగు సాహిత్యం గమనాన్ని ఇది చదివితే తెలుసుకోవచ్చు. ఇందులో ప్రఖ్యాత కవుల ఒక్కో కవితను పట్టి విశ్లేషణ ఉన్నది.

విమర్శ వ్యాసాలు రాస్తూ

శ్రీశ్రీ, తిలక్, అజంతా, కాళోజీ, సినారె, శివసాగర్, శివారెడ్డి, వరవరరావు, గూడ అంజయ్య, గోరటి వెంకన్న, ఎన్ గోపి కవిత్వాల మీద విశ్లేషణ 'ఒక ఉపాధ్యాయుడు సాహిత్య విద్యార్థులకు బోధించినట్లు' ఉన్నది. ఇంక నందిని సిధారెడ్డి, దామెర రాములు, సీతారాం, ఉదారి నారాయణ చెయన్, అన్నవరం దేవేందర్ రాసిన కవిత్వ సంపుటాలపై విమర్శనా వ్యాసాలలో వాళ్ల కవిత్వ ప్రయాణం మొత్తం చిత్రించారు. ఈ సంపుటిలోని 30 వ్యాసాలు ఆదిలాబాద్ ఆకాశవాణి 'సాహిత్య ప్రసంగాలు'గా వచ్చాయి. ఆదిలాబాద్ ఎఫ్‌ఎం లో చాలా రోజులుగా మంచి సాహిత్య కార్యక్రమాలు వస్తున్నాయి. అందులో గోపగాని రవీందర్ తో పాటు ఉదారి నారాయణ ప్రసంగాలు కూడా వచ్చాయి.

గత పదేళ్లుగా వచ్చిన పలు కవితా సంకలనాలు జగర్, ప్రవహించే పాట, పదునెక్కే పాట, అదే నేల రంజని వారి ఆకాంక్ష లాంటి గొప్ప పుస్తకాల మీద వ్యాసాలు ఉన్నాయి. ఇట్లాగే తెలుగు సాహిత్యంలో మరికొంత మంది కవిత్వం రాస్తూ విమర్శన వ్యాసాలు రాస్తున్నారు. నిజానికి ఇటీవల సాహిత్య విమర్శ సరైన రీతిలో లేదనే వాఖ్యా ఉన్నది. ఇటు కవిత్వం, అటు విమర్శతో నిరంతరం అక్షరాలను ఆయుధం చేస్తున్న గోపగాని రవీందర్ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. శతారం పుస్తకాన్ని వర్ధమాన కవులు రచయితలు కొనుక్కొని చదవాల్సిన అవసరం ఉన్నది.

అన్నవరం దేవేందర్

94407 63479

Advertisement

Next Story

Most Viewed