అంతరంగం:ఇది అనంత కాల 'గమనం'

by Ravi |
అంతరంగం:ఇది అనంత కాల గమనం
X

క్కడి చరిత్రను అక్కడికక్కడే నమోదు చేయకుంటే గతంలో జరిగిన ఉద్యమాలు, త్యాగాలు, రాజకీయాలు కాలంలో కల్సిపోతాయి. చరిత్ర గతం నుంచి వర్తమానం వంతెన మీదుగా భవిష్యత్‌కు ప్రయాణం చేస్తది. జాతీయ, రాష్ట్రాలస్థాయిలో చరిత్ర రచనకు కొన్ని ఏర్పాట్లు ఉంటాయి. చరిత్రకారులు ఉంటారు. కానీ, గ్రామీణ ప్రాంతాలలో స్థానికంగా జరిగిన చరిత్రకు స్థానికుల పూచికతోనే అక్కడి సామాజిక రాజకీయ ఉద్యమాలు నమోదు అవుతాయి. అట్లాంటి అద్భుత హుజురాబాద్ చరిత్రను ప్రఖ్యాత జర్నలిస్టు, రచయిత ఆవునూరి సమ్మయ్య తన 'గమనం' పుస్తకంలో నమోదు చేశారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌కు చెందిన చరిత్రనేగాకుండా, ఆ ప్రాంత రాజకీయ, ఉద్యమకారుల పరిచయం ఇందులో ఉంది. సమ్మయ్య రచయిత, పాత్రికేయుడే గాకుండా స్వయంగా ఉద్యమ జీవి. 1969 తొలి దశ తెలంగాణ ఉద్యమంలోనూ, 1998 మలిదశ ఉద్యమంలోనూ ప్రత్యక్షంగా పాల్గొన్న ఉద్యమకారుడు. ప్రగతిశీల, సామాజిక ఉద్యమాలతో సంఘీభావం కలవాడు.

తాను 'గవాయి' పేరుతో హుజూరాబాద్ ఉద్యమాల చరిత్రను అక్షరీకరించాడు. అందులోనూ పోరాటాల నేపథ్యం, స్వభావం, ఆయా ఊర్ల నుంచి అజ్ఞాతంలో ఉన్నవారి వివరాలు ఉన్నయి. 'గమనం'లో ఎక్కువగా లెజండరీ స్థాయి హుజురాబాద్‌కు సంబంధం గల వ్యక్తుల పూర్తి వివరాలతో రాసిన వ్యాసాలు ఉన్నాయి. విప్లవ కవి వరవరరావును 'అక్షరాలకు కమిటైన కవి' అని కొత్త విషయాలతో రాసిన వ్యాసం ఉన్నది. వినియోగదారుల సంఘం, లోక్‌సత్తా ప్రజాస్వామిక ఉద్యమకారుడు నరెడ్ల శ్రీనివాస్ స్మృతిలో ఒక వ్యాసం ఉంది. తనకు గురువు, ప్రఖ్యాత కవి, రచయిత అమ్మంగి వేణుగోపాల్ గురించి, హుజురాబాద్ దగ్గరలోని వంగర నుంచి ప్రధానిగా ఎదిగిన పీవీ నరసంహారావు గురించిన వ్యాసాలున్నయి. కమలాపుర్ నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన జర్నలిస్ట్ ఎస్. వెంకటనారాయణ, హుజురాబాద్ నుంచి అంతర్జాతీయస్థాయి సైంటిస్ట్‌గా ఎదిగి సీసీఎంబీ డైరెక్టర్‌గా పనిచేసిన మోహన్‌రావు పరిచయం ఉంది. తెలంగాణలో తొలి ద్రోణాచార్య ఆవార్డు గ్రహీత, అథ్లెట్, కోచ్ నాగపూరి రమేశ్, విప్లవకారులు ఒగ్గె చంద్రమౌళి, డాక్టర్ కొట్లూరి చిరంజీవి సమగ్ర వివరాలు ఉన్నాయి.

అనేక ప్రముఖుల గురించి

ముల్కనూర్ సహకార గ్రామీణ బ్యాంక్ వ్యవస్థాపకులలో ఒకరైన సోషలిస్ట్, స్వాతంత్ర్య సమరమోధుడు పడాల చంద్రయ్య , మాజీ శాసన సభ్యడు కేతిరి సాయిరెడ్డి, ప్రఖ్యాత కవి దేవీప్రియ గురించి వ్యాసాలు ఉన్నయి. హుజురాబాద్ పట్టణానికి చెంది పలు రంగాలలో ప్రభావశీలంగా ఉన్న చొల్లేటి శ్రీశైలం, కాట్రపల్లి సుగుణాకర్ రావు, పహిల్వాన్ వెంకన్న గురించి వ్యాసాలున్నాయి. తెలంగాణ తొలిదశ ఉద్యమ స్వర్ణోత్సవం (1969-2019), ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో హుజురాబాద్‌లో ఎవరెవరు పాల్గొన్నారో పేర్లు, తేదీలవారీగా సమాచారముంది.

తాడిగిరి పోతరాజు రాసిన త్యాగశీలి నాటిక, 22 మార్చి 1970 ప్రదర్శన వివరాలు రికార్డ్ చేశారు. 23 ఆగస్టు 1998న తెలంగాణ జనసభ సమావేశం ఉద్యమానికి ఎలా ఊపిరులూదిందో వివరించారు. జయశంకర్ సార్, కోదండరాం సార్ రగిలించిన స్ఫూర్తి సమగ్ర వ్యాసం ఉన్నది. 4 జూన్ 2006 తెలంగాణ విద్యావంతుల వేదిక హుజురాబాద్ సదస్సు వివరాలు ఉన్నాయి. 1975 మే 11 న హుజురాబాద్ కు శ్రీశ్రీ వచ్చిన సందర్భంగా ర్యాలీ, బహిరంగ సభ వివరాలు, హుజురాబాద్‌లో 1970 నుంచి నడుస్తున్న జనసాహితీ సంస్థ గురించి రాసిన వ్యాసం కూడా ఉన్నది. హుజురాబాద్‌కు చైతన్యం వారసత్వంగా వస్తున్న విషయం ప్రత్యేకంగా ఉన్నది.

విషాదాన్ని అధిగమించి

కరోనా కాలంలో ఆవునూరి సమ్మయ్యగారి సతీమణి సుజాత మరణం ఒక విషాదం. ఆ బాధాతప్త హృదయంలో రాసిన వ్యాసం ఆ కుటుంబ చరిత్రను పట్టిస్తది. 'గమనం'లో సమ్మయ్యగారి వ్యాసాలే గాకుండా సమ్మయ్యను గూర్చి పూర్తిగా తెలిపే వ్యాసాలు ఉన్నయి. 'ఎదులాపురం ఎదలో తెలంగాణం' అన్న వరవరరావు వ్యాసంలో చాలా విషయాలున్నాయి. 'ఆవునూరితో దోస్తీ యాభై ఏండ్లు' అని నరెడ్ల శ్రీనివాస్ రాసిన వ్యాసానికి చోటు కల్పించడం బాగుంది.

సీనియర్ జర్నలిస్ట్ మహమ్మద్ ఫజుల్ రహమాన్ 'మాటా మంతి' పేరుతో సోషల్ మీడియా‌లో ఆవునూరి సమ్మయ్యతో చేసిన ఇంటర్వ్యూలోనూ చాలా విషయాలు ఉన్నయి. 'గమనం' పుస్తకానికి హుజురాబాద్‌కు చెందిన ముక్కెర రాజు, పల్కల ఈశ్వర్‌రెడ్డి, రవిశంకర్ శుక్లా సంపాదకత్వం వహించారు. 'జనసాహితి' ప్రచురించిన ఈ పుస్తకం అన్ని ప్రాంతాలవారు చదవాలి. ఆయా ప్రాంతాల చరిత్ర ఎలా నమోదు చేయాలో తెలుస్తుంది. పుస్తకాన్ని ఫోన్ పే ద్వారా 9849188633కు వంద రూపాయలు పంపి తెప్పించుకోవచ్చు.

అన్నవరం దేవేందర్

94407 63479

Advertisement

Next Story