సాహితీవేత్త రంగనాధాచార్యులు కన్నుమూత..

by Shyam |
సాహితీవేత్త రంగనాధాచార్యులు కన్నుమూత..
X

దిశ, తెలంగాణ బ్యూరో : సాహిత్య విమర్శకులు, సాహిత్య చరిత్రకారులు, అధ్యాపకులు, పరిశోధకులు, విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపకుల్లో ఒకరైన కేకే రంగనాథాచార్యులు శనివారం నగరంలో కన్నుమూశారు. తెలుగు సమాజ సాహిత్య సంబంధాలు, వాటిపై జరిగే చర్చల్లో ఉత్సాహంగా పాల్గొనడమే కాకుండా విశ్లేషణాత్మకంగా వివరించడంలో ఆయన దిట్ట. తెలుగు సాహిత్య విమర్శకు పెద్ద లోటు అని పలువురు రచయితలు అభిప్రాయపడ్డారు. సాహిత్య విమర్శకు మాత్రమే కాక సాహిత్య చరిత్ర రచనకు, సాహిత్య ఉద్యమాలకు ఎన్నో కానుకలు అందించారని ఆయన కృషిని గుర్తుచేసుకున్నారు. జ్వాలాముఖి, నిఖిలేశ్వర్‌లకు సన్నిహితంగా ఉండే మిత్రుడిగా, దిగంబర కవుల సంచలనానికి వెన్నుదన్నుగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది.

విప్లవ సాహిత్యోద్యమం 1960వ దశకం చివరి రోజుల్లో పురుటి నొప్పుల్లో అప్పటి విప్లవోద్యమ నాయకులతో సన్నిహితంగా ఉన్న కేకేఆర్ ‘విరసం’ ఏర్పాటులో తన వంతు కృషిచేశారు. 1970 జూలై 4 అర్ధరాత్రి 1.10 గంటలకు ‘విరసం ఆవిర్భావ ప్రకటన’ మీద సంతకం చేసిన పద్నాలుగు మందిలో ‘రంగనాథం’ పేరుతో చేసిన సంతకం కేకేఆర్‌దేనని వీక్షణం సంపాదకులు వేణుగోపాల్ గుర్తుచేశారు. ఆ తర్వాతి కాలంలో ‘విరసం’ సభ్యుడుగా కొనసాగక పోయినప్పటికీ మిత్రుడిగా, సహచరుడుగా, హితవరిగా కొనసాగారని పేర్కొన్నారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రాచ్య కళాశాల అధ్యాపకుడిగా, ఆ తర్వాత హైదారాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ అధ్యాపకుడిగా ఆయన వందలాది మంది విద్యార్థులకు ప్రేరణగా నిలిచారని గుర్తుచేసుకున్నారు.

వరవరరావు తెలుగులో విప్లవ మౌఖిక సాహిత్య ధోరణుల మీద చేయదలచిన పోస్ట్ డాక్టోరల్ పరిశోధనకు కేకేఆర్ పర్యవేక్షకుడిగా వ్యవహరించారు. ‘తెలుగు సాహిత్యం – చారిత్రక భూమిక‘ వంటి మౌలిక ఆలోచనల, అన్వేషణల సాహిత్య విమర్శ గ్రంథాలకు కేకేఆర్ రచయిత.

మంత్రి హరీశ్‌రావు సంతాపం..

తెలుగు సాహిత్యాభివృద్ధికి ఎంతగానో కృషిచేసిన ప్రముఖ భాషా సాహితీవేత్త ఆచార్య కేకే రంగనాథాచార్యుల మృతి పట్ల మంత్రి హరీశ్‌రావు సంతాపం వ్యక్తంచేశారు. తెలుగు భాషా పండితులుగా పలు ఉన్నత పదవులను నిర్వహించిన ఆచార్యులు, తెలుగు సాహిత్య వికాసానికి చేసిన సేవలను మరువలేనివన్నారు. హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో భాషాసాహిత్యాలు బోధించారని, ఆధునిక తెలుగు సాహిత్యంలో విభిన్నధోరణులు లాంటి ఎన్నో రచనలు రాశారని ఆయన సేవలను కొనియాడారు.

Advertisement

Next Story