Women Health: ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలా..? ఈ 4 విషయాలపై ఫోకస్ చేయాలంటున్న నిపుణులు

by Javid Pasha |
Women Health: ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలా..? ఈ 4 విషయాలపై ఫోకస్ చేయాలంటున్న నిపుణులు
X

దిశ, ఫీచర్స్: ఎప్పుడూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలనే ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ అనుకోకుండా శారీరక, మానసిక ఇబ్బందులు సంభవిస్తుంటాయి. అయితే వీటికి చాలా వరకు ఎవరికి వారే కారణం అవుతుంటారని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా జీవన శైలిలో ప్రతికూల మార్పులు, పోషకాహార లోపాలు, క్షణం తీరికలేని పని పరిస్థితులు, నిరంతర ఆందోళనలు, సమయానికి తినకపోవడం, ఫిజికల్ యాక్టివిటీస్‌కు దూరంగా ఉండటం వంటివి ఇందులో భాగంగా ఉంటున్నాయి. ఇవి సహజంగానే ఆరోగ్యాన్ని, ఆనందాన్ని దూరం చేస్తుంటాయి. కాగా ప్రస్తుతం ఈ సమస్యలను ఎదుర్కొంటున్నవారిలో ఎక్కువ మంది గృహిణులే ఉంటున్నారని నిపుణులు చెప్తున్నారు.

జీవితంలో సంతోషంగా ఉండాలంటే కొన్ని సమస్యలను దూరం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు నాలుగు విషయాలపై దృష్టి పెట్టాలని చెప్తున్నారు. అలాంటి వాటిలో ఫిజికల్ యాక్టివిటీస్, క్వాలిటీ స్లీప్, మెడికల్ టెస్టులు, సరైన పోషకాహారం వంటివి ఉన్నాయి. వీటిని రెగ్యులర్‌గా అమలు చేస్తే అనేక వ్యాధులను నివారించవచ్చునని, శరీరంలో వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం కాకుండా అడ్డుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే మానసిక వికాసానికి, ఫిజికల్ ఫిట్‌నెస్‌కు కూడా ఇవి చాలా ముఖ్యం.

* ఫిజికల్ యాక్టివిటీస్ : ఇంటి పనుల్లో, కుటుంబ బాధ్యతల్లో నిమగ్నమవుతూ ఇప్పటికీ మహిళలు తమను తాము నిర్లక్ష్యం చేసుకుంటున్నవారు చాలా మందే ఉంటున్నారు. సమయానికి తినకపోవడంతోపాటు శారీరక వ్యాయామాలకు దూరంగా ఉండటం వారిలో అనారోగ్యాలకు కారణం అవుతోంది. కాబట్టి క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల రక్తపోటు, కొలెస్ట్రాల్ లెవల్స్ అదుపులో ఉంటాయని, బీపీ, మధుమేహం, గుండె జబ్బుల రిస్క్ తగ్గుతుందని చెప్తున్నారు. వారానికి కనీసం 4 నుంచి 5 రోజులు ప్రతిరోజూ 30 నుంచి 60 నిమిషాలు వ్యాయామాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. అందుకు తగిన ఆహార నియమాలు పాటించాలి.

* క్వాలిటీ స్లీప్ : ఆధునిక జీవనశైలిలో మహిళలను వేధిస్తున్న మరో సమస్య నిద్రలేమి లేదా నాణ్యమైన నిద్రలేకపోవడం. రకరకాల ఆలోచనలు, ఆందోళనలు, ఆర్థిక ఇబ్బందులు ఇందుకు దారితీస్తు్న్నాయి. కుటుంబంలో ఇతరులకు అనారోగ్యాలు వంటి సందర్భాలు కూడా గృహిణులను ఎక్కువగా కృంగదీస్తున్నాయి. కుటుంబంలోని ఎవరికి అనారోగ్యం చేసినా మహిళలు ఎక్కువగా ఆందోళన చెందుతున్నారని నివేదికలు పేర్కొంటున్నాయి. దీని కారణంగా వారు నాణ్యమైన నిద్రకు దూరం అవుతున్నారు. చివరకు అనారోగ్యాల బారినపడుతున్నారు. సమస్యలు సహజమే. కానీ ప్రతీ సమస్యకు పరిష్కారం ఉంటుందనే విషయం కూడా గుర్తుంచుకుంటే ఆందోళనలు దూరం అవుతాయని, తద్వారా నాణ్యమైన నిద్ర సాధ్యం అవుతుందని నిపుణులు చెప్తున్నారు.

* మెడికల్ టెస్టులు : చాలా మంది గృహిణులు తమకు వచ్చే శారీరక సమస్యలను చిన్నవిగా భావించి పట్టించుకోరు. చివరికి అవి పెద్ద అనారోగ్య సమస్యలుగా మారుతుంటాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. క్యాన్సర్లు, లివర్ సమస్యలు, మధుమేహం వంటివి పెరిగిపోవడానికి వాటిని ప్రాథమిక దశలో గుర్తించకపోవడమే కారణం అవుతోంది. కాబట్టి శరీరంలో ఏవైనా అనారోగ్య సూచనలు వారానికి మించి కనిపిస్తే వాటి నిర్ధారణకోసం మెడికల్ టెస్టులు చేయించుకోవాలని, తద్వారా ఏదైనా సమస్య ఉంటే అది పెరగకముందే నివారించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

* పోషకాహారంపై ఫోకస్ : గృహిణులు చేసే పొరపాట్లలో సరైన పోషకాహారం తీసుకోవడం కూడా ఒకటి. ఇంటిల్లిపాది రుచికరమైన వంటకాలు చేసి పెట్టడం, కుటుంబాన్ని చూసుకోవడం, పనులు చక్కబెట్టడం ఇవన్నీ సక్రమంగా చేస్తున్న మహిళలు తాము మాత్రం సమయానికి తినడం లేదని నివేదికలు పేర్కొంటున్నాయి. కొందరు సమయానికి తింటున్నా సరైన పోషకాలు లేని ఆహారం తీసుకోవడం చివరికి వారి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. కాబట్టి ఈ విషయాలపై ఫోకస్ పెట్టాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని, అప్పుడే ఆరోగ్యాంగా, ఆనందంగా జీవించడం సాధ్యం అవుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ దీనిని ధృవీకరించడం లేదు. అనుమానాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed