Winter Tips : చలికాలంలో వ్యాధుల రిస్క్‌‌.. రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్లు ఇవే..

by Javid Pasha |
Winter Tips : చలికాలంలో వ్యాధుల రిస్క్‌‌.. రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్లు ఇవే..
X

దిశ, ఫీచర్స్ : మిగతా సీజన్లతో పోలిస్తే వింటర్‌లో ఇన్‌ఫెక్షన్లు, సీజనల్ వ్యాధులు సోకే అవకాశం ఎక్కువ. చల్లటి గాలులకు గురికావడంవల్ల పిల్లల్లో , పెద్దల్లో అనారోగ్యాలు సంభవిస్తుంటాయి. అవి రాకుండా ఉండాలన్నా, వచ్చినా త్వరగా తగ్గిపోవాలన్నా శరీరంలో తగిన రోగనిరోధక శక్తి ఉండాలి. అయితే కొన్ని రకాల విటమిన్లు అందుకు సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అవేమిటి? ఏయే ఆహారాల్లో లభిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

*విటమిన్ ఎ : చలికాలంలో జలుబు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువ. రోగ నిరోధక శక్తిని పెంచడం ద్వారా వీటిని నివారించడంలో విటమిన్ ఎ అద్భుతంగా సహాయపడుతుంది. క్యారెట్లు, చిలగడ దుంపలు, పాలకూర, పాలు, చీజ్ బీఫ్ లివర్, క్యాప్సికం, గుమ్మడి కాయ వంటి వెజిటేబుల్స్‌లో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది.

*విటమిన్ సి : శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి అవసరమైన ముఖ్యమైన వాటిలో విటమిన్ సి ఒకటి. దీనిని మైక్రో న్యూట్రియంట్‌గా కూడా పేర్కొంటారు. తెల్ల రక్తకణాల ఉత్పత్తిలో, వాటి పనితీరులో ఇది కీలకపాత్ర పోషిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్‌ పోషకంగా కూడా పనిచేస్తుంది. ఓవరాల్‌గా ఇన్ఫెక్షన్లు, వ్యాధుల ప్రభావాన్ని తగ్గించడంలో విటమిన్ సి సహాయపడుతుంది. కాబట్టి చలికాలంలో తప్పక తీసుకోవాలంటున్నారు నిపుణులు. నిమ్మ, నారింజ, బ్రోకలీ, బెర్రీ, వివిధ రకాల సిట్రస్ పండ్లలో ఇది లభిస్తుంది.

*విటమిన్ ఇ : యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉండి, రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో విటమిన్ ఇ అద్భుతంగా పనిచేస్తుంది. ఫ్రీ రాడికల్స్‌ను నియంత్రిస్తుంది. రోగ నిరోధక కణాల పనితీరును మెరుగు పరుస్తుంది. సీజనల్ వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. కాబట్టి ఆకు కూరలు, నట్స్, సీడ్స్, కోడిగుడ్లు, గుమ్మడి గింజలు, చేపలు వంటివి రోజువారీ డైట్‌లో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

*విటమిన్ డి : తెల్ల రక్తకణాలైన మోనో సైటిస్, మాక్రో ఫేజెస్‌ల సామర్థ్యాన్ని పెంచడంలో విటమిన్ డి కీలకపాత్ర పోషిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచడం ద్వారా వివిధ వ్యాధులతో పోరాడే శక్తిని ప్రేరేపిస్తుంది. జలుబు, దగ్గు, గొంతు నొప్పి, ఇలా అనేక రకాల సీజనల్ వ్యాధులను, ఇన్ఫెక్షన్ల ప్రమాదం నుంచి శరీరాన్ని కాపాడుతుంది. కొవ్వు చేపలు, కోడిగుడ్డు సొన, మష్రూమ్స్, సోయా మిల్క్ వంటి వాటిలో డి విటమిన్ పుష్కలంగా ఉంటుంది.

* విటమిన్ బి6 : విటమిన్ బి6 శరీరానికి ఉపయోగపడే అతి ముఖ్యమైన పోషకం. ఇది రోగ నిరోధక కణాలను పెంచుతుంది. ఇన్ఫోక్షన్లు, సీజనల్ వ్యాధుల బారి నుంచి త్వరగా కోలుకోవడంలో సహాయపడుతుంది. అలాగే ఇది అవసరం మేరకు యాంటీ బాడీలను కూడా పెంచుతుంది. కాయధాన్యాలు, బీన్స్, కోడిగుడ్లు, నట్స్, సోయా ప్రొడక్ట్స్, లీన్ మీట్స్, సాల్మన్ చేపల్లో విటమిన్ బి 6 పుష్కలంగా లభిస్తుంది.

* విటమిన్ బి 12 : శరీరానికి అవసరమయ్యే అత్యంత ముఖ్యమైన వాటిలో బి12 విటమిన్ కీలకమైంది. ఇది తెల్ల రక్తకణాల ఉత్పత్తిని, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. నాడీ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. వైరల్ ఇన్ఫెక్షన్లు, సీజనల్ వ్యాధుల బారి నుంచి బాడీని రక్షిస్తుంది. సాల్మన్ చేపలు, టునా ఫిష్, చికెన్, కోడిగుడ్లు, పాలు వంటి పదార్థాల్లో విటమిన్ బి 12 లభిస్తుంది. రెగ్యులర్‌గా తీసుకోవడం ద్వారా అన్ని సీజన్లలోనూ వ్యాధులు, ఇన్ఫెక్షన్ల రిస్క్‌ను నివారిస్తుంది.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story