ఆస్కార్‌లో విల్‌స్మిత్ కొట్టిన‌ చెంప‌దెబ్బ‌కు కార‌ణ‌మైన ఆ జోక్ ఏంటీ?

by Sumithra |   ( Updated:2023-10-10 16:24:56.0  )
ఆస్కార్‌లో విల్‌స్మిత్ కొట్టిన‌ చెంప‌దెబ్బ‌కు కార‌ణ‌మైన ఆ జోక్ ఏంటీ?
X

దిశ‌, వెబ్‌డెస్క్ః చ‌రిత్ర‌లో నిలిచిపోయే కొన్ని సంఘ‌ట‌న‌లు రెప్ప‌పాటు కాలంలో కూడా సంభ‌విస్తాయి. ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల వేదికపై అలాంటిదే ఓ ఘ‌ట‌న చోటుచేసుకుంది. 94వ అకాడెమీ అవార్డ్స్ కార్య‌క్ర‌మంలో ప్ర‌సిద్ధ నటుడు విల్ స్మిత్, అత‌డి భార్య‌ జాడా పింకెట్ స్మిత్ గురించి ప్రోగ్రామ్‌ ప్రెజెంటర్ క్రిస్ రాక్ వేసిన ఓ జోక్, తర్వాత విల్‌స్మిత్ క్రిస్‌రాక్‌ను చెంపదెబ్బ కొట్ట‌డం. రెప్ప‌పాటు కాలంలో విల్‌స్మిత్ 'క్ష‌ణికావేశం' చ‌ర్చ‌ను చాలా దూరం తీసుకెళ్లింది. 'ఒక‌రి బాధే ఇంకొక‌రికి కామెడీ' అయిన ప‌రిస్థితుల్లో జోకులు విచ‌క్ష‌ణ‌ను చంపేస్తున్నాయా..? అనే వాద‌న అంత‌ర్జాతీయంగా మ‌రోసారి వినిపించింది.

బెస్ట్ యాక్ట‌ర్ కేటగిరీలో ఆస్కార్‌ను అందించడానికి ముందు, హాలివుడ్ హాస్యనటుడు, తాజా ఆస్కార్ హోస్ట్‌ క్రిస్ రాక్ ఓ జోక్ వేశాడు. జాడా పింకెట్ స్మిత్ అనారోగ్య ప‌రిస్థితిని ఉప‌యోగించుకొని, "G.I. జేన్ 2" సినిమా ఆస్కార్‌ పోటీల్లో ఉండొచ్చ‌ని చమత్కరించాడు. అది మీడియా వేదిక‌ల్లో "G.I. జేన్ 2" జోక్‌గా ప్ర‌స్తావిస్తున్నారు. 1997లో విడుద‌లైన "G.I. జేన్" అనే అమెరిక‌న్ వార్ డ్రామా సినిమాలో ప్రధాన పాత్ర, జోర్డాన్ ఓ'నీల్ అత్యంత క్రూర‌మైన‌ నేవీ సీల్ స‌భ్యుల‌ శిక్షణ పొందుతుంది. ఈ క్రూరమైన సీల్ శిక్ష‌ణ‌లో పాల్గొన్న తర్వాత ఆమె త‌న తోటి పురుష సహచరులను మించిపోయి, అత్యుత్త‌మంగా నిలుస్తుంది. ఇందులో భాగంగా ఓ'నీల్ తన స్త్రీత్వ గుర్తుల‌ను చెరిపేస్తూ, తల వెంట్రుక‌ల‌ను పూర్తిగా తొల‌గిస్తుంది. అయితే, ఈ సినిమాను ప్ర‌స్తావిస్తూ విల్‌స్మిత్ భార్య జాడా పింకెట్‌కు "G.I. జేన్" పాత్ర‌ను ఆపాదించ‌డం, "G.I. జేన్ 2" సినిమాలో ఈసారి జాడా న‌టించి, త‌న భ‌ర్త విల్‌స్మిత్‌తో పాటు అవార్డు అందుకుంటుందంటూ ఓ జోక్ పేల్చాల‌నుకున్నాడు క్రిస్ రాక్‌. అయితే, క‌థ అడ్డం తిరిగి, చెంప‌దెబ్బ‌గా చ‌రిత్ర‌లోకి ఎక్కింది.

అయితే, జాడా పింకెట్ స్మిత్ అలోపేసియా ఏరియాటా అనే ఒక అనారోగ్యంతో బాధ‌ప‌డుతోంది. అలోపేసియా అంటే మ‌నిషిలో వ్యాధినిరోధ‌క శ‌క్తి లోపం అనేది కేవ‌లం జుట్టుకు సంబంధించి మాత్ర‌మే ప్ర‌భావం చూప‌డం. దీనితో మిగిలిన దేహానికి ఎలాంటి ఇబ్బంది ఉండ‌దు. దీని వ‌ల్ల జుట్టు ముద్ద‌లుగా రాలిపోతుంది. జన్యుపరంగా వ‌చ్చే ఈ వ్యాధికి నిర్దిష్ట కారణమంటూ ఇప్పటికీ లేదు. ఈ పరిస్థితికి సరైన పరిష్కారం లేదు కానీ జుట్టు తిరిగి పెరగడానికి కొన్ని మార్గాలను వైద్యులు సూచిస్తారు. ఇక‌, జాడాకు వ‌చ్చిన ఈ ఇబ్బందిని తెలియ‌జేస్తూ ఆమె సోష‌ల్ మీడియాలోనూ బ‌హరంగంగానే ప్ర‌క‌టించింది. ప్ర‌స్తుతం, బాడీ షేమింగ్‌పైన, సెల్ఫ్ ల‌వ్ పైనా ప‌లు వీడియోలు చేస్తోంది.

Advertisement

Next Story