Tweet.. For Better Future.. మెరుగైన భవిష్యత్ ప్రణాళికకు తోడ్పడుతున్న ప్రతీ ట్వీట్

by Mahesh |   ( Updated:2023-02-11 05:50:01.0  )
Tweet.. For Better Future.. మెరుగైన భవిష్యత్ ప్రణాళికకు తోడ్పడుతున్న ప్రతీ ట్వీట్
X

దిశ, ఫీచర్స్: మీరు ఆన్ లైన్‌లో ఉన్నారా? ఏవైనా కొత్త ఆలోచనలు మీ మదిలో మెదులుతున్నాయా? మీరు చూసింది గానీ, చదివింది కానీ, ఒక అంశం పట్ల అభిప్రాయం కానీ, ఆలోచనగానీ పంచుకోవాలని అనిపిస్తోందా? మీలోని ఎమోషన్స్‌ను ఆపుకోలేకపోతున్నారా? అయితే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ట్వీట్ చేయండి. ఎందుకంటే మీ ట్వీట్ అందమైన భవిష్యత్తుకు దారి తీయవచ్చు.

సమాజంలో మార్పునకు కారణం కావచ్చు. పట్టణాల అభివృద్ధి ప్రణాళికలకు ఆధారం కావచ్చు. రూట్ మ్యాప్ లొకేషన్లలో సమాచారానికి ఆధారం కావచ్చు. అందుకే మీరు ప్రతి విషయాన్ని ట్వీట్ చేయండి.. చేస్తూనే ఉండండి.. అంటున్నారు నిపుణులు.

మీరు ట్వీట్ చేసి మర్చిపోతారేమోగానీ అవి పరిశీలకులకు చాలా సహాయపడతాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోని ప్రజల భావోద్వేగాలు, స్పందనలను విశ్లేషించినప్పుడు అవి చాలా యూజ్ అవుతాయని తాజాగా నిపుణుల అధ్యయనంలో వెల్లడైంది. లండన్ అండ్ శాన్ ఫ్రాన్సిస్కో‌లలోని పలు లొకేషన్ల నుంచి చేసిన దాదాపు 2 మిలియన్ల ట్వీట్లను 'PLOS ONE' అనే ప్రముఖ జర్నల్ పరిశీలించింది.

ఆయా సందర్భాల్లో , ఆయా ప్రదేశాల్లో వ్యక్తులు తమ అనుభవాలు, అవగాహనల ద్వారా, ఎదురయ్యే సంఘటనలను బట్టి ట్వీట్లు చేస్తుంటారు. కాబట్టి ఒక అంశంపై నిర్దిష్ట ప్రాంతం నుంచి వచ్చిన రకరకాల ట్వీట్లను విశ్లేషించడం ద్వారా అక్కడి ప్రజలు ఏం కోరుకుంటున్నారో అర్థం అవుతుంది. భవిష్యత్తులో పట్టణాల అభివృద్ధికి తోడ్పడుతుంది.

పార్కుల విషయంలో ఒక విశ్లేషణ

''బేసిగ్గా ఆయా నగరాల్లోని ఏయే ప్రాంతాలు ప్రతికూల లేదా అనుకూల భావోద్వేగాలను కలిగిస్తాయో, అక్కడి ప్రజలు ఎటువంటి ఫీలింగ్స్ వ్యక్త పరుస్తున్నారో గుర్తించడంలో ట్వీట్స్ సహాయపడతాయి. ఉదాహరణకు సిటీలోని పార్కులకు వెళ్లినప్పుడు అక్కడి పరిస్థితిని బట్టి ప్రజలు తమ అభిప్రాయాన్ని ట్వీట్ చేశారనుకోండి. ఇటువంటి అనేక రకాల ట్వీట్లు ఒక సమస్యకు సంబంధించినవో, అభివృద్ధికి రిలేటెడ్ అయినప్పుడు వాటన్నింటినీ ఒక కేటగిరీగా విభజించి విశ్లేషించడం ద్వారా నగర ప్రణాళికా విభాగానికి ఎంతో ఉపయోగపడుతుంది'' అని జపాన్‌లోని క్యోటో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇన్ఫర్మేషన్ అండ్ హ్యూమన్ సైన్సెస్ పరిశోధకుడు, అధ్యయన కర్త, రచయిత పనోట్ సిరియారాయ తెలిపాడు.

పర్యాటకులు లేదా స్థానికులకు జర్నీ చేసేందుకు రూట్స్‌ను కనుగొనడంలో సహాయపడతాయి. ఎక్కడైనా మద్యం షాపులు ఉండి, మద్యం తాగిన వ్యక్తులు ఇతరులకు ఆటంకం కలిగిస్తుంటే ఆ ప్రదేశాలను గుర్తించి చర్యలు తీసుకోవడానికి, లేదా నాట్ అలో జోన్లుగా ప్రకటించడానికి ఆయా ప్రాంతాల ప్రజలు పెట్టే ట్వీట్‌లను పరిశీలించడం ద్వారా సాధ్యం అవుతుంది. అదే విధంగా నావిగేషన్ యాప్‌లలో రూట్ మ్యాప్స్, సమాచారం క్రోడీకరణకు, సాఫ్ట్‌వేర్‌ రూపకల్పనకు ఈ విశ్లేషణ సహాయపడుతుందని పరిశోధకుడు సిరియారాయ చెప్పాడు.

ఏఐ టూల్స్ ఆధారంగా ఎనాలిసిస్

పరిశోధకుల బృందం మొదట ఏడాదిపాటు ప్రతీ నగరం నుంచి జియో ట్యాగ్ చేసిన ట్వీట్లను సేకరించింది. ఏఐ సాధనాల ద్వారా వాటిని విశ్లేషించింది. వాటిలోని సబ్జెక్ట్, సమస్య, సలహా, ఎమోషన్స్, ఒపీనియన్ ఇలా ప్రతీ పోస్టును పరిశీలించి కేటగిరీల వారీగా విభజించింది. ఆయా అంశాలపై వచ్చిన ట్వీట్లకు లొకేషన్‌ను యాడ్ చేసి నగరాల్లోని స్థానిక అంశాల జాబితాను క్రియేట్ చేసింది.

అయితే ప్రతీ ఒక్క ట్వీట్‌కు సంబంధించిన ఎమోషన్స్‌ను లొకేషన్ మ్యాప్‌లో పేర్కొన్నది. ఫైనల్‌గా ఆయా ట్వీట్లు వచ్చిన లొకేషన్ జోన్లను లెక్కించారు. అక్కడుండే ప్రజల భావోద్వేగాలను గుర్తించారు. స్విమ్మింగ్ పూల్స్ ఉన్న ఏరియాలో ప్రజలు సంతోషంగా ఉన్నప్పుడు అక్కడి ఏరియాను హాప్పీనెస్ జోన్‌గా యాడ్ చేయవచ్చు అని నిపుణులు చెప్పారు.

వీకెండ్స్‌‌ను విశ్లేషించడం ద్వారా

ప్రతి ట్వీట్ చుట్టూ ఉన్న లొకేషన్‌ల రకాలను కూడా బృందం పరిశీలించింది. ప్రత్యేకంగా గుర్తించిన లొకేషన్ల ఆధారంగా అనేక రకాల అభిప్రాయాలను, భావోద్వేగాలను విశ్లేషించి, క్రోడీకరించారు. వారం మొత్తం అలాగే వివిధ సంఘటనలు జరిగినప్పుడు కూడా ట్వీట్లను పరిలించారు. ఉదాహరణకు వీకెండ్స్‌లో ప్రజలు సంతోషంగా ఉండటాన్ని ప్రజల ట్వీట్లను బట్టి తెలుసుకున్నారు. అలాగే మిగిలిన వారాల్లో కూడా ఆయా ప్రజల ట్వీట్లను బట్టి ఎమోషన్స్‌ను, స్విచ్యువేషన్స్‌ను అంచనా వేయవచ్చని నిపుణులు బృందం వెల్లడించింది.

2017‌లో ట్వీట్ల విశ్లేషణలో తేలిందేమిటి?

2017లో ఉమెన్స్ మార్చ్ వంటి సంఘటనలు శాన్ ఫ్రాన్సిస్కోలో ప్రజల్లో కోపం, అసహ్యం వంటి భావోద్వేగాలను ప్రేరేపించాయని పరిశోధకులు గుర్తించారు. అక్కడ జరిగిన టెర్రరిస్టు దాడుల సమయంలో లండన్‌కు చెందిన ప్రజలు తమ భయాన్ని, బాధను ట్వీట్ల ద్వారా ప్రదర్శించారు. ఇక న్యూ ఇయర్ సందర్భంగా ట్వీట్లను విశ్లేషించినప్పుడు సహజంగానే ప్రతి సిటీలోనూ అక్కడి ప్రజలు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉన్నట్లు తేలింది.

అంతేకాకుండా అనేక రకాల సందేహాలను తీర్చడంలో, సమాచారాన్ని అందిపుచ్చుకోవడంలో ట్వీట్ల డేటాను బాగా ఉపయోగపడిందని తేలింది. అంతేకాదు ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు అక్కడి ప్రజల బాధలు, భావోద్వేగాలు, అవసరాలు, పరిష్కారాలు కనుగొనడానికి ట్వీట్లు చాలా యూజ్ అవుతాయనే అభిప్రాయాన్ని నిపుణులు వెల్లడించారు.

డోంట్ నెగ్లెట్ యువర్ ట్వీట్

అందుకే ఒక చిన్న ట్వీటే కదా అని తీసి పారేయటానికి లేదంటున్న నిపుణులు.. వీటి చుట్టూ అనేక అంశాలు ముడిపడి ఉన్నాయని అంటున్నారు. ఆయా సందర్భాలు, పరిస్థితుల ప్రభావాల్లో తమ తమ మనసులోని భావాలు, భావోద్వేగాలు, సమస్యలు, సలహాలు వంటివి ప్రజలు ట్వీట్ చేయడాన్ని విశ్లేషించడం ద్వారా అది గొప్ప భవిష్యత్ ప్రణాళికకు తోడ్పడవచ్చు. ఆ సమాచారం కొత్త చరిత్రను సృష్టించవచ్చు. పలు సమస్యలకు పరిష్కారాన్ని ఇవ్వవచ్చు. సో డోంట్ నెగ్లెక్ట్ టు ట్వీట్ అంటున్నారు నిపుణులు.

Advertisement

Next Story

Most Viewed