- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Go Back To India.. చెదిరిపోతున్న డాలర్ డ్రీమ్స్.!

అమెరికా..
మన దేశపు యువత కలల స్వప్నం.
బాగా చదవాలి.. అమెరికా వెళ్లాలి..
అక్కడే సెటిలవ్వాలి.. సంపాదించాలి..
అనే కోరిక ఉంటుంది.
ఒకరకంగా దాన్నే లక్ష్యంగా పెట్టుకుంటారు.
కానీ..
ఆ డాలర్ డ్రీమ్స్ క్రమంగా సన్నగిల్లుతున్నాయి.
కలలు చెదిరిపోతాయేమో అనే దిగులు మొదలైంది.
కారణం.?
ట్రంప్.. యెస్.. ట్రంపే..!!
"ఏం సార్.. మీ కొడుకేంజేస్తుండు?" అని ఎవరైనా అడిగితే.. "మావోనికేంది సార్.. అమెరికాల సదువుతుండు. ఏదో పార్ట్ టైం జాబ్ జేస్తుండంటా. వాని కర్సులువోంగా మీదికెల్లి మాగ్గూడ పంపుతుండు. ఇప్పుడు పానం నిమ్మలమైంది. ఏ రందీ లేదు. ఇగ దినామొకసారి వీడియోకాల్ జేశి మాట్లాడ్తడు" అని సంబరపడే పేరెంట్స్ ఊరూరికీ ఉంటారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. అమెరికా నుంచి ఫోనొస్తే భయమైతుందంటా.!
1. శ్రీకర్‌ది భువనగిరి. ఎంవీఎస్సార్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చేసి గతేడాది అమెరికా వెళ్లాడు. టెక్సాస్‌లో చదువుతూ ఓ లైబ్రరీలో పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నాడు. అమెరికా వెళ్లేందుకు చేసిన రూ.25 లక్షల అప్పును పేరెంట్స్‌కి భారం కాకుండా కొద్దికొద్దిగా తీర్చేస్తున్నాడు. సడెన్‌గా ఇంటికి ఫోన్ చేసి "నాన్నా.. ఇక్కడ సిచువేషన్ బాగలేదు. అప్పు మీరే తీర్చాలె.. ఇంకా నాగ్గూడ కర్సులమందం పంపాలె" అని చెప్తే పేరెంట్స్ షాకయ్యారు.
2. సుశీల్‌ది ఖమ్మం. అతడి చదువుకోసం ఫ్యామిలీ అంతా హైదరాబాద్ షిఫ్టయ్యి మన్నెగూడలో ఉంటున్నారు. బీటెక్ అయిపోయాక సుశీల్ అమెరికా వెళ్లి కాలిఫోర్నియాలోని బే ఏరియాలో ఉంటూ ఏదో పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నాడు. ఐతే.. "ఇక్కడి పరిస్థితి బాలేదమ్మా.. ఎప్పుడు పంపేది చెప్పలేం.." అని అంటున్నాడట ఈ మధ్య. పార్ట్ టైం జాబ్స్ చేస్తూ దొరికిపోతే పంపిచేస్తారట అనే భయం కావచ్చు.
3. కిరణ్మయి వాషింగ్టన్‌లో ఉంటుంది. ఆమె అమెరికా వెళ్లి రెండేళ్లవుతోంది. ఇంతకాలం బాగనే ఉన్నా ఈ మధ్య ప్రభుత్వ ప్రకటన చూసి భయపడుతోందట. మామూలుగా అయితే వారంలో నిర్ణీత గంటలే పనిచేయాలట. కానీ కిరణ్మయి ఆ పరిమిత గంటలు దాటి పనిచేసి చేతినిండా సంపాదిస్తుందట. ఇల్లీగల్ పార్ట్ టైమ్ జాబ్స్ చేస్తే వీసాలు రద్దంటూ వస్తున్న వార్తలకు బెంబేలెత్తిపోతోంది కిరణ్మయి.
ఉక్కిరి బిక్కిరి.?
శ్రీకర్.. సుశీల్.. కిరణ్మయి.. ఇలా ఎంతోమంది భారతీయ విద్యార్థులు అమెరికాలో చదువుతూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఎన్నో ఆశలు.. మరెన్నో ఆశయాలతో ఉన్నత లక్ష్యాలనేర్పరచుకొని అమెరికా వెళ్లారు వాళ్లంతా. అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న కొత్త నిర్ణయాలు అక్కడి మనవాళ్లను ఆర్థిక ఇబ్బందుల్లోని నెడుతున్నాయని చెప్తున్నారు విశ్లేషకులు. వలసవాదులపై ఉక్కుపాదం మోపుతున్న ట్రంప్ నిర్ణయాలతో లక్షలాది మంది విద్యార్థులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. క్రమంగా డాలర్ డ్రీమ్స్ చెదిరిపోయేలా ఉన్నాయంటున్నారు.
సాగనంపడానికే.?
అమెరికా ఇమిగ్రేషన్ ఆఫీసర్లు విదేశీ విద్యార్థులపై ప్రత్యేక నిఘా పెట్టారు. క్యాంపస్ బయట పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేసే విద్యార్థులే లక్ష్యంగా కఠినతరమైన నిబంధనలను తీసుకొస్తున్నారు. క్యాంపస్‌లో మాత్రమే ఇలాంటి ఉద్యోగాలకు పర్మిషన్ ఉంది. కానీ.. అదొక్కటే చేస్తే ఇంటి దగ్గర చేసొచ్చిన అప్పులు తీరేదెలా.? అమ్మానాన్నకు డబ్బు పంపేదెలా.? అనే ఉద్దేశంతో చాలామటుకు బయట జాబ్స్ చేస్తుంటారు. కఠిన నిబంధనలను అమలుచేస్తే ఈ ధోరణిని కట్టడి చేయొచ్చు.. దానిని సాకుగా చూపి ఇంటికి సాగనంపి వలస తాకిడిని తగ్గించొచ్చనే ఆలోచనతో ఉన్నారట ఇమిగ్రేషన్ ఆఫీసర్లు.
చేయాలా వద్దా.?
క్యాంపస్‌లో మాత్రమే జాబ్ చేయాలంటే అందరికీ దొరుకుతాయా.? సాలరీ తక్కువైనా సరే బయటేదైనా చిన్నపాటి జాబ్ ఉంటే చేసుకోవాలనే ఆలోచనతోనే ఉంటారు మాగ్జిమమ్ అమెరికా వెళ్లిన విద్యార్థులు. వలసొచ్చిన వాళ్లను గుర్తించాలనే ఉద్దేశంతో ట్రంప్ సర్కారు చేస్తున్న తనిఖీలు తమకు తలనొప్పిగా మారాయని అక్కడి మనవాళ్లు మొత్తుకుంటున్నారు. ఎందుకొచ్చిన లొల్లి అని ఉద్యోగాలను వదులుకుంటే.. ఫీజులు కట్టేదెలా..? ఖర్చులెలా.? అనే ఆందోళన. ఏదో ధైర్యంచేసి జాబ్‌ను కంటిన్యూ చేస్తే.. ఎక్కడ పట్టుబడతామేమో అనే భయంతో నలిగిపోతున్నారట పాపం.
అసలేంటి కండీషన్.?
ఎఫ్-1 వీసాపై అమెరికాకు వెళ్లిన విద్యార్థులు క్యాంపస్‌లోనే జాబ్ చేయాలి. వారానికి 20 గంటలకంటే ఎక్కువ చేయొద్దు. దానిని "ఆన్ క్యాంపస్ పార్ట్ టైమ్ జాబ్" అంటారు. ఐతే.. సమ్మర్ హాలిడేస్.. సెమిస్టర్ల మధ్య 40 గంటలు కూడా చేసుకోవచ్చు. అదే బయటైతే సూపర్ మార్కెట్లలో.. పెట్రోల్ బంకులల్లో.. హోటల్స్ రెస్టారెంట్లలో పనిచేసే ఛాన్స్ ఉంటుంది. అమెరికన్లకైతే గంటకు 20-30 డాలర్స్ ఇస్తారు. అదే మనవాళ్లు 6-10 డాలర్లు ఇచ్చినా చేస్తారు కాబట్టీ ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉండి.. డబ్బు బాగా సంపాదిస్తుంటారు.
మనవాళ్లపైనే ప్రభావం..
అమెరికా ఇటీవల విడుదల చేసిన "ఓపెన్ డోర్" నివేదిక ప్రకారం.. 2023-2024లో చదువుకోసం వెళ్తున్నవారిలో భారతీయ విద్యార్థులే అధికం. మొత్తం 11.26 మంది విదేశీ విద్యార్థులు ఉండగా అందులో మనవాళ్లు 3.30 లక్షల మంది. ప్రతీ 100 మంది విదేశీ విద్యార్థుల్లో 30 మంది మనవాళ్లేనట. ఇంకా అందులోనూ తెలంగాణ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విద్యార్థులు 56శాతం ఉన్నారు. ఈ లెక్క ప్రకారం చూసుకుంటే ఎటొచ్చీ ఈ "ఆన్ క్యాంపస్ పార్ట్ టైమ్ జాబ్" ప్రభావం భారతీయ విద్యార్థులపైనే ఎక్కువగా చూపే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు.
డిపోర్టేషన్ భయం.!
అమెరికాలోని వివిధ విద్యాసంస్థల్లో మనవాళ్లు 3.30 లక్షల మందికి పైగా చదువుతున్నారు. అయితే 20,407 మంది విద్యార్థులు సరైన పత్రాలు లేకుండా అక్రమంగా నివసిస్తున్నట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయట. వారిలో ఇప్పటికే 2,467 మంది అమెరికా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ నిర్బంధంలో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఇంత క్లిష్టపరిస్థితుల్లో రిస్క్ తీసుకోవద్దనేది భారతీయ విద్యా్ర్థుల ఆలోచన. ఒకవేళ జాబ్ చేస్తూ పట్టుబడితే ఇక డిపోర్టేషనే అనే భయంతో కొంచెం ఇబ్బందిగానే కాలమెల్లదీస్తున్నట్లు చెప్తున్నారు అక్కడి విద్యార్థులు. ఇదండీ పాపం.. డాలర్ డ్రీమ్స్‌తో అమెరికాలో అడుగుపెట్టిన విద్యా్ర్థుల పరిస్థితి.!
లిమిట్ ఓవర్..
వలసలను కంట్రోల్ చేయడమే ట్రంప్ సర్కారు లక్ష్యం అమెరికా సిటిజన్‌షిప్.. ఇమిగ్రేషన్ సర్వీసెస్ లెక్కల ప్రకారం.. 2025 సంవత్సరానికి భారతీయులకు జారీ చేసిన హెచ్1బీ వీసా కోసం పరిమితికి మించి దరఖాస్తులు వచ్చాయట. దీంతో దరఖాస్తులను నిలిపేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రెగ్యులర్ అప్లికెంట్స్ లిమిట్ 65వేల మార్క్. యూఎస్ అడ్వాన్స్ డిగ్రీ హోల్డర్ల కోసం నిర్దేశించిన 20వేల వీసాల కూడా లిమిట్ చేరుకుంది.
మనవాళ్లే టాప్..
అమెరికా హెచ్1బీ వీసాలను తాత్కాలిక ఉద్యోగులు.. విద్యార్థులకు ఇస్తారు. రెగ్యులర్ కోర్సులైన ఆర్కిటెక్చర్.. ఇంజనీరింగ్.. మ్యాథమెటిక్స్.. ఫిజికల్ సైన్స్.. సోషల్ సైన్సెస్.. మెడిసిన్.. లా అండ్ ఆర్డర్ వంటి వాటికి పరిమిత వీసాలుంటాయి. వాటితోపాటు గూగుల్.. అమెజాన్.. ఇన్ఫోసిస్.. ఐబీఎం.. వంటి కంపెనీలు ఈ వీసాలను స్పాన్సర్ చేస్తాయి. గతేడాది ఈ వీసాలను దక్కించుకున్నవారిలో 72శాతం భారతీయులే ఉన్నారట.