30 ఏండ్ల తర్వాత పురుషుల్లో సాధారణంగా తలెత్తే సమస్యలివే.. ఎందుకంటే..

by Javid Pasha |
30 ఏండ్ల తర్వాత పురుషుల్లో సాధారణంగా తలెత్తే సమస్యలివే.. ఎందుకంటే..
X

దిశ, ఫీచర్స్ : వయస్సు పెరిగే కొద్దీ మానసిక పరిపక్వత ఏర్పడుతుందని, కుటుంబ బాధ్యతలు పెరుగుతాయని అంటుంటారు. కానీ వీటితోపాటు ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతాయంటున్నారు నిపుణులు. ఒకప్పుడు 40 ఏండ్ల వయస్సులో కూడా స్త్రీ, పురుషులు పెద్దగా హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి తక్కువ. ఉరుకులూ పరుగుల జీవితం, మారుతున్న ఆహారపు అలవాట్లు, పర్యావరణ కాలుష్యం, గ్లోబల్ వార్మింగ్ వంటి పరిస్థితుల నేపథ్యంలో 30 ఏండ్లు దాటగానే పలువురిలో వివిధ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతున్నాయి. పురుషుల్లో సాధారణంగా తలెత్తే అటువంటి సమస్యలేవో తెలుసుకుందాం.

ఎముకల బలహీనత

పురుషుల్లో 30 ఏండ్లు దాటిన పురుషుల్లో కనిపించే కామన్‌ ప్రాబ్లమ్స్‌లో ఎముకల బలహీనత ఒకటి. ఈ వయస్సులో బిజీ విజీగా గడపడం, పౌష్టికాహారంపై పెద్దగా ఫోకస్ చేయకపోవడం వంటివి ఇందుకు కారణం కావచ్చు. ముఖ్యంగా శరీరంలో విటమిన్ డి, కాల్షియం లోపాలు ఏర్పడతాయి. దీనివల్ల కీళ్లు, మెడ, వెన్ను నొప్పి వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. అలా జరగకూడదంటే కాల్షియం అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

కార్డియో వాస్క్యులర్ ఇష్యూస్

ఏజ్ పెరిగే కొద్దీ హార్ట్ రిలేటెడ్ ఇష్యేూస్ పెరుగుతాయి. కొందరిలో ముప్పై ఏండ్లు దాటాక కార్డియో వాస్క్యులర్ సమస్యలు ప్రారంభం కావడం ఇటీవల చాలా కామన్ అయిపోయింది. హెల్తీ ఫుడ్స్ తక్కువ తీసుకోకపోవడం, జంక్ ఫుడ్స్ అధికంగా తీసుకోవడం కూడా ఇందుకు కారణం అవుతాయి. ఎందుకంటే వీటివల్ల ధమనులలో బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ పేరుకుపోతాయి. దీంతో గుండె జబ్బులు వచ్చే చాన్సెస్ ఉంటాయి. అందుకే 30 ఏండ్లు దాటాక ఆరోగ్యం విషయంలో కేర్ తీసుకోవాలి. ఆహార నియమాలు ఫాలో కావాలని, హెల్తీ ఫుడ్‌తో పాటు ఫిజికల్ యాక్టివిటీస్ ఉండేలా చూసుకోవాలి.

ఒబేసిటీ లేదా అధిక బరువు

వర్క్ లేదా మెంటల్ స్ట్రెస్, తప్పుడు ఆహారపు అలవాట్ల కారణంగా 30 ఏండ్లు దాటిన వారిలో అధిక బరువు సమస్య తలెత్తే చాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇటువంటప్పుడు బాడీలో కొలెస్ట్రాల్ లెవల్స్ అదుపులో ఉంచుకునేందుకు ప్రయత్నించాలి. వ్యాయామాలతోపాటు ఆహార నియమాలు పాటించడం ద్వారా ఒబేసిటీకి చెక్ పెట్టవచ్చు.

యూరినల్ ఇన్ఫెక్షన్స్, ప్రొస్టేట్ క్యాన్సర్

ప్రస్తుతం 30 నుంచి 40 ఏండ్ల మధ్య వయస్సుగలవారిలో యూరినల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా కనిపిస్తున్నట్లు నిపుణులు చెప్తున్నారు. దీంతోపాటు పలువురిలో ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. యూరిన్ పోస్తున్నప్పుడు నొప్పి లేదా వృషణాలతో నొప్పి వంటివి తరచుగా వస్తుంటే ప్రొస్టేట్ క్యాన్సర్‌కు ముందు వచ్చే లక్షణాలుగా అనుమానించాలి. డాక్టర్లను సంప్రదించి, నిర్ధారణ పరీక్షలు చేయించుకొని, సమస్య ఉంటే తగిన ట్రీట్మెంట్ తీసుకోవాలి.

బట్టతల

ఒకప్పుడు పెద్దల్లో మాత్రమే బట్టతల సమస్య కనిపించేది. కానీ ఇప్పుడు వయస్సుతో సంబంధం లేకుండా 25 నుంచి 30 ఏండ్ల వయస్సుగలవారిలోనూ ఈ ప్రాబ్లం కనిపిస్తోంది. జెనెటిక్ రీజన్స్ మినహాయిస్తే, తగినంత సూర్యరశ్మి లేకపోవడం, పొల్యూషన్ ఎక్స్‌పోజర్, కల్తీ ఆహారాలు, పోషకాలలోపం వంటివి కూడా బట్టతల రావడానికి కారణం అవుతాయి. కాబట్టి ముందు జాగ్రత్తగా తీసుకునే ఆహారంలో ప్రోటీన్స్, విటమిన్స్, ఐరన్, మినరల్స్ తగినంతగా ఉండేలా చూసుకోవాలి.

Advertisement

Next Story

Most Viewed