Strange Places : అక్కడ మనుషులు జీవించలేరు కానీ..

by Javid Pasha |
Strange Places : అక్కడ మనుషులు జీవించలేరు కానీ..
X

దిశ, ఫీచర్స్ : కొన్ని విషయాలు వినడానికి వింతగా అనిపిస్తాయి. కొన్ని సంఘటనలు చూడ్డానికి ఆశ్చర్యంగా కనిపిస్తాయి. కొన్ని ప్రాంతాలు మనలో ఆసక్తి రేకెత్తిస్తాయి. కొన్ని దృశ్యాలు మనకో సందేశాన్నో, కొత్త సమాచారాన్నో అందిస్తాయి. ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి. అసలు సాధ్యమేనా? అన్న సందేహాలకు తావిస్తాయి. సరిగ్గా అలాంటి అనుభూతిని కలిగించే ప్రదేశాలు ఈ భూమిపై ఉన్నాయి. అలాంటి వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మరియానా ట్రెంచ్

ఈ భూమిపై మనం ఎప్పుడూ చేరుకోలేని వింత ప్రదేశాలు కూడా కొన్ని ఉన్నాయి. ఎందుకంటే అక్కడ మరీ చల్లగానో, మరీ వేడిగానో ఉండవచ్చు. కొన్నిసార్లు ఎవరూ ఊహించని పరిణామాలు సంభవించవచ్చు. అలా ఎందుకుంటాయో సైంటిస్టులకు కూడా అంతు చిక్కనివి ఉన్నాయి. అలాంటి వాటిలో మరియానా ట్రెంచ్ ఒకటి. ఇది పసిఫిక్ మహా సముద్రంలో ఉంది. ఈ భూమి మీద అత్యంత లోతైన (35 వేల అడుగులు) ప్రదేశం కూడా ఇదే. పైగా ఇక్కడ నీటి ఒత్తిడి ఎక్కువ. ఇక సూర్యకాంతి అయితే ఎప్పటికీ చేరుకోలేదు. మనుషులు కూడా అంతలోతుకు వెళ్లలేరు. కానీ ఇక్కడ చిన్న చిన్న అమీబాలు, రొయ్యల లాంటి యాంఫిఫోడ్స్, సి కుకుంబర్స్ వంటివి జీవిస్తుంటాయి.

లోతైన సముద్ర భూ భాగం

సముద్రపు లోతుల్లోని కొన్నిచోట్ల భూమి పగుళ్లు సంభవిస్తుంటాయి. దీనిని డీప్ సీ ఈవెంట్స్‌గా పేర్కొంటారు. ఇక్కడ లోపలి నుంచి సలసలా మరుగుతున్న లావా బయటకు వస్తుంది. ఇది సముద్రపు నీటితో కలిసి విషవాయువులను వెదజల్లుతుంది. కాబట్టి ఇటువంటి వాతావరణం మధ్య జీవం ఉండే అవకాశం తక్కువని ఎవరైనా భావిస్తారు. కానీ ఈ వేడికి తట్టుకోగలిగే నత్తలు, ఐరన్ షెల్స్ వంటి కొన్ని జీవులు ఇక్కడ నివసిస్తుంటాయి.

ఆక్సిజన్ లేని ప్రాంతాలు

జీరో ఆక్సిజన్ స్లడ్జ్ గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. ఇవి గ్రీస్, ఇటలీ, స్పెయిన్ దగ్గర మధ్యధరా సముద్రాల్లోని కొన్నిచోట్ల ఉండే ప్రదేశాలు. ఇక్కడ గట్టిగా ఉండే మట్టి పదార్థాన్నే స్లడ్జ్ అంటారు. ఇది ఉప్పగా ఉంటుంది. అయితే అందులో ఆక్సిజన్ ఉండదు. దీంతో అక్కడి వాతావరణం మానవ మనుగడకు ప్రతికూలం. కానీ లారిసిఫెరాన్ అనే చిన్న చిన్న సముద్ర జీవులు మాత్రం ఇక్కడ జీవిస్తాయి.

అంటార్కిటిక్ ఎడారులు

సాధారణంగా ఎడారులు వేడిగా ఉంటాయి. ఈ ప్రంపచంలో ఒక్క అంటార్కిటిక్ డెజెర్ట్ మాత్రం చాలా కూల్‌గా ఉంటుంది. అక్కడికి మనుషులు వెళ్తే 10 నిమిషాలు కూడా తట్టుకోలేనంత చలి ఉంటుంది. కాబట్టి ఎవరూ అక్కడ నివసించలేరు. కానీ ఇంతటి చల్టి ప్రదేశంలో కూడా ఎక్స్ ట్రీమోఫైల్ అనే బ్యాక్టీరియా మాత్రం మనగలుగుతుంది.

ట్రినిడాడ్ కొలనులు

ట్రినిడాడ్ (trinidad pools) అలాగే టొబాగో దేశంలో కొన్ని వింత గొల్పే నీటి కొలనులు ఉన్నాయి. ఇవి ఎప్పుడు వేడినీటితో మరుగుతూ ఉంటాయి. అందుకే బాయిలింగ్ టార్ పిట్స్ అని పిలుస్తారు. ఇక్కడికి మనుషులు వెళ్లి ఉండలేరు. కానీ కొన్ని రకాల చిన్న చిన్న జీవులు ఉంటాయి. అంటే ఆ వాతావరణానికి అనుగుణంగా అవి పరిణామం చెందాయి.

Advertisement

Next Story