రిమోట్ కంట్రోల్ పురుగులు.. స్టాప్ అండ్ గో లైట్స్‌ను ఫాలో అవుతున్నాయే!!

by Hamsa |   ( Updated:2022-11-29 14:11:40.0  )
రిమోట్ కంట్రోల్ పురుగులు.. స్టాప్ అండ్ గో లైట్స్‌ను ఫాలో అవుతున్నాయే!!
X

దిశ, ఫీచర్స్: ఇకపై పురుగులను రిమోట్ కంట్రోల్ చేయొచ్చు అంటున్నారు జపాన్ శాస్త్రవేత్తలు. ఇందుకు సంబంధించిన టెక్నాలజీని కూడా ప్రదర్శించిన వారు.. జీవుల్లోకి లైట్ సెన్సిటివ్ ప్రోటీన్‌లను అమర్చడం ద్వారా ఇది సాధ్యమవుతుందని తెలిపారు. గ్రీన్ లైట్‌ వేస్తే మూవ్ అయ్యేలా, యూవీ కాంతి కింద ఆగిపోయేలా ఈ టెక్నాలజీ వర్క్ చేస్తోందన్నారు.

కాంతి లేదా రసాయనాల వంటి విభిన్న ఉద్దీపనలకు జీవులు ప్రతిస్పందించగలిగినప్పుడు.. సులభంగా ఆహారాన్ని కనుగొనడం, ప్రమాదాలను నివారించడం చేయొచ్చని తెలిపారు. సెన్సారీ సిస్టెమ్‌ను హ్యాక్ చేయడం వలన రిమోట్-కంట్రోల్ 'సైబోర్గ్‌(ఆర్గానిక్ అండ్ బయోమెకాట్రానిక్ శరీర భాగాలతో కూడిన జీవి)'లను సృష్టించవచ్చని వివరించారు. ఉదాహరణకు బొద్దింకలు వాటి యాంటెన్నాను విద్యుత్‌తో ప్రేరేపించడం ద్వారా నడిపించబడతాయి. తద్వారా అవి సహజంగా గ్రహించిన అడ్డంకి నుంచి దూరంగా ఉంటాయి.

ఇందుకోసం ఒసాకా మెట్రోపాలిటన్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ట్రిగ్గర్‌గా 'ఆప్సిన్స్' అనే ప్రోటీన్స్ ఉపయోగించారు. ఇవి కాంతి యొక్క వివిధ తరంగదైర్ఘ్యాలకు సెన్సిటివ్‌గా ఉంటాయి. 'ఆప్టోజెనెటిక్స్(లైట్ ద్వారా న్యూరాన్స్ లేదా ఇతర కణాల యాక్టవిటీని కంట్రోల్ చేసే టెక్నాలజీ)'తో అనుసంధానించబడిన ఇతర న్యూరోలాజికల్ సర్క్యూట్‌లను సెట్ చేయగల సంకేతాలను పంపడం ద్వారా ప్రతిస్పందిస్తాయి. ఈ సాంకేతికతతో 'సి. ఎలిగాన్స్' అని పిలువబడే చిన్న పురుగుల కదలికలను నేరుగా నియంత్రించే ప్రయత్నం చేసిన శాస్త్రవేత్తలు.. వీటిలోకి రెండు 'ఆప్సిన్స్'ను అమర్చారు. ఇందులో ఒకటి దోమలలో ఉద్భవించింది కాగా ఇది జీవులు ఉద్దీపన నుంచి దూరంగా ఉండేలా చేసే ఇంద్రియ కణాలలో ఉంచబడింది. ఇక రెండో ఆప్సిన్ లాంప్రేస్ నుంచి తీసుకోబడింది.. UV కాంతికి సున్నితంగా ఉండే దీన్ని పురుగుల మోటారు న్యూరాన్లలో అమర్చారు.

ఈ ప్రయోగంలో ఆకుపచ్చ కాంతికి ఎక్స్‌పోజ్ అయినప్పుడు పురుగులు కదలడం, UV కింద పూర్తిగా ఆగిపోవడం గుర్తించిన శాస్త్రవేత్తలు.. ఇది పదే పదే పని చేయగలదని కనుగొన్నారు. అంటే లైట్‌కు ఎన్నిసార్లు ఎక్స్‌పోజ్ అయినా సరే ప్రోటీన్లు నాశనం కావడం లేదని అర్థం. కాంతి యొక్క వివిధ రంగుల క్రింద విభిన్న విధులను నిర్వహించే ఆప్టోజెనెటిక్ సిగ్నలింగ్ సిస్టమ్‌లను రూపొందించడానికి ఈ సాంకేతికతను ఉపయోగించవచ్చని ఈ ఎక్స్‌పరిమెంట్ సూచిస్తోంది. ఈ అధ్యయనం ఇంద్రియ వ్యవస్థల జీవశాస్త్రాన్ని అర్థం చేసుకోవడంలో పురోగతి అని, కొత్త ఔషధ ఆవిష్కరణలకు దారితీయవచ్చని బృందం పేర్కొంది.

'మేము ఉపయోగించిన దోమ మరియు లాంప్రే ఆప్సిన్‌లు రెండూ G ప్రోటీన్-కపుల్డ్ రిసెప్టర్ (GPCR) గ్రాహకాల కుటుంబానికి చెందినవి. వాసన, రుచి, హార్మోన్లు మరియు న్యూరోట్రాన్స్‌మిటర్‌లతో సహా వివిధ ఉద్దీపనలను గ్రహించడానికి ఉపయోగిస్తారు. ఈ వ్యవస్థ కాంతిని ఉపయోగించవచ్చని నిరూపిస్తుంది. వివిధ GPCRలను వాటి తదుపరి కణాంతర సిగ్నలింగ్ మరియు ఫిజియోలాజికల్ ప్రతిస్పందనలను మార్చటానికి ఉపయోగించబడుతుంది' అని అధ్యయన ప్రధాన రచయిత ప్రొఫెసర్ మిత్సుమాసా కోయనగి తెలిపారు.

READ MORE

ఆవులకు అందాల పోటీలు.. ర్యాంప్ వాక్ చేస్తూ హొయలు.. ఫొటోలు వైరల్

Advertisement

Next Story

Most Viewed