ఆవు మూత్రంతో కొత్త రంగులు.. దీని ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

by Disha Web Desk 20 |
ఆవు మూత్రంతో కొత్త రంగులు.. దీని ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
X

దిశ, ఫీచర్స్ : హిందూ మతంలో గోమూత్రాన్ని పవిత్రంగా భావించినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా దీనికి డిమాండ్ ఉంది. ఆవు మూత్రంలో వైద్యపరమైన ప్రయోజనాలతో పాటు, ఆవు మూత్రాన్ని ప్రత్యేకమైన రంగుల తయారీలో కూడా ఉపయోగిస్తారని చాలా తక్కువ మందికి తెలుసు. ఈ ఛాయను ‘ఇండియన్ ఎల్లో’ అంటారు. మొఘల్ కాలంలో రూపొందించిన సూక్ష్మ చిత్రాల నుండి విన్సెంట్ వాన్ గోహ్ 'ది స్టార్రీ నైట్' వంటి ప్రసిద్ధ చిత్రాల వరకు ఈ రంగులను వినియోగించేవారట.

పూర్వకాలంలో రంగులను తయారు చేయడం అంత సులభం కాకపోయేది. ఆ సమయంలో సింథటిక్ రంగులను తయారు చేసే సాంకేతికత లేదు. అందుకే మొక్కలు, విలువైన ఖనిజాల నుండి వివిధ రంగులను తయారు చేసేవారు. అయితే 'ఇండియన్ ఎల్లో' ని తయారు చేయడానికి ఒక ప్రత్యేక మార్గం ఉంది.

ఇండియన్ ఎల్లో ఎలా తయారవుతుంది ?

భారతీయ పసుపును ప్రపంచానికి అందించిన ఘనత ప్రముఖ రచయిత త్రిలోకీనాథ్ ముఖోపాధ్యాయకు దక్కింది. అతను తయారు చేసిన నివేదిక 1883లో సొసైటీ ఆఫ్ ఆర్ట్స్, లండన్‌లో ప్రచురించారు. బీహార్‌లోని గ్రామాల ప్రజలు ఆవుల నుండి ప్రత్యేకమైన పసుపు రంగును ఎలా తయారు చేస్తారో నివేదికలో అతను పూర్తివివరాలను అందించాడు.

నివేదిక ప్రకారం ముంగేర్‌లోని గోరక్షకులు పసుపు రంగును తయారు చేయడానికి ఆవులకు మామిడి ఆకులు, నీరు మాత్రమే పెట్టేవారు. దీని కారణంగా ఆవు శరీరంలో పిత్త వర్ణద్రవ్యం మొత్తం పెరిగేది. దీని కారణంగా ఆవు మూత్రం రంగు పసుపు రంగులోకి మారుతుంది. ఆవులను ఎక్కువ సేపు ఆకలితో ఉంచి అవి మామిడి ఆకులను తినేలా చేసేవారట.

ఆవులు రోజుకు నాలుగు సార్లు మూత్ర విసర్జన చేసే విధంగా శిక్షణ ఇచ్చారట. ఆవుల మూత్రాన్ని మట్టి కుండల్లో సేకరించి రాత్రంతా ఉడకబెట్టేవారట. ఉదయం నాటికి ద్రవం ఘనీభవించి పసుపు పదార్థం తయారయ్యేదని నివేదికలు చెబుతున్నాయి. ఆ తర్వాత గోరక్షకులు దానిని వడపోసి ఎండబెట్టి చిన్నచిన్న బంతులను తయారు చేసి ‘పియూరి’ పేరుతో మార్కెట్‌లో విక్రయిస్తారు.

యూరప్‌కు ఎగుమతులు..

వ్యాపారవేత్తలలో ఈ బంతులకు చాలా డిమాండ్ ఉంది. వారు కలకత్తా, పాట్నాలో ఈ రంగును విక్రయించేవారు. అక్కడ నుండి దానిని యూరప్‌కు ఎగుమతులు చేసేవారట. పాల వ్యాపారుల నుంచి రూ.1కి కొనుగోలు చేసిన పైరీని కలకత్తాలో రూ.100కి విక్రయించినట్లు నివేదికలో పేర్కొంది. చిత్రకారులు పెయింటింగ్‌లో పియూరిని ఉపయోగించేందుకు ప్యాలెట్‌లో తీసుకుని, నీరు లేదా నూనెతో కలిపి తమ అవసరాన్ని బట్టి పెయింటింగ్‌ను తయారు చేసేవారు. దాని ప్రత్యేకమైన రంగు మధ్యయుగ ఐరోపా చిత్రకారులలో బాగా ప్రాచుర్యం పొందింది. విన్సెంట్ వాన్ గోహ్ 'ది స్టార్రీ నైట్'లోని పసుపు చంద్రుడు, ఆంగ్ల చిత్రకారుడు జోసెఫ్ మల్లోర్డ్ విలియం టర్నర్ పెయింటింగ్‌లోని సూర్యకాంతి ఈ భారతీయ పసుపు రంగు కారణంగా కనిపిస్తాయి.

పసుపు రంగును తయారు చేసే క్రమంలో ఆవులను హింసిస్తున్నారని ముఖోపాధ్యాయ నివేదిక పేర్కొంది. అతని వివరణను చదివిన తరువాత ఈ రంగుల తయారీ 1908లో నిషేధించారు. ఆవులకు బదులుగా ఆధునిక రసాయనాలను ఉపయోగించి పసుపు రంగును సిద్ధం చేశారు.


Next Story