బిర్యానీ మసాలా కొంటున్నారా? ఇంట్లోనే ఇలా చేసుకుంటే రుచి అదిరిపోతుందంతే!

by Anjali |
బిర్యానీ మసాలా కొంటున్నారా? ఇంట్లోనే ఇలా చేసుకుంటే రుచి అదిరిపోతుందంతే!
X

దిశ, ఫీచర్స్: బిర్యానీని ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు. మన దేశంలో 99 శాతం మంది బిర్యానీని ఎంతో ఇష్టంగా తింటారు. కొంతమందికైతే ప్రతి రోజూ తిన్నా కూడా బోర్ కొట్టదు. బిర్యానీకి అంతలా ఫ్యాన్స్ ఉంటారు మరీ. ఇక హైదరాబాద్ బిర్యానీ గురించైతే ఎంత చెప్పినా తక్కువే. ఏ వేడుక వచ్చినా బిర్యానీ ఆర్డర్లు హోరెత్తిపోతాయి.

కొంతమంది బిర్యానీని ఇంట్లోనే ఎంతో రుచికరంగా తయారు చేస్తారు. కానీ ఇందులో వేసే బిర్యానీ మసాలా మాత్రం బయట నుంచి కొనుక్కొచ్చి.. వేస్తారు. అయితే ఇకపై మీరు బిర్యానీ మసాలాను బయటి నుంచి కొనుక్కొచ్చే అవసరం లేదు. ఈజీగా ఇంట్లోనే ఎంతో టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఒక్కసారి చేసుకుంటే 6 నెలల పాటు అలాగే ఉంటుంది. బిర్యానీ మసాలా తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం..

బిర్యానీ మసాలా రెసిపీకి కావలసిన పదార్థాలు:

బిర్యానీ ఆకులు - 4,

మిరియాలు - 2 స్పూన్లు

జాజికాయ - 1

మరాఠీ మొగ్గలు - 5

సోంపు గింజలు - 2 స్పూన్లు

దాల్చిన చెక్క - పెద్ద ముక్క

జీలకర్ర - 4 స్పూన్లు

యాలకులు - 20

అనాసపువ్వు - 6

జాపత్రి - 4

లవంగాలు - 25

షాజీరా - 2 స్పూన్లు

ధనియాలు - అర కప్పు

బిర్యానీ మసాలా రెసిపీ

బిర్యానీ మసాలా తయారీ విధానం:

ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టి మరాఠీ మొగ్గలు, జాజికాయ, జాపత్రి, ధనియాలు, అనాసపువ్వు వేయించాలి. తర్వాత షాజీరా, లవంగాలు , మిరియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క ముక్క, సోంపు గింజలు కూడా వేసి వేయించాలి. లాస్ట్‌లో బిర్యానీ ఆకులు కూడా వేయించాలి. వేయించిన పదార్థాలను ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పదార్థాలను మిక్సీ జార్ లో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని గాలి చొరబడని డబ్బాలో వేసి పెట్టుకుంటే 6 నెలల పాటు తాజాగా ఉంటుంది. మూత తీసి ఉంచినట్లైతే పాడైపోయే అవకాశం ఉంది. అలాగే సువాసన కూడా బయటికి పోతుంది. ఈ పొడిని సాధారణ ఫ్రిజ్లో పెట్టండి. ఇక మీరు బిర్యాని వండినప్పుడు 2 స్పూన్లు బిర్యానీలో యాడ్ చేస్తే బిర్యానీ రుచి అదిరిపోతుంది అంతే.

Advertisement

Next Story