ఇడ్లీ తింటే క్యాన్సర్.. నివేదికలో విస్తుపోయే వాస్తవాలు

by Sujitha Rachapalli |   ( Updated:2025-02-28 09:18:04.0  )
ఇడ్లీ తింటే క్యాన్సర్.. నివేదికలో విస్తుపోయే వాస్తవాలు
X

దిశ, ఫీచర్స్ : హెల్తీయెస్ట్ బ్రేక్ ఫాస్ట్ ఏది అంటే వెంటనే ఇడ్లీ అనే చెప్పేస్తాం. కారణం సులభంగా జీర్ణం అవుతుంది. తయారీకి నూనె, మసాలాలు అవసరం లేదు. అందుకే పేషెంట్స్‌కు కూడా డాక్టర్లు ఆరోగ్యకరమైన ఆహారంగా సూచిస్తారు. కానీ ఇప్పుడు ఈ ఫుడ్ క్యాన్సర్‌కు కారణమవుతుందని హెచ్చరిస్తుంది కర్ణాటక ఆహార భద్రతా విభాగం. దీన్ని తయారు చేసే విధానంలో లోపమే ఇందుకు కారణంగా మారింది.

ముఖ్యంగా హోటల్స్ ఇలాంటి విధానాన్ని ఫాలో అవుతున్నాయని తేల్చింది. సుమారు 251 హోటళ్ళు, రోడ్‌సైడ్ విక్రేతల వద్ద 500 ఇడ్లీల నమూనాలను బెంగళూరులోని ఆరోగ్య శాఖ అధికారులు సేకరించారు. రిజల్ట్స్‌లో 51 నమూనాలు సురక్షితం కాదని గుర్తించారు. నివేదికల ప్రకారం వాటిలో క్యాన్సర్ కారక పదార్థాలు ఉన్నాయని, వినియోగదారులకు క్యాన్సర్ వచ్చే అవకాశం అధికంగా ఉందని సూచిస్తున్నారు.

ఇడ్లీ పిండిని సాంప్రదాయకంగా తాజా కాటన్ బట్టలపై పెట్టి.. తరువాత వాటిని ఇడ్లీ పాన్‌లపై ఉంచి ఆవిరితో వండుతారు. అయితే అనేక హోటళ్ళు, వీధి వ్యాపారులు ఇప్పుడు కాటన్ షీట్లకు బదులుగా ప్లాస్టిక్ షీట్లను ఉపయోగిస్తున్నారు. ఈ ప్లాస్టిక్స్ వేడి చేసినప్పుడు రసాయనాలను ఉత్పత్తి చేస్తాయని.. వాటిలో కొన్ని క్యాన్సర్ కారకమైనవి కావచ్చని అధికారులు చెబుతున్నారు. చాలా ప్లాస్టిక్ షీట్లలో బిస్ఫినాల్ ఎ (బిపిఎ), థాలేట్లు, ఇతర ఎండోక్రైన్-అంతరాయం కలిగించే రసాయనాలు ఉంటాయి. ఇవి వేడి చేసినప్పుడు ఆహారంలోకి శోషించబడతాయి. కాలక్రమేణా శరీరంలో పేరుకుపోయే టాక్సిన్స్, మైక్రోప్లాస్టిక్‌లను విడుదల చేస్తుంది. రొమ్ము, ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ రసాయనాలు హార్మోన్ల అసమతుల్యత, జీవక్రియ రుగ్మతలతో కూడా ముడిపడి ఉన్నాయని గుర్తించిన అధికారులు.. దీనివల్ల సంతానోత్పత్తిపై కూడా ప్రభావం ఉండొచ్చని హెచ్చరిస్తున్నారు.

Next Story

Most Viewed