హైదరాబాద్‌లో చిన్నారులు, మహిళల కోసం ప్రత్యేక 'థీమ్‌పార్క్'!

by GSrikanth |
హైదరాబాద్‌లో చిన్నారులు, మహిళల కోసం ప్రత్యేక థీమ్‌పార్క్!
X

దిశ, ఫీచర్స్ : హైదరాబాద్‌, కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ (KPHP)- ఫేజ్ 3లో పూర్తిగా మహిళలు, పిల్లల (10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు)కోసమే ప్రత్యేక థీమ్ పార్క్ ఏర్పాటు చేశారు. నడక మార్గాలు, పిల్లల కోసం ఆట స్థలాలు, యోగాకు అనువైన ప్రదేశం, జిమ్ సౌకర్యాలు, కిట్టీ పార్టీలకు బహిరంగ స్థలం మొదలగు సౌకర్యాలున్న ఈ పార్క్‌ను ఇటీవలే ప్రారంభించారు.

మహిళలు, పిల్లలకు ప్రత్యేకంగా అంకితం చేసిన మొట్టమొదటి థీమ్ పార్కుగా దీన్ని అభివర్ణిస్తున్నారు. పార్క్ భూసేకరణ, నిర్మాణం కోసం కేపీహెచ్‌బీ, జీహెచ్‌ఎమ్‌సీ సంయుక్తంగా ఖర్చు పెట్టాయి. హౌసింగ్ బోర్డుకు చెందిన 1.5 ఎకరాల విస్తీర్ణంలో ఈ పార్క్ నిర్మించగా.. పిల్లల కోసం జిమ్, ప్లే ఏరియాలను అభివృద్ధి చేయడంలో కార్పొరేషన్ తన ప్రయత్నాన్ని చేసింది. చిన్న వ్యాపారాలు నిర్వహించే మహిళా పారిశ్రామికవేత్తలు ఎగ్జిబిషన్ కోసం అనువైన వేదికను కూడా ఏర్పాటు చేశారు. అంతేకాదు మహిళలకు హ్యాండ్‌బ్యాగ్స్, ఎంబ్రాయిడరీ తదితర ఉత్పత్తులను తయారు చేయడంలో శిక్షణ ఇవ్వాలని కార్పొరేషన్ యోచిస్తోంది. స్వచ్ఛమైన గాలి కోసం దాదాపు 250 మొక్కలు నాటారు.

ఎల్‌బీ నగర్, శేర్‌లింగంపల్లిలో ఇదే రకమైన సౌకర్యాలతో థీమ్ పార్క్స్ రూపొందించనున్నట్లు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) అధికారులు పేర్కొన్నారు. ఈ రెండు పార్కులు కాకుండా ఎల్‌బీ నగర్‌ మండలంలో 11కు పైగా థీమ్‌ పార్కులు త్వరలోనే నిర్మించనున్నామని జీహెచ్‌ఎంసీ అధికారి కె. రాజయ్య తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed