లవ్ ఓవర్ లోడ్.. బంధాల విచ్ఛిన్నానికి దారితీస్తున్న అతి ప్రేమ !

by Dishafeatures2 |
లవ్ ఓవర్ లోడ్.. బంధాల విచ్ఛిన్నానికి దారితీస్తున్న అతి ప్రేమ !
X

దిశ, ఫీచర్స్ : ప్రేమ ఎంత మధురంగా ఉంటుందో.. అర్థం చేసుకోలేని పరిస్థితులు ఎదురైనప్పుడు అంతకంటే బాధగానూ ఉండవచ్చు. మరికొన్ని సార్లు కఠినంగానూ మారవచ్చు. పరస్పర అవగాహనతో మసలుకున్నప్పుడు ఆనందంగా అనిపించిన ప్రేమ, పలు విషయాల్లో అవగాహన లేమి ఏర్పడినప్పుడు, అర్థం చేసుకోలేనప్పుడు ఆందోళనగా మారవచ్చు. అనవసర వాదనలకు, తగాదాలకు దారితీయవచ్చు. వాస్తవానికి ప్రేమ సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఇలాంటి ఇబ్బందులేవీ ఉండవు. కానీ అది ‘అతి ప్రేమ’గా మారినప్పుడే ఒకరిపై నియంత్రణ ప్రారంభం అవుతుందని, అనుమానాలకు, అపార్థాలకు దారితీస్తుందని నిపుణులు అంటున్నారు.

ఆందోళనగా మారుతున్న ప్రేమ

పెళ్లయ్యాక లేదా ప్రేమలో పడ్డ కొంత కాలానికి పలువురు బ్యాచిలర్‌ లైఫే బాగుండేదని ఒక్కసారైనా అనుకుంటారట. ఎందుకంటే గతంతో పోల్చుకున్నప్పుడు ప్రస్తుతత జీవితం కాస్త అసౌకర్యంగా అనిపిస్తుందట. పైగా ఎక్కడికి వెళ్లినా? ఏం చేసినా? ఎందుకు వెళ్తున్నారు? ఎప్పుడు వస్తారు? ఎందుకలా చేస్తున్నారు? వంటి ప్రశ్నలు భాగస్వామి నుంచి తరచుగా ఎదురవుతుంటాయి. పేరెంట్స్ కానీ, కుటుంబ సభ్యుల్లో ఇంకెవరు కానీ ఇలాంటి ప్రశ్నలు అడిగితే మాత్రం పెద్ద సమస్యగా అనిపించదు. కానీ అదే ప్రశ్న భాగస్వామి పదే పదే అడగినప్పుడు ఒక విధమైన ఆందోళన కలుగుతుందని 40 ఏండ్లలోపు వ్యక్తుల్లో 25 శాతం మంది పేర్కొంటున్నట్లు ఇటీవల యూఎస్ కేంద్రంగా నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైంది.

ప్రేమ, బాధ్యత, మార్పు..

భాగస్వామి లేదా ప్రేమించిన వ్యక్తి నుంచి అనేక సందర్భాల్లో ఎదురయ్యే ప్రశ్నలు తమను ఇంటరాగేషన్ చేస్తున్నట్లు, అవమానిస్తున్నట్లు అనిపిస్తుంటాయని పలువురు అంగీకరించినట్లు నిపుణుల సర్వేలో తేలింది. అయితే దీనిని ఒక సమస్యగా మాత్రం బాధితులు పరిగణించట్లేదు. మనసులో బాధగా అనిపంచినప్పటికీ.. అది భాగస్వాముల మధ్య బాధ్యతగా, ప్రేమగానే అర్థం చేసుకుంటున్నారు. కాకపోతే పరిస్థితిని మార్చాలని అనుకుంటారు. ప్రేమించే వ్యక్తి గురించి మొత్తం తెలుసుకోవాలని, వారు తమకు అనుకూలంగా ఉండాలని కోరుకుంటారు. ఇక్కడే ప్రేమకాస్త అతి ప్రేమగా, వ్యక్తిగత స్వార్థంగా మారిపోతుంది. అలా జరిగినప్పుడు మనస్పర్థలు, అనుమానాలకు కారణం కావచ్చునని నిపుణులు చెప్తు్న్నారు.

చికాకు తెప్పించే ప్రవర్తన

ప్రేమ ఉండాలే కానీ అతి ప్రేమ వల్ల కొన్నిసార్లు నష్టమే జరుగుతుందని నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే ప్రేమ ఎక్కువైనప్పుడు స్వార్థం పెరుగుతుందని, ఎదుటి వ్యక్తిపై నియంత్రణకు దారితీస్తుందని అంటున్నారు. ఈ సందర్భంలోనే భాగస్వాముల్లో తగాదాలు వస్తాయి. ఒకరి ప్రవర్తన ఎదుటి వ్యక్తికి చికాకు తెప్పించేదిగా మారుతుంంది. ఉదాహరణకు తన ప్రియుడు లేదా ప్రియురాలు ఎక్కడికి వెళ్లినా తాను కూడా వస్తాననడం, తరచుగా ఎందుకు? ఏమిటి? అని గుచ్చి గుచ్చి అడగడం, ‘ఐ నీడ్ స్పేస్’ అనే మాటను కూడా అపార్థం చేసుకోవడం వంటివి జరిగిపోతుంటాయి. దీంతోపాటు తరచుగా మెసేజెస్ పెట్టడం, ప్రతి దానికీ ఫోన్ చేయడం కూడా అతి ప్రేమ ధోరణుల్లో ఒకటిగా నిపుణులు పేర్కొంటున్నారు. కొందరైతే ప్రతి రోజూ గుడ్ మార్నింగ్, గుడ్‌నైట్, హావ్ ఏ నైస్ డే వంటి మెసేజెస్‌‌తోనే రోజును గడిపేస్తుంటారు. అవసరమా.. లేదా? అని ఆలోచించకుండా ప్రతి చిన్న విషయానికి సందేశాలు, కొటేషన్‌లు, ఎమోజీలు పంపడం వంటివి చేస్తుంటారు. ఎదుటి వ్యక్తి రిప్లై ఇవ్వకపోతే ఆందోళన చెందడం, అనుమానించడం చేస్తుంటారు. ఈ అతి ప్రేమ ధోరణులు దీర్ఘకాలంపాటు కొనసాగితే ప్రేమకు బదులు చికాకు, అసహ్యం వంటివి ఏర్పడవచ్చు. బంధాలను విచ్ఛిన్నం చేయవచ్చు. కాబట్టి అతి ప్రేమ కూడా అనర్థదాయకమనే విషయాన్ని గుర్తించాలంటున్నారు నిపుణులు.



Next Story

Most Viewed