బియ్యానికి పురుగులు ప‌ట్టకూడదంటే ఇలా చేయండి...

by Sridhar Babu |   ( Updated:2023-06-29 09:12:04.0  )
బియ్యానికి పురుగులు ప‌ట్టకూడదంటే ఇలా చేయండి...
X

దిశ, వెబ్​డెస్క్​ : మ‌నం నిత్యం ఉపయోగించే బియ్యంలో పురుగు కనిపిస్తే అదోలా ఉంటుంది. వేల రూపాయలతో కొనుగోలు చేసినా, లేక మన పొలంలో పండిన ధాన్యాన్ని బియ్యం పట్టించి నిల్వ ఉంచినా పురుగు వస్తుంటుంది. ఈ పురుగులు విస‌ర్జించే వ్య‌ర్థాలు, మ‌లినాలు బియ్యానికి ప‌డ‌తాయి. ఇలాంటి బియ్యాన్ని వండుకుని తింటే లేనిపోని రోగాల బారిన ప‌డే అవ‌కాశాలు కూడా ఉంటాయి. క‌నుక మ‌నం బియ్యంలో పురుగులు ప‌డ‌కుండా నిల్వ చేసుకోవాలి. మార్కెట్ లో పురుగు ప‌ట్ట‌కుండా చూసే పౌడ‌ర్ లు దొరుకుతుంటాయి. ఈ పౌడ‌ర్ ను బియ్యంలో క‌ల‌ప‌డం వ‌ల్ల బియ్యం పురుగు ప‌ట్ట‌కుండా ఉంటుంది. కానీ ఇలా ర‌సాయ‌నాలు క‌లిగిన పౌడ‌ర్ ను వాడ‌డం వ‌ల్ల శ‌రీరానికి హాని క‌లుగుతుంద‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు. అలాంటప్పుడు ఇంటి చిట్కాల‌ను ఉప‌యోగించి పురుగుపట్టకుండా చూసుకోవచ్చు.

పురుగు రావడానికి కారణాలు

బియ్యం పురుగుప‌ట్ట‌డానికి చాలా కార‌ణాలు ఉంటాయి. అందులో తేమ కూడా ఒక‌టి. బియ్యం నిల్వ చేసిన ప్ర‌దేశం చుట్టూ లేదా ఆ ప్ర‌దేశంలో తేమ ఉండ‌డం వ‌ల్ల బియ్యం పురుగు ప‌ట్టే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. క‌నుక బియ్యాన్ని నిల్వ చేసే ప్ర‌దేశం చుట్టూ తేమ లేకుండా చూసుకోవాలి.

ఇంగువ‌ మూటలు కట్టి...

ఇంగువ‌ను ఉప‌యోగించి కూడా మ‌నం బియ్యం పురుగు ప‌ట్ట‌కుండా చేయ‌వ‌చ్చు. దీని ఘాటైన వాస‌న కార‌ణంగా బియ్యానికి పురుగులు ప‌ట్ట‌కుండా ఉంటాయి. ఇంగువ ముక్క‌ల‌ను లేదా పొడిని చిన్న చిన్న మూట‌లుగా క‌ట్టి బియ్యంలో అక్క‌డ‌క్క‌డ ఉంచాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల బియ్యం పురుగు ప‌ట్టకుండా ఉంటుంది. క‌ర్ఫూరాన్ని కూడా పల్చటి గుడ్డలో కట్టి బియ్యంలో వేస్తే పురుగులు ప‌ట్ట‌కుండా ఉంటాయి. బియ్యం పురుగు ప‌ట్ట‌కుండా చేయ‌డంలో వేపాకు ఎంతో సహాయ‌ప‌డుతుంది. బియ్యాన్ని నిల్వ చేసుకునే డ‌బ్బా అడుగు భాగాన వేపాకును ఉంచి ఈ వేపాకుపై బియ్యాన్ని పోయాలి. లేదా వేప చెట్టు ఆకుల పొడిని మూట‌లుగా క‌ట్టి బియ్యంలో ఉంచాలి. ఇలా చేయ‌డం వల్ల కూడా బియ్యం పురుగు ప‌ట్ట‌కుండా ఉంటుంది. కాకపోతే దీనిని జాగ్రత్తగా చేయాలి. లేకపోతే ఆ పొడి బియ్యంలో కలిసి అన్నం చేదు వస్తుంది.

వెల్లుల్లితో...

వెల్లుల్లి రెబ్బ‌ల పొట్టు తీసి బియ్యంలో ఉంచ‌డం వల్ల బియ్యం పురుగు ప‌ట్ట‌కుండా ఉంటుంది. బియ్యం పురుగుప‌ట్ట‌కుండా చేయ‌డంలో ల‌వంగాలు స‌మ‌ర్థ‌వంతంగా ప‌ని చేస్తాయి. బియ్యంలో ల‌వంగాల‌ను ఉంచ‌డం వల్ల లేదా ల‌వంగాల పొడిని వస్త్రంలో క‌ట్టి బియ్యంలో ఉంచ‌డం వ‌ల్ల కూడా పురుగు ప‌ట్ట‌కుండా ఉంటుంది.

ఉప్పుతో ఎంతో ప్రయోజనం

ఒక వ‌స్త్రంలో గుప్పెడు ఉప్పును ఉంచి మూట‌గా క‌ట్టి బియ్యంలో ఉంచ‌డం వ‌ల్ల పురుగులు ప‌ట్ట‌కుండా ఉంటాయి. ఇలా పురుగులు ప‌ట్టిన బియ్యంలో ఉంచినా కూడా పురుగులు తొల‌గిపోతాయి. ఎండ‌బెట్టిన కాక‌ర‌కాయ ముక్క‌ల‌ను లేదా వాటి పొడిని మూట‌గా క‌ట్టి బియ్యంలో ఉంచ‌డం వ‌ల్ల పురుగు ప‌ట్టకుండా ఉంటుంది.

Read More: సగ్గుబియ్యంతో సంపూర్ణ ఆరోగ్యం

Advertisement

Next Story

Most Viewed