Death Calculator : మరణం..! ఎప్పుడు సంభవిస్తుందో కూడా తెలుసుకోవచ్చు!!

by Javid Pasha |   ( Updated:2024-12-02 08:16:50.0  )
Death Calculator : మరణం..! ఎప్పుడు సంభవిస్తుందో కూడా తెలుసుకోవచ్చు!!
X

దిశ, ఫీచర్స్ : వాన రాకడ, ప్రాణం పోకడ గురించి ఎవరూ అంచనా వేయలేరు అంటుంటారు పెద్దలు. కానీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక చాలా మర్పులు వస్తున్నాయి. గతంలో మానవులు అసాధ్యం అనుకున్న ఎన్నో విషయాలు కూడా ప్రస్తుతం సుసాధ్యమని పరిశోధనలు నిరూపిస్తున్నాయి. అలాంటి మరో పరిణామమే ‘ఏఐ డెత్ కాలిక్యులేటర్’. పరిశోధనలో భాగంగా ఎలక్ట్రో కార్డియోగ్రామ్స్ లేదా ఈసీజీని ఉపయోగించి భవిష్యత్తులో ఒక వ్యక్తి మరణాన్ని కూడా అంచనా వేయగల ఈ టెక్నాలజీని ఇప్పుడు శాస్త్రవేత్తలు డెవలప్ చేశారు.

‘లాన్సెట్ డిజిటల్ హెల్త్’‌లో పబ్లిషైన అధ్యయన వివరాల ప్రకారం.. హెల్త్ ప్రాబ్లమ్స్‌ను ముందుగానే గుర్తించి తగిన అంచనాలతోపాటు పరిష్కారాలు సూచించగల ‘ఏఐ- ఈసీజీ రిస్క్ ఎస్టిమేటర్’ అనే కొత్త టూల్‌ను పరిశోధకులు రూపొందించారు. దీనిని ‘ఏఐ డెత్ కాలిక్యులేటర్’ అని కూడా పిలుస్తున్నారు. ఈ ఏఐ పవర్డ్ ఎలక్ట్రో కార్డియోగ్రామ్‌ను ఒక వ్యక్తి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు ఉపయోగిస్తారు. అప్పుడది ఆ వ్యక్తి తాలూకు ఆరోగ్య వివరాలతో పాటు మరణం సంభవించే అవకాశాన్ని, కాలాన్ని కూడా అంచనా వేస్తుందని పరిశోధకులు పేర్కొంటున్నారు.

మరో ఐదేళ్లలో..

కొత్తగా రూపొందించిన ఏఐ డెత్ కాలిక్యులేటర్ ఒక వ్యక్తికి అప్పుడున్న అనారోగ్యాన్ని, శారీరక లక్షణాలను బట్టి రాబోయే గుండె వైఫల్యాన్ని, మరణాన్ని అంచనా వేస్తున్నప్పటికీ, చివరి దశ ట్రయల్స్ వంటివేమీ జరగలేదు. కాబట్టి ఇప్పటికిప్పుడు అందుబాటులోకి వచ్చే చాన్స్ మాత్రం లేదంటున్నారు పరిశోధకులు. వచ్చే సంవత్సరం యూకే హెల్త్ ఆర్గనైజేషన్ సర్వీస్ పరిధిలోని రెండు ఆస్పత్రుల్లో ఈ టెక్నాలజీకి సంబంధించిన ట్రయల్స్ జరుగుతాయని, రాబోయే మరో ఐదేళ్లలో ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి రావచ్చునని రీసెర్చర్స్ అంచనా వేస్తున్నారు.

ఎలా పనిచేస్తుంది?

ఏఐ డెత్ కాలిక్యులేటర్ ‘ఎలక్ట్రో కార్డియోగ్రామ్ (ఈసీజీ)’ టెస్ట్ సందర్భంగా గుండె పనితీరును క్షణాల్లో రికార్డ్ చేస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. పరిశోధనలో భాగంగా వీరు 1,89,539 మంది రోగులకు సంబంధించిన 1.16 మిలియన్ ఈసీజీ టెస్టుల డేటాసెట్‌ను యూజ్ చేస్తూ, ఏఐ టెక్నాలజీకి ట్రైనింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా సదరు ఏఐ డెత్ కాలిక్యులేటర్ 78 శాతం కచ్చితత్వంతో భవిష్యత్తులో సంభవించే గుండె వైఫల్యాలను, ఇతర అనారోగ్యాలను తద్వారా సంభవించే మరణాన్ని అంచనా వేసినట్లు పరిశోధకులు గుర్తించారు.

Advertisement

Next Story

Most Viewed