- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Officer's Choice పుట్టింటి పట్టుచీర.!

భరోసా..
బతికిస్తుంది.
భయాన్ని పోగొడుతుంది.
భద్రతను నేర్పిస్తుంది.
ఆ భరోసా లేకనే కొందరి జీవితాలు విఫలమౌతాయి.
భరోసా ఇవ్వడానికి డబ్బే ఖర్చు పెట్టాల్సిన పనిలేదు.
వీరిలా ట్రెండ్ సెట్‌చేసి.. గొప్ప మనసు చాటుకుంటే చాలు.!
దిశ, ఫీచర్స్:
కుటుంబ సభ్యుల్లా..
పుట్టింటొళ్లు మాత్రమే చేసేవి కొన్నుంటాయి. కాళ్లు కడిగి కన్యాదానం చేయడం.. సీమంతం.. తొలుసూరు కాన్పు.. బారసాల వంటివి. ఇదెప్పట్నుంచో వస్తున్న ఆచారం. అయితే.. కొందరికి ఆ అవకాశం ఉండదు. అమ్మానాన్న లేకపోవడం వల్లనో.. ఉన్నా మాటల్లేకపోవడం వల్లనో.. కుటుంబ పరిస్థితులో కారణమై పుట్టింటి భాగ్యానికి నోచుకోరు. సాటి ఆడబిడ్డ మనసేంటో తెలుసుకొని ఆ వెలితి లేకుండా అండగా నిలుస్తున్నారు కొందరు. వీరిలో ఉన్నతాధికారులు ఉన్నారు.. ఎమ్మెల్యేలున్నారు.. మంత్రులు.. ముఖ్యమంత్రులూ ఉన్నారు.
కన్యాదానం చేసిన కలెక్టర్
కరీంనగర్ బాలసదన్‌లో ఆశ్రయం పొందిన మౌనిక/పూజ మంథనికి చెందిన సాయితేజను మౌనిక ఇష్టపడింది. తల్లిదండ్రులు లేరాయె. ఎవరికి చెప్పుకోవాలి.? చిన్నప్పటి నుంచి తమ బాధ్యత చూస్తున్నది బాలసదన్ అధికారులే కాబట్టీ వాళ్లతో చెప్పింది. వాళ్లు సాయితేజ ఇంటికి వెళ్లి మాటముచ్చట చేసుకున్నారు. మార్చి 9కి ముహుర్తం ఫిక్స్. అనాథ అనే విషయం గుర్తు రాకుండా మెహందీ.. హల్దీ ఫంక్షన్ వంటివన్నీ చేశారు. పెళ్లికూతురుగా ముస్తాబు చేసి పెళ్లి మండపానికి తీసుకెళ్లారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కన్యాదానం చేసి పుస్తె మెట్టెలను అందించి.. మౌనిక పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపించారు.
సీమంతం చేసిన మంత్రి
హోమంత్రికి.. కానిస్టేబుల్‌కు కమ్యునికేషన్ ఏముంటుంది.? డీజీపీ స్థాయి అధికారులతోనే హోమంత్రి సమీక్షలు.. సమావేశాలు ఉంటాయి. కానీ ఏపీ హోమంత్రి వంగలపూడి అనిత ఒక మహిళా హోంగార్డును వెతుక్కుంటూ ఆమె ఇంటికి వెళ్లింది. ఏదో పలకరించడానికో.. పనిమీదనో కాదు. విశాఖజిల్లా ఎంవీపీ పోలీస్ స్టేషన్‌లో డ్యూటీచేసే రేవతికి సీమంతం చేయడానికి వెళ్లారు. రాష్ట్రానికి హోమంత్రి అయుండి ఒక సాధారణ కానిస్టేబుల్‌కు సీమంతం చేయడం గొప్ప విషయమే. పుట్టింటివారు తెచ్చినట్టే చీరె.. సారె పెట్టి రేవతిని సర్‌ప్రైజ్ చేసింది హోమంత్రి. ఇదికాస్త నెట్టింట్లో వైరలై పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
అంగన్వాడీల ఔదార్యం
ఎవరి స్థోమతకు తగ్గట్టు వాళ్లు ఇంట్లో కార్యాలు చేస్తుంటారు. ఆదివాసీ మహిళలు ఆడంబరాలకు దూరంగా ఉంటారు కాబట్టీ సీమంతాన్ని జరుపుకోరు. ఆ ఖర్చులు.. ఆ ఏర్పాట్ల వ్యవహారాలకు దూరంగా ఉంటేనే మంచిది అనే ఉద్దేశం వాళ్లది. కానీ.. గర్భందాల్చిన మహిళలకు సీమంతం మీద చిన్న కోరిక ఉంటుంది కదా.? మానవతా కోణంలో దీనిని చూశారు ములుగులోని కొందరు అంగన్వాడీ కార్యకర్తలు. ఆదివాసీ మహిళకు అందరూ కలిసి సీమంతం చేశారు. "మేం పుట్టింటివాళ్లం అనుకో.. ఏ ఇబ్బంది ఉన్నా మాకు చెప్పు.. నీకు పండంటి బిడ్డ పుట్టేదాక తోడుగా ఉంటాం" అని భరోసా కల్పించారు.
ట్రెండ్ సెట్టింగ్
కలెక్టర్ పమేలా సత్పతి.. హోం మినిష్టర్ వంగలపూడి అనిత.. ములుగు అంగన్వాడీలు మహిళగా సాటి ఆడబిడ్డ మనసేంటో గ్రహించి స్వచ్ఛందంగా పుట్టింటి ప్రేమను పంచారు. ఇవే కాదు.. ఇలాంటివి చాలాచోట్ల జరుగుతున్నాయి. ట్రెండ్‌సెట్ చేయాల్సినవి ఇవి కదా అనే ప్రశంసలు వస్తున్నాయి.