Body pains : ఎంతకీ తగ్గని బాడీ పెయిన్స్‌.. ఎక్కువ రోజులు కొనసాగితే ఏం జరుగుతుంది?

by Javid Pasha |
Body pains : ఎంతకీ తగ్గని బాడీ పెయిన్స్‌.. ఎక్కువ రోజులు కొనసాగితే ఏం జరుగుతుంది?
X

దిశ, ఫీచర్స్: శారీరక శ్రమ, పని ఒత్తిడి ఎక్కువైనప్పుడో, జర్నీలో అలసిపోయినప్పుడో కొందరికి కాళ్లు, చేతులు, మెడ, వీపు భాగాలు లాగుతుంటాయి. నొప్పితో ఇబ్బంది పడుతుంటారు. అయితే రెస్ట్ తీసుకోవడంవల్ల ఇవి తగ్గిపోతాయి. కానీ కొన్ని సందర్భాల్లో అసలుకే తగ్గవు. ఈ పరిస్థితి ఎక్కువరోజులు కొనసాగితే మాత్రం జాగ్రత్త పడాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. సరైన చికిత్స తీసుకోకపోతే మరింత నొప్పి, రిస్క్ పెరగవచ్చని చెప్తున్నారు.

లైఫ్ క్వాలిటీపై ఎఫెక్ట్

ప్రపంచ వ్యాప్తంగా బాడీ పెయిన్స్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది. ఒక నివేదిక ప్రకారం 1.5 బిలియన్ల మంది ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అయితే దీర్ఘాకలిక శరీర నొప్పి మాత్రం మొత్తం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఇది మీ రోజువారి కార్యకలాపాలను, జీవన నాణ్యతను తగ్గిస్తుందని అంటున్నారు. అంతేకాకుండా ఎక్కువ కాలం బాడీ పెయిన్స్ ఎదుర్కొంటన్నవారు మానసిక రుగ్మతల బారిన పడే చాన్స్ కూడా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.

ఎందుకు వస్తాయి?

శరీరంలో అలసట, నొప్పులు రావడానికి అనేక కారణాలు ఉండవచ్చు. తాత్కాలిక ఒత్తిడి, అలసట వంటివి అయితే పెయిన్స్ వచ్చి తగ్గిపోతుంటాయి. కానీ ఎక్కువరోజులు కొనసాగడమే ప్రమాదకరం. ఆటో ఇమ్యూన్ వ్యాధులు, ఆర్థరైటిస్, క్రానిక్ ఇన్ఫెక్షన్స్, విటమిన్ల లోపాలు వంటివి బాడీ పెయిన్స్ రావడానికి కారణం కావచ్చునని ఆర్థోపెడిక్ నిపుణులు చెప్తున్నారు. ఇలాంటప్పుడు తగిన చికిత్స తీసుకోవడం తప్పనిసరి.

పరిష్కారం ఏమిటి?

దీర్ఘకాలంగా బాడీ పెయిన్స్ ఎదుర్కొంటూ ఉంటే నిర్లక్ష్యం చేయవద్దు. వైద్య నిపుణులను సంప్రదించాలి. ఇందుకు ఇప్పుడు వివిధ రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా ప్లేట్ లెట్ - రిచ్ ప్లాస్మా (పీఆర్‌పీ) థెరపీ కూడా ఇందులో ఒకటి. దీని ద్వారా కీళ్లనొప్పులు, బాడీపెయిన్స్ తగ్గుతాయని వైద్యులు చెప్తార. అలాగే రీజనరేటివ్ మెడిసిన్ పద్ధతుల ద్వారా కూడా డాక్టర్లు దీర్ఘకాలిక ఒళ్లు లేదా కీళ్ల నొప్పులకు చికిత్స అందిస్తారు. వీటితోపాటు రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ వంటి ఫార్మకోలాజికల్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఇక ఆయుర్వేదం, సంప్రదాయ చికిత్స పద్ధతులు కూడా ఉపశమనం కలిగిస్తాయి. హీట్ అండ్ కోల్డ్ థెరపీ బాడీ పెయిన్స్‌ను తగ్గించడంలో అద్భుతంగా సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. అలాగే నొప్పి ఉన్న శరీర భాగాల్లో వేడినీటితో లేదా ఐస్ క్యూబ్‌తో కాపుకోవడం కూడా నొప్పి నివారణగా పనిచేస్తాయి.

*గమనిక:పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ దీనిని ధృవీకరించడం లేదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.

Next Story