లూఫా వాడుతున్నారా..? ఈ సమస్యలు వచ్చే చాన్స్..!

by Kanadam.Hamsa lekha |
లూఫా వాడుతున్నారా..? ఈ సమస్యలు వచ్చే చాన్స్..!
X

దిశ, ఫీచర్స్: ఈ రోజుల్లో చాలామంది స్నానం చేసేటప్పుడు, బాడీవాష్ లేదా సబ్బును శరీరానికి అప్లై చేసుకొని లూఫాను వాడుతుంటారు. ఇది మృతకణాల్ని, బ్యాక్టీరియా, పొడిబారిపోయి పొలుసుగా మారిన చర్మాన్ని తొలగించడానికి ఉపయోగపడుతుంది. సాధారణంగా ఇవి సింథటిక్, ఇతర సహజసిద్ధమైన పదార్థాలతో తయారు చేయబడతాయి. ఎలాంటి లూఫా అయినా సరే, దానిని శుభ్రంగా ఉంచుకోవాలి. కొంతమంది వీటిని వాడిన తరువాత తడి వాతావరణంలోనే పెడుతుంటారు. అయితే, ఈ లూఫా విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే పలు చర్మ సమస్యలు వస్తాయని చెబుతున్నారు నిపుణులు.

లూఫాను వాడిన తరువాత దానిని పైపైన శుభ్రం చేసి, అలాగే బాత్‌రూమ్‌లో వదిలేస్తుంటారు. తడిగా ఉన్న లూఫాను అలా తేమ ప్రదేశంలో ఉంచడం వల్ల దానిపై బ్యాక్టీరియా మరింత వృద్ధి చెందుతుంది. ఈ క్రమంలోనే ముఖంపై మొటిమలు, చర్మ సమస్యలకు కారణం అవుతుంది. అందుకే లూఫాను వాడిన తరువాత దానిని వెంటనే శుభ్రంచేసి, ఎండలో ఉంచడం మంచిది. ఒకవేళ ఇది దుర్వాసన రావడం, రంగు మారడం వంటివి జరిగితే వెంటనే దీనిని మార్చేయడం మంచిది. సాధారణంగా ఈ లూఫాలను నెలల తరబడి వాడితే చర్మ సమస్యలకు కారణం అవుతుంది. సింథటిక్ లూఫా అయితే రెండు నెలల వరకు వాడుకోవచ్చు.

ఎలా శుభ్రపరచాలి?

వారానికి ఒకసారి అయినా వెనిగర్ లేదా బ్లీచ్ కలిపిన నీటితో వేసి పది నిమిషాల పాటు లూఫాను అందులో ఉంచాలి. ఆ తరువాత దానిని ఎండలో ఆరబెట్టాలి. ముఖ్యంగా సిల్క్ వంటి లూఫాను వాడడం బదులుగా..సిలికాన్ బాత్ స్క్రబ్బర్లు లేదా వాష్‌క్లాత్ వంటి ఉత్పత్తులను ఉపయోగించడం ఉత్తమం. వీటిని వాడిన తరువాత కూడా పూర్తిగా శుభ్రం చేసుకోవాలి. అదేవిధంగా శరీరాన్ని లూఫాతో ఎక్కువ సమయం స్క్రబ్ చేయకూడదు. ఒకవేళ మీరు చర్మాన్ని షేవ్ చేసుకున్నట్లైతే ఈ లూఫాను ఉపయోగించకపోవడమే మంచిది. ఎందుకంటే దీని వల్ల ఇన్ఫెక్షన్‌లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

వీళ్లు వాడకపోవడమే మంచిది!

చర్మాన్ని శుభ్రం చేయడం కోసం చాలామంది వీటిని ఉపయోగిస్తుంటారు. కానీ, చర్మాన్ని బట్టి ఈ ఉత్పత్తులను ఎంచుకోవడం మంచిది. చర్మం మృదువుగా, సున్నితమైన చర్మతత్వం ఉన్న వారు మాత్రం ఈ లూఫాను వాడకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే దీని వల్ల స్కిన్ ఎర్రగా మారడం, దద్దుర్లు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల సున్నితమైన చర్మం గల వారు దీనిని ఉపయోగించకపోవడమే మంచిది. ఒకవేళ వాడాలని అనుకున్నప్పుడు వారానికి 2 లేదా మూడు సార్లు ఉపయోగించడం మంచిది.

*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు.

Advertisement

Next Story

Most Viewed