Hoarding Disorder : షాకింగ్.. పాత బట్టలు దాచుకోవడం ఓ రోగమే..

by Sujitha Rachapalli |
Hoarding Disorder : షాకింగ్.. పాత బట్టలు దాచుకోవడం ఓ రోగమే..
X

దిశ, ఫీచర్స్ : చిరిగిన డ్రెస్సు.. తెగిపోయిన చెప్పులు.. డేట్ అయిపోయిన వార్తా పత్రికలు.. ఫ్యూచర్‌లో పనికిరాని పుస్తకాలు.. ఇలా పాత వస్తువులను వదులుకునేందుకు బాధపడిపోతుంటారు చాలా మంది. ఒత్తిడి చేస్తే ఆందోళన, గుండెదడ, ఒళ్లంతా చెమటలు పట్టడం, ఊపిరి ఆడకపోవడం, కడుపులో సమస్య, నొప్పి వెంటాడతుంటాయి. ఈ పరిస్థితినే ‘హోర్డింగ్ డిజార్టర్’ అని పిలుస్తుండగా.. ప్రపంచంలో ఆరు శాతం మంది ఈ రుగ్మతతో బాధపడుతున్నారని తెలిపింది ఓసీడీ ఫౌండేషన్. వృద్ధుల్లో ఎక్కవుగా ఈ లక్షణాలు కనిపించినప్పటికీ.. 11 నుంచి 15ఏళ్లలో చిన్నపిల్లల్లోనూ డెవలప్ అయ్యే ప్రమాదం ఉంది. ఇంతకీ హోర్డింగ్ డిజార్డర్ అంటే ఏంటి? ఎందుకు కలుగుతుంది? ఎలా నిర్ధారించాలి? ఏ విధంగా నివారించాలి? తెలుసుకుందాం.

హోర్డింగ్ డిజార్డర్ అనేది ఒక మానసిక రుగ్మత అని మెంటల్ డిజార్డర్స్ డయాగ్నోస్టిక్ అండ్ స్టాటిస్టికల్ మాన్యువల్ ఫిఫ్త్ ఎడిషన్ పేర్కొంది. అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్‌గా పరిగణిస్తుంది. ఆర్థికంగా విలువైనవి కాకపోయినా వస్తువులను విడిచిపెట్టాల్సి వచ్చినప్పుడు లేదా వదులుకునేందుకు ప్రయత్నించినప్పుడు తీవ్రమైన ఒత్తిడి కలుగుతుంది. చెత్తలో పడేస్తే తర్వాత ఏమైపోతుందనే ఆలోచన వెంటాడుతుంది. ఇతరులకు ఇస్తే సరిగ్గా ట్రీట్ చేస్తారో లేదోననే బాధ కలుగుతుంది. దీనివల్ల వాటిని పడేసేందుకు మనసొప్పకపోవడంతో.. ఈ విషయంలో తల్లిదండ్రులు, తోబుట్టువులు, భాగస్వాములతో గొడవలు జరుగుతాయి. వారితో బంధంపై ఎఫెక్ట్ పడుతుందని చెప్తున్నారు నిపుణులు.

కారణాలు

1. జన్యుశాస్త్రం

ఆందోళన లేదా ఇతన మానసిక అనారోగ్యాలు ఇప్పటికే ఫ్యామిలీ హిస్టరీలో ఉన్నట్లయితే అలాంటి కుటుంబంలో వ్యక్తుల్లో హోర్డింగ్ డిజార్డర్ వచ్చే అవకాశం అధికం. కాగా యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ వెటరన్స్ అఫైర్స్ ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. జన్యుపరమైన కారణాల వల్ల ఈ డిజార్డర్‌లో 50 శాతం వ్యత్యాసాలున్నాయి.

2. బాధాకరమైన సంఘటనలు

చిన్ననాటి గాయాలు, అనుభవించిన బాధలు, ఓసీడీ, భయాలు ఇందుకు దారితీస్తాయి. చాలా మంది జీవితాల్లో తట్టుకోలేని పరిస్థితులు ఎదురవుతాయి. ముఖ్యంగా విడాకులు లేదా భాగస్వామి చనిపోవడం వంటి ఒత్తిడితో కూడిన పరిస్థితులు ఇలాంటి రుగ్మతకు దారితీస్తాయి.

3. మానసిక ఆరోగ్య పరిస్థితి

ఓసీడీ, ఏడీహెచ్‌డీ ఉన్న ఇప్పటికే ఉన్న వ్యక్తుల్లో హోర్డింగ్ డిజార్డర్ కూడా ఉంటుంది. తరుచుగా ఆందోళన, డిప్రెషన్ కూడా ఇందుకు దారితీస్తుందని NHS పేర్కొంది. హోర్డింగ్ డిజార్డర్ 2013 వరకు అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ (OCD) లేదా అబ్సెసివ్ కంపల్సివ్ పర్సనాలిటీ డిజార్డర్ (OCPD)లో భాగంగా ఉందని.. ఆ తర్వాత ఇది స్వతంత్ర రుగ్మతగా కనిపించిందని తెలిపింది.

4.ఆత్మగౌరవం తగ్గిపోవడం

అహం, ఆత్మ గౌరవం లేకపోవడం హోర్డింగ్ డిజార్డర్‌కు కారణమవుతున్నాయి. న్యూరోసైకియాట్రిక్ డిసీజ్ అండ్ ట్రీట్మెంట్‌లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం ఈ వ్యాధితో బాధపడుతున్న రోగులు తక్కువ మెమొరీ పవర్ కలిగి ఉన్నామని అనుకుంటారు. తాము గుర్తుంచుకున్న విషయాలపై నమ్మకం ఉండదు. పైగా భవిష్యత్తులో ఎదురయ్యే పరిణామాల గురించి అతిగా అంచనావేస్తారు.

నిర్ధారణ-చికిత్స

1. క్లినికల్ సైకాలజిస్ట్ రోగి కేస్ హిస్టరీ, మానసిక స్థితి ఆధారంగా రోగ నిర్ధారణ చేస్తారు.

2. హోర్డింగ్ డిజార్డర్ చికిత్సలో కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ఒకటి. కాగా వస్తువులను విడిచిపెట్టేందుకు ఎందుకు బాధపడుతున్నారనే విషయంపై సెషన్ ఫోకస్ చేస్తుంది. ఆ ఆలోచనా విధానాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తుంది.

3. ఇక సిస్టమాటిక్ డీసెన్సిటైజేషన్ కూడా ఒక చికిత్స. కాగా ఇందులో వస్తువులను వదులుకునేందుకు బాధపడే పరిస్థితులను సృష్టిస్తారు. ఇకపై ఇలాంటి భయాలు లేకుండా ట్రీట్మెంట్ అందిస్తారు.

4. సమస్య తీవ్రతను బట్టి మానసిక చికిత్సా మందులు కూడా ఇవ్వొచ్చు.

Advertisement

Next Story