- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అప్పులు చేద్దాం..అమ్ముకుతిందాం..
ఒకవైపు ఆర్థిక మాంద్యం వెంటాడుతూ ఉందనీ, ఆర్థిక వృద్ధి రేటు పడిపోయిందని చెప్తూనే గతేడాది సెప్టెంబరు బడ్జెట్‌కన్నా సుమారు 25 % మేర ఈ సారి బడ్జెట్ సైజును ప్రభుత్వం పెంచింది. కేంద్రం నుంచి సాయం తగ్గిందని, 15వ ఆర్థిక సంఘం సిఫారసుల కారణంగా కొంత నష్టపోతున్నామని చెప్తూనే రానున్న ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను రూ.1.82 లక్షల కోట్లుగా ఖరారు చేసింది. ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు తొలిసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. కేంద్రం నుంచి పెద్దగా సహకారం ఉండదని భావిస్తూ రాష్ట్ర స్వీయ ఆదాయ వనరులపై నమ్మకం పెట్టుకుంది. దీనికి తోడు బహిరంగ మార్కెట్ల ద్వారా సుమారు రూ. 34 వేల కోట్లను సమకూర్చుకోవాలనుకుంటోంది. అయినా సుమారు రూ. 4,337 కోట్ల మిగులు ఉండనున్నట్లు అంచనా వేసింది.
రాష్ట్ర స్వీయ ఆదాయ వనరులను పెంచుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వ భూములను అమ్మాలనుకుంటోంది. ఇంకోవైపు మైనింగ్ ద్వారా గణనీయమైన ఆదాయాన్ని ఆర్జించాలనుకుంటోంది. అదే సమయంలో ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా ఉండేందుకు రుణమాఫీ, రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలపై గంపెడాశలు పెట్టుకుంది. పాతికవేల లోపు పంటరుణాలు ఉన్న రైతులకు ఒకే విడతలో రుణమాఫీ అమలుచేయనున్నట్లు ప్రకటించి ఇందుకోసం ఈ బడ్జెట్‌లో రూ.1,198 కోట్లను కేటాయించింది. ఇది కాక అంతకంటే ఎక్కువ రుణాలు ఉన్న రైతులకు నాలుగు విడతల్లో రుణమాఫీ చేయనున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం తొలి విడత కోసం ఈ బడ్జెట్‌లో రూ. 6,225 కోట్లను కేటాయించింది.
ప్రభుత్వ భూముల విక్రయం :
వివిధ ద్రవ్య సంస్థల నుంచి, బహిరంగ మార్కెట్ల నుంచి తెస్తున్న అప్పులన్నింటినీ కాపిటల్ వ్యయం (స్థిర అభివృద్ధి) రూపంలో ఖర్చు చేస్తున్నామని ప్రభుత్వం గొప్పగా చెప్తోంది. ఇందుకు కాళేశ్వరం ప్రాజెక్టు సహా పలు సాగునీటి ప్రాజెక్టులను, మిషన్ భగీరథ లాంటి వాటిని ప్రస్తావిస్తోంది. కానీ, భారీ స్థాయిలో చేస్తున్న ఖర్చుల్ని భరించడం సాధ్యం కాకపోవడంతో రాష్ట్ర స్వీయ ఆర్థిక వనరులను లక్ష్యంగా చేసుకుంది. ఇందుకోసం ప్రభుత్వ భూముల్ని అమ్మి సుమారు రూ. 30,600 కోట్లను పన్నేతర పద్దు కింద ఆర్జించాలనుకుంటోంది.
గత బడ్జెట్‌లోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ భూముల్ని అమ్మడం ద్వారా రూ. 10 వేల కోట్లను ఆర్జిద్దామని ప్రతిపాదించారు. అదికాస్తా ఈ బడ్జెట్‌లో ఏకంగా మూడు రెట్లు పెరిగింది. భూముల్ని అమ్ముకోవడాన్ని ప్రభుత్వం తనదైన శైలిలో సమర్థించుకుంది. ”రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం ఉనికిలో లేని దశలో ప్రభుత్వం హౌసింగ్ బోర్డు, రాజీవ్ స్వగృహ లాంటి సంస్థలను ఏర్పాటుచేసింది. వర్తమాన కాలంలో రియల్ ఎస్టేట్ రంగం పెద్ద పరిశ్రమగా విస్తరించింది. ఈ దశలో ప్రభుత్వ రంగంలో ఉన్న రాజీవ్ స్వగృహ తరహాలో నిరర్థకంగా పడి ఉన్న ఆస్తులను పారదర్శకంగా విక్రయించడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. మన రాష్ట్రం ఖనిజ సంపదకు నెలవు. ఇసుక, ఇతర ఖనిజాల ద్వారా వచ్చే ఆదాయాన్ని మరింత పెంచుకునేందుకు పకడ్బందీ వ్యూహాన్ని అమలుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది” అని మంత్రి హరీశ్‌రావు తన బడ్జెట్ ప్రసంగంలో మనసులోని మాటను చెప్పారు.
పేరుకుపోతున్న అప్పులు :
రాష్ట్రం ఏర్పడేనాటికి రూ. 61,711 కోట్లుగా ఉన్న ప్రభుత్వ అప్పు తాజా బడ్జెట్‌లో రూ. 2.29 లక్షల కోట్లకు పెరిగింది. అంటే దాదాపుగా నాలుగు రెట్లు పెరిగింది. తలసరి ఆదాయం పెరుగుతోందంటూ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటూనే తలసరి అప్పును కూడా గణనీయంగా పెంచింది. గతేడాది సెప్టెంబరులో ప్రవేశపెట్టిన బడ్జెట్ నాటికి ప్రభుత్వ అప్పు రూ.2.03 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా వేసింది. సవరించిన అంచనాలతో అది రూ.1.99 లక్షలకు తగ్గింది. అంటే మొత్తం రాష్ట్ర జీఎస్‌డిపిలో అది 20.55%గా ఉంది. తాజా బడ్జెట్‌లో ఆ అప్పు రూ. 2.29 లక్షల కోట్లకు చేరుకుంటుందని స్పష్టం చేసింది. అంటే స్వల్పంగా కొంత పెరిగి మొత్తం జీఎస్‌డీపీలో 20.74 శాతానికి చేరుకుంది.
సంక్షేమ రాగం :
ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను అమలుచేసే దిశగా ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం హామీ ఇచ్చింది. గత బడ్జెట్‌లోనూ ఇలాంటి హామీలనే ప్రస్తావించింది. రుణమాఫీ, నిరుద్యోగ భృతి, ఆసరా పింఛనుదార్ల అర్హతా వయసు కుదింపు, ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు.. ఇలాంటి అనేక హామీలు కాగితాలకే పరిమితమైపోయాయి. ఆచరణ రూపం దాల్చలేదు. ఈ పరిస్థితుల్లో ఈసారి రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ లాంటి హామీలను మళ్లీ ప్రస్తావించింది. అందులో భాగమే పాతికవేల లోపు పంట రుణం వున్న రైతులకు ఒకే విడతలో రుణమాఫీ చేస్తామన్న హామీ.
ఇక రైతుబంధు కోసం గత బడ్జెట్‌లో రూ. 12 వేల కేటాయింపు చేసినా దాదాపు ఒకటిన్నర వేల రూపాయలు విడుదలే చేయలేదు. ఇక రుణమాఫీ, నిరుద్యోగ భృతి లాంటి అంశాలను పట్టించుకోనే లేదు. ఈ నేపథ్యంలో ఈ సారి రైతుబంధుకు రూ. 14 వేల కోట్లను, రైతుబీమాకు రూ. 1,141 కోట్లను, కేటాయించింది. ఇవి కాక రైతు వేదికల నిర్మాణం కోసం రూ. 350 కోట్లను, గిట్టుబాటు ధర కల్పించలేని పక్షంలో మార్కెట్ ఇంటర్‌వెన్షన్ పథకం కింద రూ 1000 కోట్లను, విత్తనాలు-ఎరువుల కోసం రూ. 142 కోట్లను కేటాయించింది.
ఆసరా పింఛన్లపైనా కురిసిన ప్రేమ :
ఆసరా పింఛన్లు ప్రభుత్వానికి ఆర్థికంగా గుదిబండగా తయారైనా బడ్జెట్‌లో కేటాయింపుల్ని మాత్రం ఘనంగానే చేసింది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన అర్హతా వయసు కుదింపు హామీ ఏడాదిన్నర అయినా అమలులోకి రాలేదు. రానున్న ఆర్థిక సంవత్సరం కచ్చితంగా అమలుచేస్తామని భరోసా కల్పించి బడ్జెట్‌లో ఇందుకోసం రూ. 11,758 కోట్లను కేటాయించింది. గతేడాది కేటాయింపు రూ. 9,402 కోట్లు మాత్రమే. వయసు కుదిస్తున్నందున లబ్ధిదారుల సంఖ్య పెరుగుతుందన్న అంచనాతో అదనపు కేటాయింపులు చేసింది. వడ్డీలేని రుణాల కింద రూ. 1200 కోట్లను కేటాయిస్తున్నట్లు ప్రకటించింది.
మరోసారి తెరపైకి ‘ఆత్మగౌరవ భవన్’లు :
గడచిన మూడేళ్లుగా ‘ఎక్కడ వేసిన గొంగళి… ‘ తరహాలో ఉండిపోయిన ‘ఆత్మగౌరవ భవన్’లకు మళ్లీ ఈ బడ్జెట్‌లో స్థానం లభించింది. ఈ భవన్‌లను త్వరితగతిన పూర్తిచేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇందుకోసం వెనకబడిన తరగతుల సంక్షేమం పద్దులో రూ. 4,356 కోట్లను కేటాయించింది. ఇది కాకుండా ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ. 500 కోట్లు కేటాయించింది. కల్యాణలక్ష్మి పథకానికి రూ. 1,350 కోట్లు, షాదీ ముబారక్ సహా మైనారిటీల సంక్షేమం కోసం రూ. 1,518 కోట్లను కేటాయించింది.
జీహెచ్ఎంసీ ఎన్నికలపై ప్రేమతో…
త్వరలో గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నందున ఈ సారి బడ్జెట్‌లో ప్రభుత్వం రకరకాల పథకాలకు కేటాయింపులు చేసి కొత్త ఆశల్ని చూపించింది. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం రానున్న ఐదేళ్లలో సుమారు రూ. 50 వేల కోట్లు ఖర్చు కానున్నట్లు అంచనా వేసి ఈసారి బడ్జెట్‌లో రూ. 10 వేల కోట్లను కేటాయించింది. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు పనులు కూడా ఇందులో భాగంగా జరగనున్నట్లు పేర్కొనింది.
డబుల్ బెడ్‌రూమ్‌పై పాత పాటే :
ఐదారేళ్లుగా డబుల్ బెడ్‌రూమ్ పాట వినిపిస్తూ ఉంది. ఈసారి బడ్జెట్‌లో సైతం అది ప్రతిబింబించింది. దీంతో పాటు మొత్తం గృహనిర్మాణ రంగానికి రూ. 11,917 కోట్లను కేటాయించింది. యథావిధిగా ‘స్వంత స్థలం కలిగిన పేదలు వారి స్థలంలోనే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కట్టుకోవాలనుకుంటే ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుంద’ని ప్రకటించింది. గత బడ్జెట్‌లోనూ దీన్ని ప్రస్తావించింది. కానీ ఆచరణ శూన్యం. ఇప్పుడు దాన్ని మరింతగా నొక్కిచెప్పి సుమారు లక్ష మంది లబ్ధిదారులకు ప్రయోజనం కలుగుతుందని పేర్కొంది.
పడిపోయిన వృద్ధిరేటు :
అతి ఎక్కువ ఆర్థిక వృద్ధి రేటుతో యావత్తు దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందంటూ ప్రభుత్వం ఇంతకాలం చాలా గొప్పగా చెప్పుకుంది. కానీ, తాజా బడ్జెట్‌లో మాత్రం ఆ ధీమా కనిపించలేదు. రాష్ట్ర స్వీయ ఆర్థిక వృద్ధి రేటు 21.5% నుంచి 6.3%కి పడిపోయింది. సుమారు 15.2% తగ్గిపోయింది. అదే సమయంలో కేంద్రం నుంచి పెద్దగా ఆర్థిక సాయం అందుతుందన్న నమ్మకాన్నీ ప్రభుత్వం కోల్పోయింది. ఇటు రాష్ట్ర స్వీయ ఆర్థిక వనరులు లేకపోవడం, కేంద్రం నుంచి ఆశించినట్లుగా రాకపోవడంతో ప్రభుత్వ భూముల్ని అమ్మడం, మైనింగ్ ద్వారా ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించడం, ద్రవ్య సంస్థల నుంచి అప్పులు తీసుకోవడం మినహా మరో మార్గం లేకుండా పోయింది. అందుకే మొత్తం రూ. 1.82 లక్షల కోట్లలో సుమారు మూడింట ఒక వంతు (రూ. 64 వేల కోట్లు) కేవలం అప్పులు, ప్రభుత్వ భూముల అమ్మకం ద్వారానే సమకూర్చుకోనుంది.
tags: Telangana, Budget, 2020-21, government lands sale, mining, revenue, surplus, GSDP, growth, KCR, Harish Rao