షాద్‌నగర్‌లో తాజాగా ముగ్గురికి..

by vinod kumar |
షాద్‌నగర్‌లో తాజాగా ముగ్గురికి..
X

దిశ, రంగారెడ్డి: వ్యాపార కార్యకళాపాలతో కళకళలాడే షాద్‌నగర్ కంటైన్మెంట్ జోన్‌గా మారడంతో పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది. షాద్‌నగర్‌లో కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఇటీవల షాద్‌నగర్‌‌కు చెందిన ఇద్దరి యువకులకు కరోనా సోకడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. వీరు ఉంటున్న ఏరియాలో మరో 34 మంది నమూనాలను పరీక్షల కోసం తరలించారు. దీంతో మరో మూడు కొత్త పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.

పట్టణంలోని ఈశ్వర్ కాలనీకి చెందిన యువకుడికి మొదట కరోనా సోకింది. తరువాత అతనితో సంబంధం ఉన్న విజయ‌నగర్ కాలనీకి చెందిన మరో యువకుడికి కోవిడ్ 19 నిర్ధారణ అయింది. తాజాగా ఈశ్వర్ కాలనీకి చెందిన యువకుడి తల్లిదండ్రులు, అన్నకు పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో మొత్తంగా ఆ కుటుంబంలో నలుగురికి కరోనా వచ్చింది. దీంతో షాద్‌నగర్‌లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5కు చేరుకుంది. ఇప్పటికే 34 మంది ప్రైమరీ కాంటాక్ట్‌లను గుర్తించి.. క్వారంటైన్ చేశారు. షాద్‌నగర్ పట్టణంలోని వినాయక గంజ్, విజయనగర్ కాలనీ, ఈశ్వర్ కాలనీ, మెయిన్ రోడ్డు ప్రాంతాలు కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించాక మూడు కేసులు వెలుగులోకి వచ్చాయి. 14 రోజుల పాటు కంటైన్మెంట్ జోన్లలో ఎటువంటి వ్యాపారాలు నిర్వహించవద్దని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.

షాద్‌నగర్ కరోనా బాధితులు హైదరాబాద్‌లోని జియాగూడలో ఇటీవల జరిగిన ఓ వ్యక్తి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. సదురు వ్యక్తి కరోనా సోకి మరణించాడని తెలుస్తోంది. ఈ అంత్యక్రియల్లో నిబంధనలు, జాగ్రత్తలు ఏమీ తీసుకోకపోవడంతో వీరికి కరోనా సోకినట్లు గుర్తించారు. ప్రస్తుతం ఆ అంత్యక్రియల్లో పాల్గొన్న వారితో పాటు, వారికి సంబంధం ఉన్న వ్యక్తులను గుర్తించే పనిలో పడ్డారు అధికారులు. జియాగూడ అత్యక్రియలకు వెళ్లిన కుటంబంతోనే షాద్‌నగర్‌లో కరోనా వ్యాప్తి చెందిందని వైద్య వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. తాజాగా మరో ముగ్గురికి పాజిటివ్ రావడంతో పట్టణ వాసుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వైద్య సిబ్బంది ఉన్నఫలంగా ఈశ్వర్ కాలనీకి వెళ్లి.. పాజిటివ్ వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఎవరెవరిని కలిశారు? ఎక్కడికి వెళ్లారు? అనే కోణంలో సర్వే నిర్వహిస్తున్నారు. మొదట్లో పాజిటివ్ వచ్చిన యువకుడి సోదరుడు ఇప్పుడు ఎంత మందిని కలిశారు? అన్నది తెలియాల్సి ఉంది. తాజా కరోనా కేసులు పెరుగుతుండటంతో పట్టణంలో ఆంక్షలు మరింత పెరిగే ఆస్కారం ఉంది.

Advertisement

Next Story

Most Viewed