బీఆర్ఎస్‌లోకి తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్ కుమార్?

by GSrikanth |   ( Updated:2023-04-25 01:56:15.0  )
బీఆర్ఎస్‌లోకి తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్ కుమార్?
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో చేరారా?.. లేక త్వరలో చేరబోతున్నారా?.. దానికి తగిన గ్రౌండ్‌ను ప్రిపేర్ చేసుకున్నారా?.. పార్టీ అధినేత కేసీఆర్ సైతం ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా?.. వివిధ రాష్ట్రాల్లో జరిగే బీఆర్ఎస్ మీటింగుల్లో ఇకపైన పాల్గొననున్నారా?.. వీటన్నింటినీ దాదాపుగా ఔననే సమాధానమే వస్తున్నది. ఔరంగాబాద్‌లో కేసీఆర్ అధ్యక్షతన సోమవారం జరిగిన బహిరంగసభలో సోమేశ్ కుమార్ ప్రత్యక్షమయ్యారు. సభలో పాల్గొనడానికి కొన్ని నిమిషాల ముందు మహారాష్ట్ర పొలిటీషియన్ అభయ్ పటేల్ నివాసంలో జరిగిన సమావేశంలోనూ పాలుపంచుకున్నారు. ఫస్ట్ టైమ్ బీఆర్ఎస్ పొలిటికల్ వేదిక మీద సోమేశ్ కుమార్ కనిపించారు.

స్వయంగా పరిచయం చేసిన సీఎం

సుదీర్ఘకాలం పాటు వివిధ హోదాల్లో బ్యూరోక్రాట్‌గా కనిపించిన సోమేశ్ కుమార్ ఇప్పుడు రాజకీయ సమావేశాల్లో పాల్గొనడం విశేషం. బహిరంగ సభ వేదిక మీద ఆయనను మహారాష్ట్ర ప్రజలకు కేసీఆర్ పరిచయం చేస్తూ.. ‘తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. తెలంగాణను ఒక మోడల్ స్టేట్‌గా తీర్చిదిద్దడంలో కృషి చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలోనూ నాతో కలిసి పాలుపంచుకున్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం నాతో పాటు 24 గంటలూ పనిచేసిన గొప్ప వ్యక్తి...’ అని పేర్కొన్నారు. ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిగా కనిపించిన సోమేశ్ కుమార్ హఠాత్తుగా ఇప్పుడు ఎవ్వరి ఊహకు అందని తీరులో ఔరంగాబాద్ పొలిటికల్ మీటింగ్‌లో కనిపించడం చర్చనీయాంశంగా మారింది.

పార్టీలో పోషించే పాత్రేమిటి?

ఔరంగాబాద్ బహిరంగసభ వేదిక మీద నుంచి ఆయనను అక్కడి ప్రజలకు కేసీఆర్ స్వయంగా పరిచయం చేయడంతో గులాబీ నేతగా మారిపోయారనే సందేశం ఇచ్చినట్లయింది. బీఆర్ఎస్‌లో ఇకపైన సోమేశ్ కుమార్ ఎలాంటి పాత్ర పోషించబోతున్నారు.. ఆయనకు కేసీఆర్ ఎలాంటి బాధ్యతలు అప్పజెప్పనున్నారు.. తెలంగాణలోనూ ఆయన సేవలు కొనసాగుతాయా.. లేక ఇతర రాష్ట్రాల వ్యవహారాలపైనే దృష్టి పెడతారా.. వీటన్నింటినీ రానున్న కాలంలో సమాధానం లభించనున్నది. ఐఏఎస్‌గా ఆయన పదవీకాలం ఈ ఏడాది డిసెంబరు చివరి వరకూ ఉన్నది. సర్వీస్ పూర్తయిన తర్వాత కేసీఆర్‌తో కలిసి పనిచేస్తారని అప్పట్లోనే వార్తలు వచ్చాయి. సలహాదారుగానూ, కన్సల్టెంట్‌గానో కేసీఆర్‌తోనే కలిసి పనిచేస్తారని అటు పార్టీ నేతల నుంచి, ఇటు సచివాలయ అధికారుల నుంచి వినిపించాయి.

ఏపీ కేడర్.. ఆ తర్వాత వీఆర్ఎస్

ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రత్యూష్ సిన్హా కమిటీ సిఫారసుల మేరకు ఆయన ఆంధ్రప్రదేశ్ కేడర్‌ కు అలాట్ అయ్యారు. కానీ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించి తెలంగాణలో పనిచేయడానికి రిలీఫ్ పొందారు. చివరకు ఇది వివాదాస్పదమై తెలంగాణ హైకోర్టుకు చేరింది. సుదీర్ఘకాలం తర్వాత విచారణ జరిగి జనవరిలో ఆయనను ఏపీ కేడర్‌గా వెళ్లిపోవాల్సిందేనంటూ తీర్పు వెలువడింది. దీనికి అనుగుణంగా కేంద్ర డీవోపీటీ మంత్రిత్వశాఖ సైతం ఆగమేఘాల మీద ఉత్తర్వులు జారీచేసి జనవరి 12 లోగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చేరాలని ఆదేశించింది. దానికి అనుగుణంగా జనవరి 12న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి లాంఛనంగా ఆ రాష్ట్ర కేడర్‌గా జాయిన్ అయ్యారు. నెల రోజులు దాటినా ఆయనకు ఆ రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వలేదు. దీంతో ఆయన స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్)కు దరఖాస్తు చేసుకున్నారు. ఫిబ్రవరి 17న ఆ దరఖాస్తుకు ఆమోదం తెలిపినట్లు అక్కడి సచివాలయ వర్గాలు పేర్కొన్నాయి. అప్పటి నుంచి హైదరాబాద్‌లోని నివాసానికి మాత్రమే పరిమితమైన సోమేశ్ కుమార్... తెలంగాణలో సీఎంకు దగ్గరగా ఉండేలా ఏదో ఒక పోస్టులో కొనసాగుతారనే వార్తలు వినిపించాయి.

ఆ మేరకు కసరత్తు కూడా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఢిల్లీలో సేవలందించడానికి నియమితులవుతారని ప్రగతి భవన్ వర్గాలు సూచనప్రాయంగా తెలిపాయి. దానికి అనుగుణంగానే ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో స్పెషల్ రిప్రజెంటేటివ్‌గా ఆయనకు ఛాంబర్ కూడా రెడీ అయింది. అనూహ్యంగా ఆయన ఔరంగాబాద్ బహిరంగసభ మీద ప్రత్యక్షం కావడం విశేషం. పార్టీలో ఎప్పుడు చేరారనే చర్చలు జోరందుకున్నాయి. ఆయనతో పరిచయం ఉన్న ఐఏఎస్‌లు సైతం ఒక్కసారిగా పొలిటికల్ వేదిక మీద చూసి అవాక్కయ్యారు. సర్వీస్ పూర్తయిన తర్వాత 2024 పార్లమెంటు ఎన్నికల్లో బిహార్‌లోని మధుబని లోక్‌సభ స్థానం నుంచి బీఆర్ఎస్ తరఫున ఎంపీగా పోటీ చేస్తారన్న ఊహాగానాలూ వినిపిస్తున్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ నేతగా కనిపిస్తున్నందున ఈ వార్తలకు తగినట్లుగానే ఆయన ఇకపైన పొలిటికల్ రోల్ పోషించనున్నట్లు తెలుస్తున్నది.

Advertisement

Next Story

Most Viewed