తైవాన్‌లో మరోసారి భారీ భూకంపం.. వీడియో వైరల్

by D.Reddy |
తైవాన్‌లో మరోసారి భారీ భూకంపం.. వీడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: దక్షిణ తైవాన్‌లో సోమవారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. యుజింగ్ జిల్లాలో పలుమార్లు భూమి కపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.4గా నమోదైనట్లు తైవాన్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. భూకంప తీవ్రతకు ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. మొదట యుజింగ్ జిల్లాలోని తైనన్ నగరానికి 4కి.మీ. దూరంలో 5.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. అనంతరం అదే ప్రాంతంలో 4.8 తీవ్రతతో మరోసారి భూమి కంపించింది. అర్ధరాత్రి దాటాక మరోసారి 6.4 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. అధికారులు చియాయి కౌంటీలోని దాపు టౌన్‌షిప్‌లో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఇది 9.4కి.మీ. లోతులో ఉన్నట్లు వెల్లడించారు.

ఈ భూకంప ఘటనలో పలు ఇల్లు కూలిపోయాయి. 27 మందికి పైగా గాయపడ్డారు. నాన్క్సీ జిల్లాలో ఓ ఇల్లు కూలిపోగా, ఆ ఇళ్లలో చిక్కుకున్న ఓ చిన్నారి సహా ముగ్గురు వ్యక్తులను రెస్క్యూ సిబ్బంది కాపాడారు. దక్షిణ తైవాన్‌ మాత్రమే కాకుండా భూకంప ప్రభావం రాజధాని తైపీ వరకు కూడా కనిపించింది. బాధితుల రక్షణ కోసం ప్రభుత్వం రెస్క్యూ చర్యలను వేగవంతం చేసింది. కూలిన ఇళ్ల వద్ద సహాయ చర్యలు చేపడుతూ, ప్రాణ నష్టం నివారించేందుకు చర్యలు తీసుకుంటోంది. కాగా, భూకంపాల‌కు ఎక్కువగా గురయ్యే తైవాన్‌ ప్రజలను తాజాగా సంభవించిన ఈ భూకంపం మరోసారి అల్లకల్లోల పరిస్థితుల్లోకి నెట్టేసింది.

తరచూ భూకంపాలు

తైవాన్.. టెక్టోనిక్ ప్లేట్ సరిహద్దులకు దగ్గరగా ఉండటంతో ఇక్కడ తరచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. గతంలో కూడా తైవాన్‌లో పలు భారీ భూకంపాలు సంభవించాయి. 1999 సెప్టెంబర్ 21న 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం ప్రపంచవ్యాప్తంగా పెద్ద ప్రకంపనలను సృష్టించింది. ఈ భూకంపంలో దాదాపు 2,400 మంది మరణించారు. వేలాదిగా గాయపడ్డారు. 2016లో కూడా మరో భారీ భూకంపం సంభవించి 100 మందికి పైగా మరణించారు. గతేడాది ఏప్రిల్‌లో తైవాన్ పర్వత తూర్పు తీరంలోని హువాలియన్ ప్రాంతంలో 7.4 తీవ్రతతో పెద్ద భూకంపం సంభవించి 13 మంది మరణించారు. 1,000 మందికి పైగా గాయపడ్డారు. భవిష్యత్తులో కూడా ఈ ప్రాంతంలో ఇంకా ఎక్కువ భూకంపాలు సంభవించే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం మరింత సమర్థవంతమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


Next Story

Most Viewed